వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో... లేదో : మంత్రి జూపల్లి

  మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తాను చెప్పలేనని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రజలకు హామీలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే, మంత్రి  చేసిన ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చూడాలి మరి. అధికార పార్టీలో మంత్రి మాటల విన్న అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మంత్రి జూపల్లి రెండు రోజులపాటు నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పర్యటించారు. నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీలో, గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకుల పాఠశాల కళాశాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని.. ఆటలు బాగా ఆడాలని ప్రోత్సహించారు.  శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలోని ‘‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు’’ పాటను తన సెల్‌ఫోన్‌ నుంచి ప్రత్యక్షంగా మంత్రి విద్యార్ధులకు  వినిపించారు.  ఆత్మహత్య చేసుకునేకంటే.. ఎదురుతిరిగి జీవితంలో గెలవాలని ప్రేరణ నింపారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.

కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా

  ఈనెల 15న జరగాల్సిన కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ తెలిపింది. సభ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో తెలియస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్‌ ప్రకటించారు.  తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని హస్తం పార్టీ  కామారెడ్డి వేదికగా  బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సభకు హారజరయ్యే కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పక్కగా వ్యూహ రచన చేసింది. 

సెభాష్ లోకేష్!.. చంద్రబాబు నోట అరుదైన ప్రశంస

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రోజు రోజుకూ ప్రజానాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. అయితే పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ప్రశంసలు అందుకోవాలంటే ఇది సరిపోదు.. ఇంతకు మించి ఉండాలి అంటారు పరిశీలకులు.  మామూలుగా చంద్రబాబు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే.. అది పూర్తయ్యే వరకూ ఆయన నిద్రపోరు.. ఆ పనితో సంబంధం ఉన్నవారిని నిద్రపోనివ్వరు అంటారు. ఎవరిదాకానో ఎందుకు పలు సందర్భాలలో స్వయంగా చంద్రబాబే ఆ విషయం చెప్పారు.   ఇప్పటికే పరిశీలకులు నారా లోకేష్ ను తండ్రికి తగ్గ తనయుడు అనడమే కాకుండా అంతకు మించి.. తండ్రిని మించిన తనయుడు అని కూడా శ్లాఘిస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. ప్రతిభను చంద్రబాబు గుర్తిస్తారు. ఆ ప్రతిభకు పరీక్ష పెడతారు. ఆ విషయంలో ఆయనకు తన, పర బేధాలుండవు. ఇప్పుడు జరిగిందదే.  అల్లర్లతో అట్టుడికి పోతున్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా, సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చే గురుతర బాధ్యతను చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను లోకేష్ ఆయనే అచ్చెరువోందేంత సమర్థతతో నిర్వహించారు. నిద్రపోను.. నిద్రపోనివ్వను లాంటి మాటలు లేవు. హడావుడి లేదు, ఆర్భాటం లేదు. పరుగులు పెట్టడం లేదు.. పరుగులు పెట్టించడం లేదు. అమరావతి సెక్రటేరియెట్ లోని ఆర్టీజీఎస్ లో కూర్చుని ఆ పనంతా కనుసైగలతో జరిగగిపోయేలా చేశారు.. చుశారు లోకేష్. అవును ఆర్టీజీఎస్ సెంటర్ నుంచే నేపాల్ లో చిక్కుకుని బిక్కు బిక్కుమం టున్న తెలుగువారిలో భరోసా నింపడంతో పాటు.. సురక్షితంగా స్వరాష్ట్రానికి చేరుతామన్న నమ్మకాన్నీ కలిగించారు. అదే సమయంలో కేంద్రంలోని పెద్దలతో టచ్ లో ఉంటూ.. నేపాల్ నుంచి తెలుగువారిని స్వరాష్ట్రానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఆయన కోరిన మీదటే.. కేంద్ర రెండు విమానాలను ఏర్పాటు చేసింది. ఈ లోగా ప్రతి   రెండుగంటలకు ఓ సారి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారితో మాట్లాడారు. వారి యోగక్షేమాలు కనుక్కున్నారు.వీడియో కాల్స్ కూడా చేశారు. కేంద్రం రెండు విమానాలను ఏర్పాటు చేస్తే అవి నేపాల్ లోని తెలుగువారిని తీసుకుని ఢిల్లీ చేరుకునే సరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక ఛార్టర్డ్ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. ఆ విమానంలోనే వారిని ఢిల్లీ నుంచి విశాఖకు, తిరుపతి, కడప జిల్లాలకు చేర్చింది. అక్కడ నుంచి ప్రత్యేక కార్లు, బస్సులు ఏర్పాటు చేసి వారి వారి నివాసాలకు చేరేలా అన్ని ఏర్పాట్లూ లోకేష్ ఒంటి చేత్తో పూర్తి చేశారు.   మొత్తం మీద నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో లోకేష్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరు అందరినీ మెప్పించింది. అలాగే చంద్రబాబునూ మెప్పించింది. అందుకే సెభాష్ లోకేష్ అంటూ ప్రశంసించడమే కాకుండా చూడమంటే ఏకంగా తీసుకువచ్చేశారు అంటూ ఆనందంతో ప్రశంసించారు.  

