ఆంద్ర ప్రభుత్వంపై త్వరలో తెలంగాణా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషను?

 

నీళ్ళు మరియు విద్యుత్ పంపకాలలో తెలంగాణాను మోసం చేస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టుకు ఈడుస్తామని ప్రతిజ్ఞ చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా విద్యుత్ మరియు నీటి పారుదల నిపుణులు, అధికారులతో అందుకు అవసరమయిన కసరత్తు మొదలుపెట్టారు. వారు విభజన చట్ట ప్రకారం తెలంగాణాకు రావలసిన నీళ్ళు మరియు విద్యుత్ లెక్కలు కట్టి, తెలంగాణకు దక్కవలసిన వాటాని ఇవ్వకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా మోసం చేస్తున్నదీ తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేసే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నివేదికను ఆమోదించగానే, రాష్ట్ర ఇంధన, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఇరువురూ కలిసి తెలంగాణా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పిటిషను దాఖలు చేయనున్నారు.

 

ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు ఒకరినొకరు నిందించుకొంటున్నందున ఎవరిమాట నిజమో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషను వేసేందుకు సిద్దపడుతోంది కనుక ఇక ఈ వ్యవహారంలో ఎవరు దోషులో తేలిపోతుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యుత్, జలవనరుల అధికారులు కూడా తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ తన రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే కాకి లెక్కలు చెపుతున్నారని, కోర్టుకు వెళితే ఆయనకు భంగపాటు తప్పకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

 

పనిలోపనిగా కేసీఆర్ కృష్ణా, గోదావరి బోర్డులపైనా సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నందున, ఈ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా లాగినట్లవుతుంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయమని కృష్ణా జలసంఘం వ్రాసిన రెండు లేఖలకు తాము విద్యుత్ ఉత్పత్తి నిలబోమని తెలంగాణా ప్రభుత్వం జవాబిచ్చింది కనుక ఈ వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పకపోవచ్చని వారు భావిస్తున్నారు.

 

ఏమయినప్పటికీ కోర్టు గడప ఎక్కడమంటే గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకొన్నట్లే అవుతుంది. బహుశః మరో ఐదేళ్ళపాటు ఇంకా చాలాసార్లు కోర్టు గడప ఎక్కవలసి వచ్చినా ఏమీ ఆశ్చర్యం లేదు.