ఎవరికీ, దేనికి "నో" చెప్పలేరా..అందరూ మీ మీద ఆధిపత్యం చేస్తున్నారా? ఇలా చేయండి..!

 


అందరి జీవితాలు పైకి కనిపించినట్టు ఉండవు. కొందరి  జీవితాలు అంతా బాగుంది అనుకునేలా ఉంటాయి కానీ బాగుండవు.  మరికొందరు మంచి చదువు, ఉద్యోగం, సంపాదన.. అన్నీ ఉన్నా.. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నా.. తనకంటూ ఏమీ లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు.  ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆ వ్యక్తుల వ్యక్తిత్వం కారణంగానే..

ఎవరైనా ఏదైనా పని చెప్పినా నో చెప్పలేని బలహీనత కొందరిలో ఉంటుంది. దీనికి మొహమాటం అనే ట్యాగ్ తగిలిస్తారు.  అలాగే కొన్ని విషయాలు తప్పైనా సరే.. పెద్దవాళ్లు చెప్పారని, పై అధికారులు చెప్పారు  కాబట్టి వారు చెప్పింది వినాలి, చేయాలి అనే స్వభావం ఉంటుంది.  ఒకవైపు ఇదంతా తప్పు, నేను చెప్పింది వీళ్లు వినరు ఎందుకు అనే ఆలోచన ఉంటుంది. మరొకవైపు ఎదురుచెప్పలేని పరిస్థితి ఉంటుంది.  మనసులో భయం,  ఏదైనా ఎదురు చెబితే తనతో మాట్లాడరేమో,  తన మీద కోపం చేసుకుంటారేమో.. ఇలాంటి భయాలు మనసులో ఉంటాయి.  ఇలా ఉంటే అందరూ ఆ వ్యక్తి మీద ఆధిపత్యం చెలాయిస్తారు. అన్ని విదాలుగా వ్యక్తిని అణిచివేయాలని చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితి నుండి ఎలా బయటపడాలి. తెలుసుకుంటే..

చాలా మంది తమ భావాలకు, అవసరాలకు విలువ ఇవ్వని వాతావరణంలో పెరుగుతారు. ఒక పిల్లవాడు ఏడిస్తే, "నోరు మూసుకో, ధైర్యంగా ఉండు" అని అంటారు. ఒక పిల్లవాడు ఏదైనా అడిగితే, "వద్దు అని చెప్పడం లేదా ఎప్పుడూ చూడని వాడిలా ప్రవర్తిస్తావ్ " అని ఎగతాళి చేస్తారు. లేదా ఒక పిల్లవాడు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే "పెద్దలతో వాదించకు" అని వాళ్ళను సైలెంట్ చేస్తారు.

పిల్లలు చాలా తెలివైనవారు.   వాతావరణానికి త్వరగా అనుగుణంగా మారడం నేర్చుకుంటారు. అటువంటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లవాడు తమ భావాలను,  అవసరాలను వ్యక్తపరచడానికి తగిన వాతావరణం లేదని కూడా తెలుసుకుంటారు. అయితే పెద్దవాళ్లు మాత్రం  వారిని అర్థం చేసుకోవడానికి  బదులుగా తిడతారు. తత్ఫలితంగా పిల్లలు తమ భావోద్వేగాలను, కోరికలను,  బాధను అణచివేయడం మొదలుపెడతారు. అయితే బాల్యంలో జరిగే ఈ పరిస్తితులు పెద్ద అయ్యాక ప్రవర్తనా విధానాలుగా మారతాయని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఇలాంటి ప్రవర్తన పెద్దయ్యాక శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది.

పిల్లలను అణిచివేయడం వల్ల కలిగే ప్రభావాలు..

 ఆత్మగౌరవం కోల్పోతారు..

తన భావాలు లేదా అవసరాలు ముఖ్యమైనవి కాదని పిల్లలు అనుకుంటే తమను తాము తక్కువగా చూసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లకు  ఆత్మగౌరవం ఉండదు. ఆత్మగౌరవం తక్కువగా ఉన్నవారు ఇతరుల నియంత్రణలోకి వెళ్లే అవకాసం ఎక్కువగా ఉంటుంది.

