ఇక తెలంగాణాకి నిరంతర విద్యుత్ సరఫరా

 

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన 24x7గంటల నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టులను ప్రస్తుతం ఆంద్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో విజయవంతంగా అమలుచేస్తున్నారు. తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతున్న తెలంగాణా రాష్ట్రానికి కూడా ఈ పధకాన్ని వర్తింపజేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రధాని మోడీని, కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసినప్పుడు కోరారు. ఆయన చేసిన అభ్యర్ధనను మన్నిస్తూ కేంద్ర ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి ఆరోరా బృందాన్ని నిన్న హైదరాబాద్ పంపించారు.

 

తెలంగాణా రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆర్వింద్‌, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు తెలంగాణా జెన్‌కో కార్యాలయంలో వారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం, దానిని ఎదుర్కొంతున్నందుకు తాము చేప్పట్టిన చర్యలు కేంద్ర బృందానికి వివరించి, తెలంగాణా రాష్ట్రానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా ప్రాజెక్టుని మంజూరు చేయవలసిందిగా కోరారు. అదే విధంగా వార్ధా-డిచ్‌పల్లి- హైదరాబాద్‌ విద్యుత్తు లైన్‌ను తెలంగాణ రాష్ట్రానికి అనుసంధానం చేసే పనులను వీలయినంత వేగంగా పూర్తిచేయాలని తెలంగాణా విద్యుత్ శాఖ అధికారులు చేసిన అభ్యర్ధనకు కేంద్ర బృందం సానుకూలంగా స్పందించింది. ఇవికాక రాష్ట్రంలో మరికొన్ని విద్యుత్ పధకాలను అమలుచేసేందుకు అవసరమయిన నిధులు మంజూరు చేయాలనే అభ్యర్ధనకు కేంద్రబృందం సానుకూలంగా స్పందించింది. వారి ప్రతిపాదనలలో నిరంతర విద్యుత్ సరఫరా పధకానికి కేంద్రప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలిపినట్లయితే ఈ సంవత్సరం నుండే తెలంగాణా రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడగలదు.