హ్యాపీ బర్త్ డే టు యు మిస్టర్ జగన్: చంద్రబాబు నాయుడు
posted on Dec 21, 2015 9:09AM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఆయన డిశంబర్ 21, 1972లో కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తిపేరు యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన 44వ సం.లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అదేమీ పెద్ద విశేషం కాదు. అంతకంటే పెద్ద విశేషమేమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కొందరు మంత్రులు, తెదేపా ఎమ్మెల్యేలు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి కూర్చొన్నచోటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడమే విశేషం.
ఆ తరువాత షరా మామూలుగానే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడం, కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ తిరస్కరించడంతో సభను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి, జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ బయటకి వెళ్ళిపోయారు. మొన్న రోజాను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించినపుడు, అందుకు నేను బాధపడటం లేదని ఆమె చెప్పినప్పుడు, ఆమె తన సినిమా, టీవీ కార్యక్రమాలు చేసుకొనేందుకు వీలుకలిగిందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఆవిధంగా అని ఉంటారని మీడియాలో విమర్శలు వినిపించాయి. మళ్ళీ నేడు జగన్ సభని బాయ్ కాట్ చేసి వెళ్లిపోవడంతో, బహుశః తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికే వెళ్లి పోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.