అధికారం కోసం ఆమాద్మీ మళ్ళీ వీధి నాటకాలు
posted on May 22, 2014 11:13AM
.jpg)
ఒక ఏడాది క్రితం ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తన అనుచరులతో కలిసి డిల్లీ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు పోలీసులు ఆయనను, ఆయన అనుచరులను అరెస్ట్ చేస్తుండేవారు. కానీ ఆ తరువాత ఆయన డిల్లీ ముఖ్యమంత్రి పీటం అధిష్టించినప్పుడు అదే డిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేవారు. మళ్ళీ అదే డిల్లీ పోలీసులు ఇప్పుడు ఆయనను తీహార్ జైలుకి తరలించారు. కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం విడుదలచేసిన అవినీతిపరుల జాబితాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి పేరు కూడా ఉండటంతో ఆయన కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసులో కోర్టుకి హాజరయిన కేజ్రీవాల్ బెయిలు కోసం రూ.10,000 కట్టేందుకు నిరాకరించడంతో ఆయనకు డిల్లీ కోర్టు శుక్రవారం వరకు జ్యుడీసరీ రిమాండ్ విదించడంతో పోలీసులు ఆయనను తీహార్ జైలుకి తరలించారు. ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు ఆయన అరెస్టును నిరసిస్తూ జైలు ముందు వీరంగం వేయడంతో పోలీసులు వారిపై కూడా లాటీలు ప్రయోగించవలసి వచ్చింది. ఓడలు బళ్ళవడమంటే బహుశః ఇదేనేమో.
ఒకప్పుడు పదవులు అధికారంపై తమకు ఎటువంటి ఆశలేదని నీతి కబుర్లు పలికిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఇతర రాజకీయనేతల లాగే, అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మళ్ళీ డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటూ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలిసారు. కానీ అది సాధ్యపడక పోవడంతో, మళ్ళీ తనను ఆదరించిన డిల్లీ ప్రజల మనసులు గెలుచుకొనేందుకు తాము అధికారం నుండి అర్ధాంతరంగా తప్పుకోవడం తప్పేనని, అందుకు డిల్లీ ప్రజలను క్షమించి మళ్ళీ ఎన్నికలలో తమ పార్టీకే పూర్తి మెజార్టీ కట్టబెడితే పూర్తి ఐదేళ్ళు సమర్ధంగా పాలిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇతర రాజకీయ నేతలలాగే ఈ కేసుల వ్యవహారం ద్వారా ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుండటం గమనార్హం. అందుకే కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు అంగీకరించినప్పటికీ, ఆయన పూచీకత్తు కట్టేందుకు నిరాకరించి జైలుకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. అప్పుడు ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర రాజకీయ పార్టీలలాగే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు జైలు బయట ధర్నాలు చేసి పోలీసుల చేతిలో లాటీ దెబ్బలు తిని పోలీసు వ్యానులు ఎక్కారు.
అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఆమాద్మీ పార్టీ నేతలు కూడా ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్ పార్టీలాగే వ్యవహరిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. అధికారం కోసం తాము ఆడుతున్న ఈ నాటకాలు ప్రజలకు అర్ధం కావని, వారిని ఇటువంటి నాటకాలతో మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికలలో గెలవవచ్చని ఆమాద్మీ పార్టీ నేతలు భావిస్తున్నారు. అటువంటి నాటకాలు ఆడినందుకే కాంగ్రెస్ పార్టీకి, తమకు కూడా దేశప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో కళ్ళార చూసిన తరువాత కూడా ఆమాద్మీ నేతలు ఇంకా ఇటువంటి వీధి నాటకాలు ఆడటం చూస్తుంటే వారికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని అర్ధమవుతోంది.