కల్తీ డీజిల్‌తో ఆగిపోయిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌

 

ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సీఎం మోహన్‌ యాదవ్‌, భోపాల్ నుంచి రాట్లం ప్రాంతానికి నిన్న ఓ అధికారిక కార్యక్రమానికి వెళ్తుండగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. వెంటనే వాటిని రోడ్డు పక్కకు తోసి, వేరే కార్లును తెప్పించి ముఖ్యమంత్రిని పంపించారు. మార్గమధ్యంలో దోసిగావ్‌ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయెల్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్‌ కొట్టించారు.

ఆ తర్వాత కొంతదూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. దీంతో సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. సీఎం కాన్వాయ్‌ ఆగిందన్న సమాచారం రాగానే స్థానిక యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. వాహనాలు ఎందుకు బ్రేక్‌డౌన్‌ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్‌ ట్యాంక్‌ తెరిచిచూడగా అందులో నీళ్లు కన్పించాయి.

వాహనాల్లో నింపిన డీజిల్‌ను బయటకు తీయగా.. సగానికి సగం అందులో  నీరు కలిపినట్లుగా ఉంది. డీజిల్‌ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంక్‌లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదేవిధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్‌ పంప్‌ను తనిఖీ చేసి కల్తీని నిర్ధరించారు. ఆ బంక్‌ను సీజ్‌ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో  కార్లకు  కల్తీ డీజిల్‌ కొట్టించడంతో హాట్ టాఫిక్‌గా మారింది.