తెలంగాణాకు హాని కలిగిస్తున్న కేసీఆర్ ధోరణి

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు కేంద్రంతో కూడా ఏదోక అంశంపై కత్తులు నూరుతూనే ఉన్నారు. పొరుగు రాష్ట్రంలో ఆయన తీవ్రంగా వ్యతిరేఖించే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కనుక ఆయన దానితో కయ్యమాడటం సహజమే అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఆయన కేంద్రంతో కూడా ఎందుకు సఖ్యత పాటించలేకపోతున్నారో, కేంద్రం నుండి ఎందుకు సహాయం పొందలేకపోతున్నారో ఆయనకే తెలియాలి. పోనీ రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏమయినా ఆయనకు అడ్డుపడుతున్నారా..అంటే అదీ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. శ్రీశైలం హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయడం నిలిపివేయమని కృష్ణా జలసంఘం పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, తాము ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయమని జవాబీయడమే కాక, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేంద్ర మంత్రి ఉమాభారతి ద్వారా జలసంఘంపై ఒత్తిడి తెచ్చి తమకు లేఖలు వ్రాయిస్తున్నారని, చంద్రబాబే నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున ఆయనను సుప్రీం కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

ఈ విషయంలో కేంద్రం మాటని కూడా తాను ఖాతరు చేయబోనని చెపుతూనే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని ఆదుకోవాలని, తమ అధికారులు వివిధ అంశాలపై కేంద్రానికి వ్రాస్తున్న లేఖలపై కేంద్రప్రభుత్వం స్పందించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

కేంద్ర మంత్రులతో, ప్రధాని మోడీతో ఎంతో చక్కటి సంబంధాలు గల చంద్రబాబు నాయుడు స్వయంగా డిల్లీ వెళ్లి వారందరినీ కలిసి సహాయం కోసం పదేపదే అర్ధించినా కేంద్రం ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చిల్లి గవ్వ విదిలించలేదు. కనీసం ఇంతవరకు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. అటువంటప్పుడు నిత్యం కేంద్రంతో గొడవపడే కేసీఆర్ సహాయం చేయమని కోరినంతనే కేంద్రం ఉదారంగా సహాయం చేస్తుందని భావించడం అవివేకమే.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణా రాష్ట్రానికి 300మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు సంసిద్దత వ్యక్తపరిచినా కేసీఆర్ పంతానికి పోయి దానిని తీసుకోకపోవడం వలన తెలంగాణా రైతాంగానికి తీరని నష్టం జరుగుతోందని చెప్పవచ్చును. ఆ విద్యుత్ స్వీకరించేందుకు విముఖత చూపిస్తున్న కేసీఆర్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నవిద్యుత్ లో తమ వాటా ఇవ్వడంలేదని, చంద్రబాబుని కోర్టుకు ఈడుస్తానని రంకెలు వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ ధోరణి వల్ల ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టమూ కలుగకపోవచ్చును. కానీ తెలంగాణా రాష్ట్రము, ప్రజలు మాత్రం చాలా నష్టపోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అందరితో సామరస్య ధోరణితో వ్యవహరిస్తే నేడు తెలంగాణా రాష్ట్రంలో ఈ కరెంటు కష్టాలు ఉండేవి కావు. పొరుగునున్న ఆంధ్రా నుండి, కేంద్ర గ్రిడ్ నుండి అవసరమయిన విద్యుత్ లభించి ఉండేదేమో?