మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం మంచిదేనా?
posted on Oct 7, 2025 9:30AM

మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఇతరులతో పోల్చుకుంటాము. కొన్నిసార్లు మనం ఇతరులను చూసి ఆశ్చర్యపోతుంటాము. "అతనికి నా కంటే మంచి ఉద్యోగం ఎందుకు వచ్చింది?" "అతని దగ్గర పెద్ద కారు ఉంది, నా దగ్గర లేదు ఎందుకు?" "అతను నా కంటే గొప్పగా ఎందుకున్నాడు?" ఈ ప్రశ్నలు మన మనస్సులను పదే పదే సంఘర్షణలోకి నెట్టుతూ ఉంటాయి. ఎంత ఆపాలని అనుకున్నా ఆగవు. కానీ చాలామంది ఒకటి మరిచిపోతారు "నిన్నటి కంటే నేను మెరుగ్గా ఉన్నానా?" అని తమను తాము ఎప్పుడూ ప్రశ్నించుకోరు.
వ్యక్తి జీవితంలో గుర్తింపు అనేది ఇతరులతో పోల్చుకుంటే వచ్చేది కాదు.. జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ, ఏదో ఒకటి చేస్తూ ఉండటం ద్వారా ఎదుగుతూ ఉంటే అప్పుడు గుర్తింపు వస్తుంది. అందుకే ఇతరులతో పోల్చుకోవడం చాలా హానికరం అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.
ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు హానికరం?
సాధారణంగా మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం ద్వారా నేర్చుకోవడం మానవ స్వభావం. ఈ ప్రక్రియలో ఇతరులతో పోల్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలా పోల్చుకోవడం ప్రారంభించినప్పుడు తరచుగా నేర్చుకోవడంలో విఫలమవుతాము. ఈ అలవాటు తెలియకుండానే పెరుగుతుంది. ఈ అలవాటు వ్యక్తులను బలహీనపరుస్తుంది. దీని వల్ల తమను తాము తక్కువ చేసుకుని చూసుకోవడం అనే పెద్ద తప్పు చేస్తుంటాం.
ఇతరులతో పోల్చుకుంటే జరిగేది ఇదే..
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది..
మనం పదే పదే ఇతరులతో పోల్చుకున్నప్పుడు, మన ప్రయత్నాలు, విజయాలు చిన్నవిగా అనిపిస్తుంటాయి. ఎప్పుడూ ఇతరులకంటే తక్కువ అనుకుంటూ ఉంటే పెద్ద విజయాల వైపు ఆలోచన కూడా క్రమంగా తగ్గుతుంది.చేతులారా ఎదుగుదలను నరికేసుకున్నట్టే అవుతుంది.
మెదడుపై భారం పెరుగుతుంది..
సోషల్ మీడియాలో చాలామంది సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూపిస్తూ ఉంటారు. తమ గెలుపును మాత్రమే చూపిస్తారు. అయితే ఇలా కేవలం గెలుపును మాత్రమే చూసేవారికి గెలుపు వెనుక, సంతోషం వెనుక కష్టం, బాధ, ఇబ్బందులు ఇలా అన్నీ ఉంటాయి. పోల్చుకున్నప్పుడు తమకు ఎప్పుడూ కష్టాలు, ఇబ్బందులు తప్ప సంతోషం అనేది లేదు అనే అభిప్రాయం ఏర్పడి మెదడుపై భారం పడుతుంది.
ఎదుగుదల తగ్గుతుంది..
ఇతరుల జీవితాలపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు, మన స్వంత బలాలు, కలలను మరచిపోతాము. మన ఆలోచన, సామర్థ్యం తప్పుదారి పడుతుంది. దీని వలన మనం చేయవలసిన పనులు సరైన ఎఫర్ట్ పెట్టి చేయము.
కాబట్టి పోల్చుకునే అలవాటు మనిషిని పోటీ తత్వంలోకి తీసుకెళ్తుంది అనే మాటను పక్కన పెడితే మనిషిలో కాన్పిడెంట్ తగ్గించి జీవితంలో ఎదుగుదలను నెమ్మదిచేసే అవకాశమే ఎక్కువ. అందుకే పోల్చుకోవడం మంచిది కాదు.
*రూపశ్రీ.