గెలిచాక‌ ఈటల బీజేపీలో ఉండరంటూ ప్ర‌చారం.. ఓటమిని టీఆర్ఎస్‌ ఒప్పుకున్న‌ట్టేనా?

ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కు రమ్మని సామెత. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు మాటల తీరు గమనిస్తే అలానే ఉంది. బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్’ ను ఏదో ఒక విధంగా ఓడించాలని ఎన్ని తంటాలు పడినా, ఫలితం కనిపిస్తున్నట్లు లేదు. అందుకే, ఇక అటు నుంచి నరుక్కురావడం మొదలు పెట్టారు. బీజేపీ, ఈటలకు మధ్య పుల్లలు పెట్టే పనికి పూనుకున్నారు. ఈట‌ల‌ తమ పార్టీలో ఉండేటట్లు లేరని బీజేపీ వాళ్లే చెప్పుకుంటున్నారంటూ హ‌రీశ్‌రావు ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్రచారం వెనక పెద్ద కుట్రే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఈటల ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీలో ఉండరు కాంగ్రెస్’లో చేరిపోతారు అని ప్రచారం సాగిస్తే, బీజేపీ అభిమానులు, సానుభూతి పరులు ఈటలకు ఓటు వేయరని ఆ విధంగా ఈటల గెలుపును అడ్డుకోవాలని హరీష్ రావు ఒక వ్యూహం ప్రకారమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. అలాగే బీజేపీ అభిమానులు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈటల విజయం కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తించేందుకే హరీష్ ఈటల ‘భారత్‌ మాతాకీ జై అని నినాదం కూడా చేయడం లేదంటూ ప్రచారం చేస్తున్నరని బీజేపీ సంఘ్ పరివార్ వర్గాలు మండిప‌డుతున్నాయి.
 
అయితే, మంత్రి హరీష్ మాత్రం చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు. ఎక్కడి కెళ్ళినా, “ రాజేందర్ గారు కూడా బీజేపీలో ఉండేటట్లు అనిపించడం లేదు. ఆయన ఎక్కడ భారత్ మాతా కీ జై అంటలేడు, జైశ్రీరాం అంటలేడు, జై మోదీ కూడా అంటలేడు. ఆయన కథనే చెప్పుకుంటున్నడు. ఆయన అవసరం కోసం బీజేపీలో చేరిండు తప్ప, మనస్సుతో చేరలేదని జనమే చెప్తున్నరు. బీజేపీ కార్యకర్తలే చెప్తున్నరు. దీనిని బట్టి ఏందంటే మనం అనవసరంగా నష్టపోకూడదు. ఆయన అంటించుకున్న బురద మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తుండు. ఆయన బాధను మనందరి బాధగా తీర్చే ప్రయత్నం చేస్తుండు.” అంటూ అదే పనిగా అసత్య ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ, సామాన్య ప్రజలు కూడా గుర్తించారు. ఈటల తెరాసలో ఉన్నప్పుడు కూడా తెరాసను, కేసీఆర్ ను చూసి ఓటు వేయలేదని, అప్పుడు కూడా ఈటలకే  ఓటు వేశామని ..ఇప్పుడు కూడా ఈటలకే ఒటేస్తామని చెపుతున్నారని అంటున్నారు,
 

Related Segment News