అమరావతిలో తొలి అడుగు.. వచ్చే డిసెంబరు నాటికి ఎంఎల్ఏ క్వార్టర్లు సిద్దం!
posted on Jul 9, 2025 5:06PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సముదాయాలలో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలూ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే సౌర విద్యుత్, గ్రౌండ్ వాటర్ రీచార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ వంటి మెరుగైన వసతులు కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం (జులై 9)న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల సముదాయాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ క్వార్టర్ల నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వసతి గృహ సముదాయాన్ని మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నారు. ఇవి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని సభాపతి తెలిపారు. అదే విధంగా 35 మంది మంత్రులూ, న్యాయమూర్తుల కోసం కూడా అమరావతిలో క్వార్టర్స్ నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ నివాస సముదాయాలకు కూడా మంత్రుల క్వార్టర్స్ తో పాటు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని స్పీకర్ ఈ సందర్భంగా సూచించారు.అలాగే.. బయటి రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అమరావతికి వచ్చినప్పుడు వారికి తాత్కాలిక వసతులు కల్పించేలా కూడా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పోతే సీఎం అధికార నివాసం, రాజ్ భవన్ లు కృష్ణానది ఒడ్డున నిర్మితమౌతాయి.
అదలా ఉంటే.. ఆగస్టు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తెలుగుదేశం కూటమి ఏడాదిపాలనపై ప్రత్యేక చర్చ సహా వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
.webp)