ఆ ఇద్దరు విప్లవ ద్రోహులు...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
posted on Oct 19, 2025 3:48PM

మావోయిస్టు ఉద్యమంలో వరుస లొంగుబాట్లపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల తమ అనుచరులతో కలిసి లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్‌లను పార్టీ “విప్లవ ద్రోహులు”గా పేర్కొన్నాది.
కేంద్ర కమిటీతో ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వానికి లొంగిపోయారని, ఈ చర్య పార్టీ విప్లవ సిద్ధాంతాలకు విరుద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖలో పేర్కొన్నారు. వారు విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకారులుగా, శత్రువులకు సహకరించే వ్యక్తులుగా మారారని, అందువల్ల వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, “వారికి తగిన శిక్ష విధించాలి” అని విప్లవ ప్రజలకు పిలుపునిచ్చారు.
మల్లోజుల, ఆశన్న లు పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా ద్రోహం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్య విప్లవోద్యమానికి తీవ్ర నష్టం కలిగించిందని పార్టీ అభిప్రాయపడింది.
మావోయిస్టు లేఖలో 2011 తర్వాత ఉద్యమం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కూడా ప్రస్తావించారు. 2018 నాటికి ఉద్యమం తాత్కాలిక వెనుకంజకు చేరిందని, అప్పటి నుంచి మల్లోజుల రాజకీయ బలహీనతలు బయటపడుతున్నాయని తెలిపారు. 2020 డిసెంబర్‌లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల సమర్పించిన ఆత్మవిమర్శాత్మక పత్రాన్ని కమిటీ తిరస్కరించినట్లు గుర్తుచేశారు.
తర్వాత పార్టీ ఆయనలోని తప్పుడు రాజకీయ ధోరణులను సరిదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ, 2025 మేలో ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజులలోని సైద్ధాంతిక బలహీనతలు మరింతగా పెరిగి, చివరికి ప్రభుత్వానికి లొంగిపోయే దశకు తీసుకెళ్లాయని లేఖలో అభయ్ వివరించారు.
అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు.
ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే అని పేర్కొన్నారు. విప్లవ ఉద్యమం తిరిగి పుంజుకుంటుందని తెలిపారు. మావోయిజం తిరిగి పురోగమనం కోసం కృషి చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని లేఖలో పేర్కొన్నారు