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతకు నిరసనగా రాయపర్తిలో మాజీ మంత్రి ధర్నా చేపట్టారు.  ఈ ధర్నాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. అలాగే రైతులు కూడా పెద్ద సంఖ్యలో యర్రబెల్లితో పాటు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి ధర్నా విరమించాల్సిందిగా ఎర్రబెల్లిని కోరారు. ఈ సందర్భంగా పోలీసులతో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు మాజీ మంత్రి ఎర్రబెల్లిని అదుపులోనికి తీసుకుని వర్ధన్న పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  

కవిత నివాసానికి కేసీఆర్ సతీమణి.. తల్లీ కూతుళ్ల మధ్య ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌కు గురైన తర్వాత  కల్వకుంట్ల కుటుంబానికి కవిత పూర్తిగా దూరమైనట్లేనంటూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు కూడా కవిత తండ్రిని కలవడానికి ప్రయత్నించినా కేసీఆర్ ఆమెను దూరంగానే ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం(సెప్టెంబర్ 11)  కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తరువాత తొలి సారిగా ఆమె తల్లి, కేసీఆర్సతీమణిక ల్వకుంట్ల శోభ కవిత నివాసానికి వెళ్లారు. శోభ తన కుమార్తె కవిత నివాసానికి వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది.  కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ పుట్టిన రోజు గురువారం (సెప్టెంబర్ 11). ఆ సందర్భాన్నిపురస్కరించుకుని శోభ కవిత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కవితతో  ప్రత్యేకంగా మాట్లాడారు. అన్నీ సర్దుకుంటాయని ఆమె కవితకు చెప్పినట్లు సమాచారం. అదలా ఉంచితే.. అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. కవిత సస్పెన్షన్ తరువాత ఇప్పటి వరకూ కవిత ముఖం కూడా చూడని శోభ ఇప్పుడు పని కట్టుకుని అల్లుడి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు వెళ్లారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండయ్యారు. ఆ తరువాత మూడు రోజులకు అంటే సెప్టెబర్ 5న కవిత కుమారుడి పుట్టిన రోజు. ఆ సందర్భంగా కవిత తన తల్లిని ఆహ్వానించినా ఆమె మనవడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ల లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ సూచన మేరకే శోభ కవిత ఇంటికి వెళ్లి ఆమెను సముదాయించి వచ్చారని అంటున్నారు. కుటుంబంలో సయోధ్య కోసం కేసీఆర్ కుమార్తె వద్దకు శోభను పంపారన్న చర్చ జరుగుతోంది.  సొంత పార్టీ నేతలు, బంధువులు కూడా అయిన హరీశ్‌రావు, సంతోశ్‌ కుమార్‌లపై కవిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, వారి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారం రేపడమే కాకుండా కవిత సస్పెన్షన్ కు కూడా ఆ ఆరోపణలే కారణమయ్యాయి. కవితపై క్రమశిక్షణ చర్య కింద సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ.. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇప్పటి వరకూ కవిత ఆరోపణలను ఖండించలేదు. హరీష్ రావుకు మద్దతుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొత్తంగా కవిత ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటించారు. ఈ నేపథ్యంలోనే తల్లీ కుతుళ్ల భేటీ రాజకీయంగా   ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్  ప్రమాణస్వీకారం 

నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధనకఢ్ , లోకసభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.దీంతో ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలపాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తాజాగా ఆయన ఈ రోజు కార్యక్రమానికి హాజరై అందరి అనుమానాలను నివృత్తి చేశారు.

