రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం త్వరలో

 

అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిలో చచ్చిందన్నట్లు, “రాష్ట్ర విభజనలో చాలా లోతుగా అధ్యయనం చేసి, అందరినీ సంప్రదించి, అందరి ఆమోదంతో, అందరికీ ఆమోద యోగ్యంగా, చాలా రాజ్యంగబద్దంగా, ఎంతో నీతి నిజాయితీలతో, పూర్తి పారదర్శకతతో రాష్ట్ర విభజన చేస్తున్నామే తప్ప, ఇందులో మా రాజకీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం చూసుకోలేదని” ఇంతకాలం గొప్పగా కబుర్లు చెపుతూ వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం అంటూ కొత్త రాగం అందుకొంది. వచ్చేనెల 7న మంత్రుల బృందం సమావేశం జరిగిన తరువాత, 9న ఈ సమావేశం ఉంటుందని హోం మంత్రి షిండే ప్రకటించారు.

 

సీమాంద్రాలో అన్ని లక్షలమంది ప్రజలు, ఉద్యోగులు రోడ్లమీధకు వచ్చి రెండు నెలల పాటు ఏకధాటిగా తమ నిరసనలను తెలియజేసినా వారి ఆందోళనలని పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు వీసమెత్తు విలువీయకుండా మొండిగా ముందుకు సాగిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ అఖిలపక్ష రాగం ఆలపించడం ఎలా ఉందంటే, శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు మధ్యలో ‘నారాయణ నారాయణ గోవింద గోవింద’ అంటూ మూడు సార్లు క్రిందకు దించి లేపుతారు, పోయిన మనిషి తిరిగొస్తాడనే చిన్న ఆశతో కావచ్చు లేదా వేరే కారణం వల్ల కావచ్చును, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజన విషయంలో అలాగే చేస్తోంది.

 

ఒకవైపు కేంద్రంలో రాష్ట్ర విభజనతో సంబంధం ఉన్నఅన్నిమంత్రిత్వ శాఖలు పంపకాల ప్రక్రియ పూర్తి చేస్తుంటే, మరో వైపు హోంశాఖ నియమించిన టాస్క్ ఫోర్సు రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతల కోసం చకచకా ఏర్పాట్లు చేస్తుంటే, వచ్చే నెల 5ని డెడ్ లైన్ గా పెట్టుకొని అన్ని పనులు పూర్తి చేస్తూ, 7న మంత్రుల బృందం సమావేశం కూడా పూర్తయిన తరువాత, అప్పుడు తీరికగా అఖిలపక్షం అనడం కేవలం వెటకారమే. ఏనుగు నమిలి తినే తన దంతాలను దాచిపెట్టి, పైకి అందమయిన పెద్ద దంతాలు చూపుతునట్లే, కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరిస్తోంది.

 

అఖిలపక్షం ఐడియాతో రాష్ట్ర విభజనను జాప్యం చేయాలనుకొంటోందని తెలంగాణా వాదులు భావిస్తే, తమను మరో మారు మభ్యపెట్టేందుకే ఈ కొత్త నాటకమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంది. అసలు మొదటి నుండి తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే చూసుకొంటూ మొండిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అదే మొండి తనంతో ముందుకు సాగి ఉంటే, కనీసం తెలంగాణాలో అయినా ఆ పార్టీకి నాలుగు ఓట్లు రాలేవేమో!

 

కానీ ఇప్పుడు అఖిలపక్షం అనడం వలన మేమే తెలంగాణా సాధించామని భుజాలు చరుచుకొంటూ జైత్రయాత్రలు చేస్తున్న టీ-కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ మారోమారు ఆ సాహసం చేయలేరు. అసలు ముందు చేయవలసిన పనిని ఆఖరున, ఆఖరున చేయవలసిన పనిని ముందు చేస్తూ, కాంగ్రెస్ అభాసుపాలవుతోంది. దీనినే వ్రతం చెడ్డా ఫలం దక్కక పోవడం అంటారేమో.