చేవెళ్ల సభలో చేరికలు అనుమానమే!
posted on Apr 23, 2023 7:32AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివాకం (ఏప్రిల్ 23) హైదరాబాద్ వస్తున్నారు. అయితే, ఆయన కేంద్ర హోం మంత్రిగా మాత్రమే హైదరాబాద్ రావడం లేదు. . దేశ వ్యాప్తంగా ఇంతవరకు బీజేపీ ఒక్కసారి కూడా గెలవని 160 లోక్ సభ నియోజక వర్గాలలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 23) చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు.
అందుకే అమిత్ షా పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు అమిత్ షా పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చేవెళ్ల సభను సక్సెస్ చేసేందుకు ఉన్న ఏ చిన్న అవకాశం చేజారకుండా శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక విధంగా చేవెళ్ల సభను మరో ఆరేడు నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విజయ సంకల్ప సభగా భావిస్తున్నారు. అందుకే బీజేపీ నాయకులు బాధ్యతలు పంచుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా, లక్ష మందితో సభ నిర్వహిస్తామని, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర ముఖ్యనేతలు పదే పదే ప్రకటించిన నేపధ్యంలో పార్టీ నేతలు జన సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే చేవెళ్ళ సభ సక్సెస్ ను నిర్ణయించేది కేవలం జనం హాజరు మాత్రమే కాదని పార్టీలో చేరేందుకు వెనక ముందవుతున్నఇతర పార్టీల నాయకులను మేరకు ఆకట్టుకుంటారు అనేది కీలకమని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా రేపటి ఎన్నికలల్లో బీఆర్ఎస్ ను ఓడించేదుకు బీజేపీ ఎంత సిద్దంగా ఉంది. కమల నాధుల చిత్తశుద్ధి ఎంత అనే విషయంలో వ్యక్తమవుతున్న అనుమానాలను అమిత్ షా ఏ మేరకు నివృత్తి చేస్తారు అనేది కూడా కీలకమని విశ్లేషకుకులు భావిస్తున్నారు.
అలాగే, అమిత్ షా సమక్షంలో కాషాయం కట్టేదెవరు అనే విషయంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు అవసరం అయితే బొంత పురుగును ముద్దు పెట్టుకునేదుకు సిద్దమంటున్న బీఆర్ఎస్ బహిష్కృత నేతలు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు చేవెళ్ల సభలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరతారా? అనే విషయంపై రాజకీయ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరురుగుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చేవెళ్ల సభలో పెద్దగా చేరికలు ఉండవని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఇద్దరు చేరే అవకాశాలు అసలేమాత్రం లేవని అంటున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి మరి కొద్దిమంది ఇతర నేతలు వారి అనుచరులు మాత్రమే చేవెళ్ల సభలో కమలం గూటికి చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.
ఇది చేరికల సభ కాదు, చేరిక సన్నాహక సభ అని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలుగు వన్ కు చెప్పారు. అయినా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పై బీజేపీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే, నేతల ఆశలను అమిత్ షా ఏ మేరకు నెరవేరుస్తారు అనేది చూడాల్సి ఉంది. కాగా చేవేళ్ల బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. పార్టీ నేతలు సభా దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.