ఎప్పుడు వచ్చామన్నది కాదు ప్రశ్న...
posted on Aug 4, 2015 3:45PM
.jpg)
“ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రశ్న...ప్రత్యేకహోదా గురించి మాట్లాడేమా...లేదా? అన్నదే ప్రశ్న” ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలలో లేటెస్ట్ హిట్ డైలాగ్. ఇప్పుడు ప్రత్యేకహోదా గురించి రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ మాట్లాడేస్తున్నాయి. పోట్లాడేస్తున్నాయి. కానీ ఎవరి ఫైటు వాళ్ళదే ఎవరి క్రెడిట్ వాళ్ళదే. ప్రత్యేకహోదా కోసం శివాజీ దీక్ష చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ పరిగెత్తుకురాడు. వైకాపా రాదూ. కాంగ్రెస్ చేస్తున్న దీక్షలకి ధర్నాలకి వైకాపా హాజరు కాదు అండ్ వైస్ వెర్సా. “ఏదో పవన్ కళ్యాణ్ మాట కొట్టేయలేక అతని తుత్తి కోసమే పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశామే తప్ప ప్రత్యేకహోదా వచ్చేస్తుందని కాదని” జేసీ కుండబ్రద్దలు కొట్టారు. ఆ తరువాత ఆయన, రాయపాటి సాంభశివరావు ఇద్దరూ కలిసి ఈ సమస్య పరిష్కారం కావడం లేదనే బాధతో చాలా కుండలు బ్రద్దలు గొట్టారు.
ఇప్పుడు వైకాపా వంతు వచ్చింది. ఈనెల 10న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్మోహన్ రెడ్డి ధర్నాకు కూర్చోబోతున్నాడు. డిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేయబోయే ధర్నా కోసం కనీసం 3,000 మందిని ఇక్కడి నుండి తరలించాలని వైకాపా భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో అనకాపల్లి, తిరుపతి నుండి రెండు ప్రత్యేకరైళ్ళు ఏర్పాటు చేశామని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. “కానీ ఏడాదిగా మనమందరం కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా సాధ్యం కానిది జగన్మోహన్ రెడ్డి రెండు రైళ్ళ నిండా జనాలను వేసుకొని వచ్చి ఒక్క రోజు దీక్ష చేసినంత మాత్రాన్న కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేస్తుందా?” అని తెదేపా ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ దానికి “ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రశ్న...ప్రత్యేకహోదా గురించి మాట్లాడేమా...లేదా? అన్నదే ప్రశ్న” అని వైకాపా జవాబు చెపుతుందేమో?