వైఎస్ రాజకీయవారసుడు నా కొడుకే.. షర్మిల ప్రకటనతో వైసీపీలో గాభరా

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ  భయాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల నిజం చేసేశారు. వైఎస్ రాజకీయవారసుడిగా జగన్ వినా మరొకరు లేరని వైసీపీయులు ఎంతగా అరిచి, గొంతు చించుకుని చెప్పుకుంటున్నా..  షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ  వారిలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ పెంచేసింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి.. తల్లి వెంట ఒక్క పర్యటనలో పాల్గొన్నారో లేదో వైసీపీలో గగ్టోలు మొదలైంది. అంతే వైసీపీయులు విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోయారు. రాజారెడ్డి వైఎస్ వారసుడెలా అవుతారు? అందుకు అవకాశమే లేదు అంటూ మీడియా, సోషల్ మీడియాలో పోస్టులు, ప్రకటనతో రెచ్చిపోయారు. దీంతో షర్మిల రియాక్ట్ అయ్యారు. ఎవరు ఔనన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని కుండబద్దలు కొట్టేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టారని గుర్తు చేశారు. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరిచి గీపెట్టినా దీనిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేసేశారు.  తన కుమారుడు ఇంకా రాజకీయాలలోకి అడుగు పెట్టనే లేదు.. అప్పుడే జగన్  వైసీపీలో ఇంత గాభరా వారిలోని భయాన్ని, అభద్రతా భావాన్నీ సూచిస్తోందని అన్నారు.  జగన్ రెడ్డి తన తండ్రి రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి మరీ రాజకీయ లబ్ధి, ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితమంతా వ్యతిరేకించిన బీజేపీతో జగన్ చేతులు కలిపారని షర్మిల పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ బీజేపీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కేసుల భయంతో బీజేపీకి అణిగిమణిగి ఉండటమే కాకుండా ఆ పార్టీ నాయకత్వానికి అడుగులకు మడుగులొత్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  తన సొంత రాజకీయ మనుగడ కోసం జగన్ బీజేపీతో రాజీపడిపోయారన్న షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి నిజమైన రాజకీయ వారుసుడిగా ఉంటారనీ, వైఎస్ ఆశయాలు, విలువలను కొనసాగిస్తారని షర్మిల అన్నారు. 

జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ లాజికల్ ఎండ్ దిశగా సాగుతోంది.ఆ క్రమంలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, మద్యం కుంభకోణం సొమ్ములను తరలించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలలో సిట్ గురువారం (సెప్టెంబర్ 11) సోదాలు నిర్వహించింది. పదుల సంఖ్యలో సూట్ కేసు కంపెనీలు పెట్టి వాటి ద్వారం మద్యం కుంభకోణం సొమ్ములను మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించినట్లు సిట్ గుర్తించింది. వాస్తవానికి నర్రెడ్డి సునీల్ రెడ్డి వ్యవహారంపై తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయలు గతంలోనే పార్లమెంటులో ప్రస్తావించారు.   మద్యం కుంభకోణం సొమ్ములను విదేశాలకు ఎలా తరలించారన్న విషయాన్ని ఆధారాలతో సహా పార్లమెంటు వేదికగా లావు కృష్ణదేవరాయులు వివరించారు. ఈ సమాచారం ఈడీకి కూడా అందించారు. ఇప్పుడు సిట్ ఆయన నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నది.  ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్   రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏ ద్వారా సమాచారాన్ని రాబట్టిన సిట్.. ఇప్పుడు సునీల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం ద్వారా దర్యాప్తు ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు వరకూ వెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ ఖండన ఎక్కడ?

బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయం సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఎపిసోడ్ ఆమె సస్పెన్షన్ తో ముగిసిందని అంతా భావించినా పార్టీలో మాత్రం ఆ అలజడి ఇసుమంతైనా చల్లారలేదని అంటున్నారు. కాళేశ్వరం అవినీతి అంతా హరీష్ రావు, సంతోష్ లదే అంటూ కవిత చేసిన విమర్శల కారణంగానే ఆమెను సస్పెండ్ చేశారని అంటున్నా.. కవిత సస్పెన్షన్ తో ఆ ఆంశం ముగిసిందనడానికి వీలులేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన అవినీతి విమర్శలను ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ ఖండించలేదు. ఔను కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కవిత ఆరోపణలను ఖండించలేదు. కేవలం ఆమెను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. సస్పెన్షన్ వేటుతో కవిత ఏం వెనక్కు తగ్గలేదు. ఆరోపణలను వెనక్కు తీసుకోనూ లేదు. అయినా కూడా హరీష్ రావుకు మద్దతుగా కవిత ఆరోపణలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలతో కాలం గడిపేస్తున్నారే కానీ, సొంత పార్టీలో అతి కీలక నేతపై తన సోదరి    కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను ఖండించడం మాత్రం చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో హరీష్ పై ఆరోపణల పరంపర రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. కవిత మద్దతుదారులే కాదు.. కాంగ్రెస్ వర్గాల నుంచి సైతం హరీష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   మరో వైపు విశ్లేషకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు  సుద్దపూస కాదని నమ్ముతుండటం వల్లనే బీఆర్ఎస్ ఆయనపై ఆరోపణలను ఖండించడం లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హరీష్ మద్దతు దారులలో కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

మెడికల్ కాలేజీలపై సిగపట్లు!

ఏపీలో తమ మెడికల్ కాలేజీలు, ఎరువుల కొరత చుట్టూ మాజీ సీఎం జగన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఓ వైపు జగన్, ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సై అంటే సై అంటున్నారు. మేం మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేటుకు అమ్మేస్తారా అని జగన్ క్వశ్చన్ చేస్తుంటే.. భూమి కేటాయించి రిబ్బన్ కట్ చేసి వదిలేస్తే  కాలేజీలు నడుస్తాయా అని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.  ఏపీలో ఎరువుల కొరత, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి మాజీ సీఎం జగన్ విమర్శలు మొదలు పెట్టారు. రైతు సమస్యలపై ఆందోళన చేసిన   వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, అంబటి రాంబాబులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.  రైతుల సమస్యలపై పోరాటం చేసినందుకే ఈ నోటీసులు ఇచ్చారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎరువులు సకాలంలో అందిస్తే రైతులు రోడ్లపై నిరసనలు చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు నెలలుగా రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి సర్కారు ఎరువుల కొరత నియంత్రించామని కౌంటర్లు మొదలుపెట్టింది. మరోవైపు ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీలో చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను  పీపీపీ పద్ధతిలో సెట్ చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద చేపట్టాలని డిసైడ్ చేశారు. సెప్టెంబర్ 4న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం పీపీపీ మోడల్ కింద 10 మెడికల్ కాలేజీలను డెవలప్ చేయడానికి ఆమోదం తెలిపింది.  ఫేజ్-1లో  పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. అలాగే  ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలను డెవలప్ చేయనున్నారు.  ఫస్ట్ ఫేజ్ కోసం ఇప్పటికే  రెడీ అయిన రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 6 కాలేజీలు ఫీజబులిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్‌ ఆర్ఎఫ్‌పీ రెడీ అయ్యాక పీపీపీ విధానంలోకి వెళ్లనున్నాయి. పీపీపీ కోసం కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు.  అసలు ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ ఏం జరుగుతోందో.. ఇక్కడి వరకు ఓ క్లారిటీ ఉంది.  ఇది ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అని వైసీపీ అంటుంటే.. కేవలం బిల్డింగ్స్, ఇన్‌‌ఫ్రా వరకు మాత్రమే ప్రైవేట్ వారు చూసుకుంటారని ఇతర యాజమాన్యమంతా ప్రభుత్వానిదే అని కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. అయితే దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ వార్ మొదలైంది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే.. ఈ పీపీపీ మోడల్ కింద ఉన్న అన్ని టెండర్లను రద్దు చేస్తామని మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇస్తున్నారు.  గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ప్రభుత్వ రంగంలో అమలు చేయాలని చూశారు. కానీ ముందడుగు పడలేదు. దీంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేకప్ చేసే బదులు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కు మార్చారు. ప్రభుత్వం చెబుతున్న విషయాల ప్రకారం పీపీపీలో చేస్తే... డిజైన్, ఫైనాన్సింగ్ అమలును ఈజీ చేస్తాయని, ప్రాజెక్ట్ కెపాసిటీని మెరుగుపరుస్తాయని, మనం పెట్టే ప్రతి పైసాకూ లాంగ్ టర్మ్ వాల్యూ అందిస్తాయంటోంది చంద్రబాబు సర్కార్. మొత్తం 10 మెడికల్ కాలేజీలను ఈ పీపీపీలో చేస్తామంటోంది కూటమి సర్కారు.  2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యం నిర్మాణానికి మాత్రమే పరిమితం అని ప్రభుత్వం అంటోంది. కాలేజీల పూర్తి యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందంటున్నారు. సగం సగం పనులతో అసలు కాలేజీలు నడుస్తాయా అని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. 17 మెడికల్‌ కాలేజీలు ఉంటే ఒక్కటి మాత్రమే పూర్తయిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసిందన్నారు.  అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. అసలు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. పునాది వేయడం, రిబ్బన్ కటింగ్ చేయడం, ఏదో చేసేశామని చెప్పడం, కాలేజీని నడిపే విధానం ఇదేనా? అని సీఎం క్వశ్చన్ చేస్తున్నారు.  అటు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం సంవత్సరానికి 360 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలో 7 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రచించిందంటున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ 84 శాతం పూర్తయినప్పటికీ ఎన్ఎంసీ అంచనాల ప్రకారం 48 శాతం బోధనా సిబ్బంది కొరతతో ఉందన్నారు. మోడీ విధానాలతోనే దేశంలో, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరిగాయని, అందులోనూ రకరకాల నిధులను దారి మళ్లించి ఒక్క మెడికల్ కాలేజీని కూడా జగన్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని ఫైర్ అయ్యారాయన. చేసే పని పకడ్బందీగా చేద్దాం.. మధ్యలో వదిలేసేలా వద్దు అన్నది కూటమి ప్రభుత్వం మాట. బోధనా సిబ్బంది ఉంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేకపోవడం, మౌలిక వసతులు ఉంటే డాక్టర్ల కొరత, ఇలా సగం సగం వద్దు అంటున్నారు. అందుకే పీపీపీ మోడల్ తెరపైకి తెచ్చామని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. మొత్తానికి ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. పీపీపీ చుట్టూ పెద్ద పొలిటికల్ బ్లాస్టింగ్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

హస్తినకు చంద్రబాబు.. కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (సెప్టెంబర్12) హస్తిన బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 12) జరగనున్న ఉపరాష్ట్రపతి సీపీ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకార కర్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇందుకోసమే చంద్రబాబు వెడుతున్నారు. ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీయే కూటమి పార్టీల నేతలే కాకుండా విపక్ష పార్టీలకు చెందిన నేతలూ హాజరౌతారు. రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతం. ఇక విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం కీలకంగా వ్యవహరించింది.  ఏపీ ఎన్డీఏ ఎంపీలందర్నీ మంత్రి లోకేష్ సమన్వయం చేశారు. ఇందు కోసం ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు ఉపరాష్ఠ్రపతి ప్రమాణస్వకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెడుతున్నారు. అయితే ఈ హస్తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల హస్తిన వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో దాదాపు ముప్పావుగంట సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలపై మోడీతో చర్చించారు. అయితే ఆ సందర్భంగా నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ కావడాన్ని లోకేష్, మోడీ భేటీకి కొనసాగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పింక్ డైమండ్.. దర్యాప్తు నివేదిక ఏం తేల్చిందో తెలుసా?

తిరుమల పింక్ డైమండ్ వివాదానికి దర్యాప్తు నివేదిక ఫుల్ స్టాప్ పెట్టేసింది. మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఆర్కియిలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయంలో అసలు పింక్ డైమెండే లేదని విస్పష్టంగా తేల్చేసింది. మైసూర్ మహారాజు వెంకటేశ్వరుడికి సమర్పించిన నెక్లెస్‌లో ని పింక్ డైమెండ్ మాయం అయ్యిందంటూ 2018లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారి రమణదీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఆయన అప్పట్లో పింక్ డైమండ్ ను రహస్యంగా విదేశాలకు తరలించేశారని కూడా ఆరోపించారు. ఆయన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. భక్తులు సైతం శ్రీవారి ఆభరణాలకే భద్రత లేదా అన్న ఆందోళణ వ్యక్తం చేశారు. అప్పట్లో వైసీపీ అప్పటి అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పించింది.  అయితే నాడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధాలని ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది.  మైసూరు మహారాజా తిరుమల వేంకటేశ్వరుడికి సమర్పించిన నెక్లస్ లో పింక్ డైమండ్ లేనే లేదనీ, ఉన్నదల్లా కెంపులూ, రాళ్లేనని స్పష్టం చేసింది. తమ దర్యాప్తులో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్ ప్యాలెస్ రికార్డులను పరిశీలించింది. అలాగే మైసూర్ మహారాణి ప్రమోదాదేవినీ సంప్రదించింది. ఆ తరువాత ఆ నెక్లస్ లో అసలు పింక్ డైమండే లేదని నిర్ధారించి, ఆ మేరకు నివేదిక సమర్పించింది.  అంతే కాకుండా 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేల కారణంగా నెక్లస్ లోని కెంపు దెబ్బతిని విరిగి ముక్కలైందనీ, ఆ విషయం అప్పట్లో అధికారికంగా నమోదైందనీ దర్యాప్తు నివేదిక పేర్కొంది. దాని ఆధారంతో పింక్ డైమండ్ అంటూ తప్పుడు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది.  

అమరావతిపై అలా.. మెడికల్ కాలేజీలపై ఇలా.. ఏందిది జగన్?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ఐదేళ్లు అధికారంలో  ఉన్న జ‌గ‌న్  తాను సాధించిన అతి గొప్ప విజయంగా 17 కాలేజీలు నిర్మించానని తన భుజాలు తానే చరిచేసుకుంటూ ఉంటారు. ఆయన పార్టీకి కూడా చెప్పుకునేందుకు ఇది తప్ప మరొకటి కనిపించని పరిస్థితి ఉంది. అయితే వాస్తవం ఉమిటంటే.. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మహా అయితే ఓ   ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి ఉంటుంది. అలా పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు.  ఇక మిగిలిన కాలేజీల విషయానికి వస్తే భూ కేటాయింపులైతే జరిగాయి కానీ, నిర్మాణ పనులు ఆరంభం కాలేదు. కొన్ని కాలేజీలకు పునాదులు మాత్రమే పడ్డాయి. అంతే. ఐతే వైసీపీ మాత్రం 17 కాలేజీల నిర్మాణం తమ హయాంలో పూర్తయ్యిందని గప్పాలు కొట్టేసుకుంటున్నది. ఇదే విషయాన్ని జగన్ బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో తన హయాంలో 17 కాలేజీల నిర్మాణం పూర్తయ్యిందని మరోమారు చెప్పుకుని, తన భుజం తానే చరుచుకుని చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సరే జగన్ విమర్శలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారనుకోండి అది వేరు సంగతి. ఇప్పుడు విషయానికి వస్తే జగన్ ను మీడియా ప్రతినిథులు కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదుగా అని అడిగితే.. జగన్ ఏ నిర్మాణమైనా ఒక్క రోజులో పూర్తి కాదు.. కొన్నేళ్ల సమయం పడుతుందంటూ జవాబిచ్చారు. ఇందుకు ఉదాహరణగా మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టిందంటూ ఉదాహరణ చూపారు. మంగళగిరి ఎయిమ్స్ భారీ భవన సముదాయం. నిర్మాణానికి సమయం పట్టిందంటూ అర్ధం ఉంది. దానిని ఉదాహరణగా చూపుతూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా సమయం పడుతుందంటూ జగన్ సమర్ధించుకోవాలని చూశారు. ఆయన సమర్ధింపు ఎలా ఉందంటే.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్ల సమయం సరిపోదన్నట్లుగా ఉంది.  ఈ లాజిక్ తో మీడియా నోరు మూసేశానని జగన్ సంబరపడి ఉండొచ్చు కానీ  2015లో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఖ‌రార‌య్యాక త‌ర్వాతి నాలుగేళ్ల‌లో రాజ‌ధాని పూర్తి కాలేదంటూ అప్పట్లో జగన్ కురిపించిన విమర్శల మాటేంటన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారు.  40 వేల కోట్ల‌కు పైగా వ్యయంతో పలు భారీ భవనాలు దాదాపు పూర్తి అయినా అప్పట్లో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదంటూ చేసిన వ్యాఖ్యల సంగతేంటని నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు  ఎలా సరిపోతాయంటూ తర్కం మాట్లాడుతున్న జగన్.. అమరావతిపై నిర్మాణాలపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు ఏం లాజిక్ చెబుతారని నిలదీస్తున్నారు.  

