జగన్ని ఒడ్డున పడేయడానికే అఖిలపక్షమా

 

కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా నిద్రనుండి మేల్కొన్నట్లు, రాష్ట్ర విభజన ప్రక్రియని చాలా దూరం తీసుకుపోయాక, ఇప్పుడు అఖిలపక్షమని కలవరింతలు మొదలుపెట్టింది. దానికి అనేక కారణాలు ఉండవచ్చును. గానీ దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీలకేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోతున్నా చంద్రబాబు ఇప్పటికీ తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎలాగో రోజులు దొర్లించేస్తుంటే, సమైక్యాంధ్ర సంకల్పం చెప్పుకొన్నజగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా సమైక్యఫలం పొందలేక బాధపడుతున్నారు.

 

మొన్ననే అతను చాల తెగించి తుఫానుకి ఎదురీదుతూ హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినప్పటికీ, దానిని కాస్తా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీకి రెండే రెండు లేఖలు వ్రాసి పడేసి హైజాక్ చేసేసారు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒడ్డున పడేయాలంటే ఈ అఖిలపక్షం చాలా అవసరం. ఈరోజు జగన్ ‘బెయిలు బంధనాలు’ తెంచే పని కూడా పూర్తయిపోయింది. ఇక తెదేపా ఎలాగు సమన్యాయం కోరుతోంది గనుక రాష్ట్ర విభజనకు అవసరమయిన మార్గదర్శకాల పేరిట ఆ మాటేదో తెదేపా నోటనే చెప్పించేస్తే, సమైక్యాంద్రాకి ఆ పార్టీ వ్యతిరేఖమనే ట్యాగ్ తగిలించేసి, వైకాపా సీమాంద్రాలో దూసుకుపోవడానికి మార్గం సుగమం చేసేయవచ్చును.

 

తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈసారి కూడా స్పష్టమయిన వైఖరి చెప్పకపోవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా తేదేపాకు చీటీ చింపేయవచ్చనే ఆశో అత్యాశో ఈ అఖిలపక్షం ఐడియాలో దాగి ఉండి ఉండవచ్చును.