భయం,  సంకోచం..

తమకు ఏం కావాలి అనే విషయాలను  వ్యక్తపరచలేని పిల్లలు తరచుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా సంబంధాలలో తమ అభిప్రాయాలను  వ్యక్తపరచడానికి వెనుకాడతారు. అవతలి వ్యక్తి కోపంగా ఉంటాడనో లేదా తమ నుండి దూరం అవుతాడనో వారు భయపడతారు. చాలా చిన్న విషయాలకు కూడా భయపడుతూ చాలా ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తాయి.  ఈ కారణాల వల్ల ఎప్పుడూ ఎదుటివారి కోసం సర్థుకుపోతూ ఉంటారు.


కోపం పెరుగుతుంది

 మనసులో ఉన్న ఎమోషన్స్ ను  నిశ్శబ్దంగా భరించే అలవాటు  ఉంటే ఆ అలవాటు తర్వాత కోపం లేదా చిరాకుగా వ్యక్తమవుతుంది. మనం మన భావోద్వేగాలను ఎక్కువసేపు అణిచివేసినప్పుడు, అవి లోపల పేరుకుపోతాయి.  తరువాత అనారోగ్యకరమైన మార్గాల్లో వ్యక్తమవుతాయి.

సంబంధాలలో అసమానత..

ఇతరులను సంతోషపెట్టడంలో ఎప్పుడూ తమను తాము కోల్పోతారు.  అంతేకాదు.. తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. ఇంత చేసినా సంబంధాలలో సమానత్వం మాత్రం ఏ కోశానా కనిపించదు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం..

ఎప్పుడూ ఇతరుల చేతుల్లో అణిచివేడబడే వారు  ఒత్తిడిగా ఫీలవుతారు.  ఎప్పుడూ  అసంతృప్తి నిరాశ, ఆందోళన,  నిద్ర భంగం, తలనొప్పి, రక్తపోటు మొదలైన శారీరక రుగ్మతలకు కూడా దారితీయవచ్చు.

దీన్నుండి ఎలా బయటపడాలి..

ఒకరు తమ మీద ఆధిపత్యం చేయడం, అణిచివేయడం చేస్తుంటే.. దాన్నుండి బయట పడటానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి.

తమకు కొన్ని కోరికలు ఉన్నాయని, భావాలు, అబిప్రాయాలు ఉన్నాయని.. వాటిని చిన్న విషయాల ఆధారంగా వ్యక్తపరచాలి.

ముఖ్యంగా తమ భావాలను బయటి వ్యక్తుల నుండి మొదలుపెట్టడం మంచిది.  స్నేహితులు, ఆఫీసులో కొలీగ్స్, తెలిసిన వ్యక్తులు.. ఇట్లా వీళ్ల దగ్గర మెల్లిగా ఓపెన్ అయ్యి మొహమాటానికి అన్నిటికి తల ఊపకుండా తన అబిప్రాయాన్ని,  నిర్ణయాన్ని చెప్పేయాలని. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

నచ్చని విషయాలు, లేదా తనకు తెలియని విషయాల దగ్గర నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా బలవంతం చేయడం లేదా కోప్పడటం లాంటివి చేస్తే "నాకు చేయాలని అనిపించడం లేదు, నాకు ఇప్పుడు చేసే ఉద్దేశం లేదు" లాంటి వాక్యాలతో చాలా గౌరవంగా సమాధానం చెప్పాలి. ఇలా చెబుతున్నప్పుడు మొదట్లో భయంగా ఉంటుంది. అంతే కాదు.. దీనివల్ల చుట్టూ ఉండే పేక్ స్నేహాలు,  అవసరం కోసం మాత్రమే చుట్టూ తిరిగే వ్యక్తులు కాస్త దూరం జరిగే అవకాశం ఉంటుంది. కానీ..అలాంటి వాళ్లు దూరం జరిగినందుకు సంతోషపడి సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని మళ్లీ బిల్డ్ చేసుకోవచ్చు.

                                      *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu