సత్యాపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు

జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. 2019లో జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన దారుణ ఘటనకు కేంద్రం, ప్రధాని మోడీ నిర్లక్ష్యం, నిర్లిప్తత, బాధ్యతారాహిత్యం కారణమంటూ అప్పటికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసందే.

సీఆర్పీఎఫ్ జవాన్లు ఏ మాత్రం భద్రత లేని రోడ్డు మార్గంలో ప్రయాణించడం   సేఫ్ కాదని..వారిని ఆకాశమార్గంలో తరలించేందుకు ఎయిర్ క్రాఫ్టులు అడిగితే కేంద్రం నిరాకరించిదని సత్యపాల్ మాలిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పుల్వామా ఘటన జరిగిన తరువాత తనను నోరెత్తవద్దంటూ స్వయంగా  మోడీ, ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పోన్ చేసి మరీ చెప్పారని సత్యపాల్  మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఆరోపణలు జాతీయ స్థాయిలో సంచలనం రేపాయి.  ఆయన ఆ ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది.   ఇలా కేంద్రంపై విమర్శలు చేయగానే అలా సీబీఐ నోటీసులు జారీ చేయడంతో కేంద్రం కనుసన్నలలో సీబీఐ పని చేస్తోందన్న తమ ఆరోపణలు వాస్తవమేనని మరో జారి రుజువైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 తనకు సీబీఐ నోటీసులు ఇవ్వటంపై స్పందించిన సత్యపాల్ మాలిక్ తాను రైతుబిడ్డను అని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.   సత్యపాల్ మాలిక్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు.  2019 పుల్వామా దాడిపై మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ తుఫాను సృష్టించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సత్యపాల్ మాలిక్ కు  సీబీఐ సమన్లు జారీ చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.