అఖిలంతో పార్టీలలో కలకలం

 

తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషనుతో, అవసరమయితే చంద్రబాబుని ఒప్పించయినా సరే తెలంగాణాపై పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని చెప్పిన మాటలతో, పార్టీలో ఆంధ్ర-తెలంగాణా నేతల మధ్య ఇప్పటికే చిన్నపాటి యుద్ధం మొదలయింది.

 

ఇప్పుడు హోం మంత్రి షిండే దీపావళి సందర్భంగా అఖిలపక్షం బాంబు పేల్చడం కేవలం తమ పార్టీలో విద్వంసం సృష్టించడానికేనని ఆ పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మొదటి నుండి అఖిలపక్షం కోసం గట్టిగా డిమాండ్ చేసింది కూడా తమ పార్టీయే కావడంతో, ఇప్పడు దానిపై గట్టిగా మాట్లాడేందుకు తెదేపా నేతలు తడబడుతున్నారు. తెరాస,టీ-కాంగ్రెస్ నేతలు దీనిపట్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.

 

బీజేపీ ఇదీ ఒకందుకు తమ మంచికే జరుగుతోందని భావిస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దీనిని వ్యతిరేఖిస్తుండగా మొదటి నుండి రాష్ట్ర విభజన సమర్దిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం దీనిని స్వాగతించారు. అయితే ఈసారి అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆయన డిమాండ్ చేసారు.

 

బహుశః ఆయన కాంగ్రెస్ మనసులోమాటే పలికినట్లుంది. అలా చేస్తే మొట్ట మొదట ఇబ్బంది పడేది తెదేపాయేనని కాంగ్రెస్ కి తెలియకపోదు. అందువల్ల ఈసారి ఒక్కరినే రమ్మని ఆహ్వానించవచ్చును. అయితే తెదేపా కూడా కాంగ్రెస్ జిమ్మికులన్నిటినీ ఔపోసన పట్టిన పార్టీయే గనుక, ఒకవేళ అఖిలపక్షానికి ఒక్కరినే ఆహ్వానిస్తే, ఏదో కారణంతో బాయ్ కాట్ చేసి గండం గట్టె క్కేప్రయత్నం చేయవచ్చును. అయితే సమస్యకు ఇది సరయిన, శాశ్విత పరిష్కారం కాదని ఆ పార్టీకి తెలియకపోదు. అయితే ఇంతకంటే వేరే మార్గం కూడా లేదు.

 

ఇక సమైక్యాంధ్ర ఉద్యమ గురుతర భాద్యతలని తన భుజస్కందాలకెత్తుకొన్న జగన్మోహన్ రెడ్డి, ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చేయడానికి వీలులేదని, కేంద్రమంత్రుల బృందం సూచనలేవీ తమకు ఆమోదయోగ్యం కావని గట్టిగా వాదించి, తన సమైక్య చాంపియన్ బిరుదుని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును.