తెలంగాణాకి కూడా హూద్ హూద్ దెబ్బ

 

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన హూద్ హూద్ తుఫాను కారణంగా అనేక ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో నేటికీ విద్యుత్ సరఫరా పునరుద్దరించడం చాలా కష్టమవుతోంది. విశాఖలో సింహాద్రీ పవర్ ప్లాంటులో 2000మెగా వాట్స్ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు నరసరావుపేట వద్ద గల కలపాక స్విచ్చింగ్ ప్లాంట్ ద్వారా గ్రిడ్ కు అక్కడి నుండి వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతుంతుంది. కానీ హూద్ హూద్ తుఫాను వల్ల కలపాక స్విచ్చింగ్ ప్లాంటుకు అనుసంధానమయున్న హై ట్రాన్స్మిషన్ లైన్లు బాగా దెబ్బ తిన్నాయి. అందువల్ల సింహాద్రీలో విద్యుత్ ఉత్పత్తికి సర్వం సిద్దంగా ఉన్నప్పటికీ ఇరుగుపొరుగు రాష్ట్రాలకు దానిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది.

 

ఇరుగుపొరుగు రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటి. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉతప్పత్తి అయిన విద్యుత్తులో 52 శాతం తెలంగాణకు సరఫరా చేయవలసి ఉంటుంది. అయితే ఈ సమస్య కారణంగా తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేయడం వీలుపడటం లేదు. విద్యుత్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ హై ట్రాన్స్మిషన్ లైన్లను సరిచేసి విద్యుత్ పునరుద్దరించడానికి మరికొంత సమయం పడుతుందని చెపుతున్నారు. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంలో మునిగిపోయిన తెలంగాణా రాష్ట్రానికి ఇది గోరుచుట్టుపై రోకటిపోటువంటిదే.