రికార్డుల మోత.. క్రికెట్ చరిత్ర తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ
posted on Dec 24, 2025 2:24PM
.webp)
చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. క్రీజులోకి దిగాడంటే సెంచరీ బాదాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ (64 బంతులు) పేరిట ఉండేది.
డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్.. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో 226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ఏ జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్ నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… మున్నందు ఆ యువకెరటం దాటాల్సిన మైలురాళ్లు ఇంకా ఎన్ని ఎదురుచూస్తున్నాయో?