మాజీ ప్రధానిని రోడ్డు మీద నిలబెట్టడం సమంజసమేనా?
posted on Aug 4, 2015 12:04PM
.jpg)
లోక్ సభ నుండి 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఆవరణలో గల గాంధీజీ విగ్రంగా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేస్తున్నారు. వారికి వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, జేడీ-యు తదితర పార్టీల సభ్యులు మద్దతు తెలుపుతున్నారు.
పదేళ్ళు ప్రధానిగా దేశాన్ని పాలించిన డా.మన్మోహన్ సింగ్ వంటి వ్యక్తి కూడా ఒక సాధారణ రాజకీయ నాయకుడి స్థాయికి దిగజారిపోయి ఈవిధంగా తన పార్టీ నేతలతో కలిసి నిరసనలు చేప్పట్టడం ఆయన తన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ప్రధాని అంతటి వాడిని ఈవిధంగా రోడ్డు మీద నిలబెట్టడం చాలా శోచనీయం. తమను సభ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టబోరు. కానీ మాజీ ప్రధాని గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనని కూడా తమతో బాటు రోడ్డు మీద నిలబెట్టి తద్వారా ప్రజల సానుభూతి పొందాలని చూడటం కాంగ్రెస్ నీచ ఆలోచనలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును. కానీ అంతటి నిజాయితీపరుడికి కూడా బొగ్గు కుంభకోణం తాలూకు మసి అంటించగలిగినప్పుడు, ఆయనని రోడ్డు మీద నిలబెట్టి సానుభూతి సంపాదించుకొంటే మాత్రం తప్పేమిటి? అని కాంగ్రెస్ అనుకొంటే అసహజమేమీ కాదు.