కవితక్క వెంకన్నను....ఏం మొక్కిందంటే?
posted on Oct 19, 2025 3:10PM

తిరుమల శ్రీవారి దర్శనం చేస్కున్నారు తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత. అక్టోబర్ 21 నుంచి తాను చేయబోతున్న తెలంగాణ జాగృతి యాత్ర దిగ్విజయం కావాలని వెంకన్నను మొక్కుకున్నారు కవిత.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ యాత్ర ఎంతో ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇప్పటి వరకూ కేవలం బావ మాత్రమే తనకు ద్రోహం చేశారని చెప్పుకున్న కవిత.. తన తండ్రి ఫోటో కూడా లేకుండా కేవలం ప్రొ. జయశంకర్ ఫోటోతో మాత్రమే.. ఈ యాత్ర చేయబోతున్నారు.
భారత రాష్ట్ర సమితి అన్న పేరు పెట్టడంతో తెలంగాణ శబ్దం కోల్పోయిందీ కేసీఆర్ పార్టీ. దీంతో తన అధికారం సైతం కోల్పోవల్సి వచ్చిందా పార్టీ. దీంతో తిరిగి తెలంగాణ సెంటిమెంటు రగిల్చేందుకు తెలంగాణ జాగృతిని బయటకు తీశారు కవిత. అప్పటి వరకూ స్తబ్ధుగా ఉన్న జాగృతి ఉన్నట్టుండి ఉధృతమయ్యింది. కార్యకలాపాల వేగం పెంచింది. ఆ మాటకొస్తే పార్టీ పెట్టకుండానే రెండుగా చీలింది కూడా.
ఈ మొత్తం వ్యవహారానికి ముందు.. ఒక క్రమ పద్దతి ప్రకారం తండ్రి పార్టీ బీఆర్ఎస్ నుంచి వేరుపడి.. ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు కవిత. అందులో భాగంగా తొలుత తెలంగాణ జాగృతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు తెరలేపారు. ఈ యాత్రల ద్వారా తిరిగి తెలంగాణ ప్రజలకు దగ్గరై వారి ఆశీర్వాద బలంతో పార్టీ పెట్టాలన్నది కవితక్క టార్గెట్ గా తెలుస్తోంది. ఇవన్నీ సజావుగా నడవాలనే వెంకన్నను మొక్కినట్టు తెలుస్తోంది.
2028ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా కవిత ఈ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కవిత చీల్చబోయే ఓట్లు ఎవరివవుతాయి? ఒక వేళ ఓట్ల చీలిక తెస్తే ఎవరికి లాభం- నష్టం??? అన్న అంచనాలు అటుంచితే.. మొత్తం మీద అయితే రాజకీయంగా తన సొంత కాళ్లపై నిలిచేందుకు కవిత చేసే యత్నంలో ఇది కీలక అడుగు కాబోతుందని అంతా భావిస్తున్నారు