వేమిరెడ్డి సతీమణికి నారా భువనేశ్వరి సంఘీభావం
posted on Jul 9, 2025 4:03PM

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భువనేశ్వరి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో నారా భువనేశ్వరి స్పందించారు. మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతిరెడ్డికి తాను పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు నారా భువనేశ్వరి.
ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న భువనేశ్వరి, మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు వారి విలువను తగ్గించలేవన్నారు. మహిళల స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవన్నారు. మన సంస్కృతి, విలువలు ఆడవారిపై గౌరవాన్ని నిలబెట్టాయనీ, దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.