గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని?
posted on May 22, 2014 7:47AM
.jpg)
త్వరలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించా బోతున్న చద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇరువురూ కూడా హైదరాబాదులో తమకు కేటాయించిన క్యాంపు కార్యాలయాలకు బదులు వేరే చోట కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. చంద్రబాబు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక భవనంలో తన క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసుకొంటుంటే, కేసీఆర్ కుందన్ భాగ్ లో రెండు మంత్రుల క్వార్టర్లను కలిపి తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముగ్గురూ కూడా బేగంపేటలోని అత్యాధునిక క్యాంప్ కార్యాలయం ఉపయోగించుకొన్నారు. కానీ కేసీఆర్ వాస్తు దృష్ట్యా కుందన్ భాగ్ లో మంత్రుల క్వార్టర్లను తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటున్నారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చంద్రబాబు గుంటూరులో తన కార్యాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు. ఆయన గుంటూరు నుండే పరిపాలన చేయాలనుకొంటున్నందున, ఉన్నతాధికారులు కూడా ఆయనతో బాటే గుంటూరు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. వారందరికీ గుంటూరుకు సమీపంలో ఉన్న మంగళగిరిలో గల ఏపీఎస్పీ బెటాలియన్‌లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక సచివాలయంగా మారనుందన్నమాట. గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న సువిశాలమయిన ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పరిపాలనా, భద్రతా విభాగాలలో ముఖ్యమయిన శాఖలను, అధికారులను, ఉద్యోగుల కోసం తాత్కాలిక కార్యాలయాలు, వసతి గృహాలు వగైరాలు ఏర్పాటు చేసుకొని వారిని తరలించిన తరువాత, కొత్త రాజధాని నిర్మాణం గురించి ఆలోచించ వచ్చని చంద్రబాబు యోచిస్తున్నారు. ఆయన గుంటూరులో తాత్కాలిక క్యాంపు కార్యాలయం, సచివాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు గనుక కొత్త రాజధాని కూడా గుంటూరు-విజయవాడ మధ్య నిర్మించెందుకే మొగ్గు చూపవచ్చును.