ప్రైవేటీకరణకు.. పీపీపీకి తేడా తెలియని జగన్.. మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజ్ణానానికి, అవగాహనా రాహిత్యానికీ నిలువెత్తు సాక్ష్యం ఆయన బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలేనని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రైవేటీకరణకు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వా మ్యం(పీపీపీ)కి మధ్య వ్యత్యాసం తెలియదని లోకేష్ అన్నారు. సచివాలయంలో బుధవారం (సెప్టెంబర్ 10)న మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వైద్య కళాశాలల అభివృద్ధి కోసం తాము పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో వైద్య కళాశాలలకు కనీసం పునాదులు కూడా వేయలేదని ఆయన తెలిపారు.   కానీ ఇప్పుడు జగన్ తన హయాంలో మెడికల్ కాలేజీలు కట్టేశామని గప్పాలు కొట్టుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ కు అవగాహన లేకపోతే పోయింది.. ఆయన సలహాదారులను అడిగైనా వాస్తవం ఏమిటో ఆయన తెలుసుకుంటే మంచిదని సూచించారు.  వైద్యకళాశాలలను పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు.  

నేపాల్‌లో చిక్కుకున్నవారిని తీసుకొచ్చే బాధ్యత మాదే : లోకేష్

  నేపాల్‌లో 12 ప్రాంతాల్లో  217 మంది ఏపీ పర్యాటకులు చిక్కుకున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వీరంతా 12 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని లోకేశ్ పేర్కొన్నారు. తొలి విడతలో బీహార్ బార్డర్‌కు 22 మందిని తరలించామని వెల్లడించారు. రేపు ఖాట్మండులో కర్య్ఫూ సడలించగానే 173 మందిని ప్రత్యేక విమానంలో తీసుకోస్తామని లోకేశ్ తెలిపారు.నేపాల్‌లోని తెలుగువారి పరిస్థితులపై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.‘ ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ ఉన్న రాష్ట్ర వాసులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాం. ఏపీ భవన్‌లో టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసి నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించామన్నారు. నేపాల్‌ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ఏపీ వాసులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తీసుకొస్తామని తెలిపారు. నేపాల్‌లో ఉన్న ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నిస్తున్నాం. నేపాల్‌ నుంచి వచ్చే ప్రత్యేక విమానం విశాఖ, కడపకు చేరుకుంటుంది’’ అని మంత్రి వివరించారు.  

ఇది రాష్ట్ర క‌మిటీ కాదు...కిష‌న్ రెడ్డి క‌మిటీ!

  బీజేపీలో క‌మిటీల క‌ల‌హం మొద‌లైంది. రాష్ట్రానికి కొత్త అధ‌క్షుడొచ్చాడ‌న్న కొత్త ఆశే లేకుండా పోయింది. పాత కొత్త‌ల మేలు క‌ల‌యిక‌గా ఉండాల్సిన పార్టీ జ‌ట్టు కూర్పు కాస్తా ఏక‌ప‌క్షం అయిపోయింది. ఒక ద‌శ‌లో మాజీ బీజేపీ నేత‌, ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఇది స్టేట్ క‌మిటీనా? సికింద్రాబాద్ క‌మిటీనా? అంటూ తేల్చేశారు. ఆయ‌న అన్న‌ట్టుగానే స్టేట్ బీజేపీలో సికింద్రాబాద్ నుంచి ఏకంగా 11 మందిని తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ఈ కామెంట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త‌నివ్వ‌క పోవ‌డంతో.. రాజాసింగ్ లాంటి చాలా మంది ఆయ‌న బాట‌లో న‌డిచే అవ‌కాశ‌ముంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే ఇదేమీ త‌న మార్క్ టీమ్ కాదంటారు రామ‌చంద్ర‌రావు. ఇది బీజేపీ మార్క్ టీం. ఈ టీమ్ తోనే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని ఘంటా ప‌దంగా చెప్పారాయ‌న‌. అంతే కాదు.. ఇలాంటి అసంతృప్తులూ ఉంటూనే ఉంటాయి. ఇందులో ఆశ్చ‌ర్య పోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. రాజాసింగ్ లాంటి వారు విమ‌ర్శిస్తూనే ఉంటార‌ని కామెంట్ చేశారు టీబీజేపీ చీఫ్ రామ‌చంద్ర‌రావు. ముగ్గురు ఎంపీలున్న ఉత్త‌ర తెలంగాణ జిల్లాలైన క‌రీంన‌గ‌ర్, మెద‌క్, ఆదిలాబాద్ నుంచి క‌నీసం ఒక్క‌రు కూడా క‌మిటీలో లేక పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం ప‌రిధిలోని నేత‌ల‌కు క‌నీస ప్రాతినిథ్యం లేకుండా  పోయింద‌ని వాపోతున్నారీ ప్రాంత వాసులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వీరు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాల్లో గ‌త ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డ్డ ఎంద‌రో లీడ‌ర్ల పేర్లు క‌మిటీలో పెట్టాల‌న్న ప‌ప్ర‌తిపాద‌న‌లు అందాయి. బండి సంజ‌య్, ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు నేరుగా రామ‌చంద్ర‌రావు ముంద‌టే చెప్పారు. మా వాళ్ల‌కు త‌గిన చోటు క‌ల్పించాల్సిందేన‌ని.. కానీ, ఎలాంటి క‌నిక‌రం చూపిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఇదే ర‌క‌మైన సిఫార్సులు చేశారు. వీరెవ‌రి ప్ర‌తిపాద‌న‌లు కూడా ప‌ట్టించుకోలేదు. అన్నీ బుట్ట‌దాఖ‌ల‌యిన‌ట్టు తెలుస్తోంది. క‌మిటీ మొత్తం మాజీ స్టేట్ ప్రెసిడెంట్ కిష‌న్ రెడ్డి, ఆపై రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ భ‌న్స‌ల్ స‌న్నిహితుల‌తో నిండిపోయినట్టు క‌నిపిస్తోంది. వీరితో పాటు రాష్ట్ర సంఘ‌ట‌న్ కార్య‌ద‌ర్శిగా ప‌ని  చేసిన ఒక నేత‌తో పాటు.. పార్టీ ఆర్ధిక వ్య‌వ‌హారాలు చూసిన ఒక ఒక ప్రొఫెస‌ర్ సూచ‌న‌లు సైతం కీల‌కంగా ప‌ని చేసిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో రాష్ట్ర అధ్య‌క్షుడిగా  ప‌ని చేసిన బండి సంజ‌య్ మాట‌ను క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఎంపీలు డీకే అరుణ‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల‌, కొండా, గోడం న‌గేశ్ వంటి వారి స‌ల‌హా సూచ‌న‌లేవీ ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వీరంతా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పార్టీ అధిష్టానం నుంచి వ‌చ్చిన ఒక నేత‌కు ఫుట్ బాల్ బ‌హుమ‌తిగా ఇచ్చి త‌న నిర‌స‌న వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి.  ఇదిలా ఉంటే ఒక ప‌క్క కాంగ్రెస్ బీసీ బిల్లు అంటూ నానా హంగామా చేస్తోంటే.. ఎప్ప‌టిలాగానే బీసీల‌కు బొత్తిగా మొండి చేయి చూపించింది బీజేపీ రాష్ట్ర క‌మిటీ. బేసిగ్గా క‌మిటీలో 40 శాతం పాత వారికి చోటివ్వాల్సి ఉంది. కానీప్ర‌స్తుత జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నికైన ముగ్గురూ కొత్త‌వారే. బండి వ‌ర్గీయులుగా పేరుబ‌డ్డ గీతామూర్తి, మ‌నోహ‌ర్ రెడ్డి, రామ‌కృష్ణారెడ్డి, ఆంజ‌నేయులు, రాణీరుద్ర‌మ‌కు క‌మిటీలో చోటు ద‌క్క‌లేదు. మ‌రోప‌క్క అర‌వింద్, ఈట‌ల సూచించిన పేర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 11 ఓసీలుంటే ఇందులో న‌లుగురు బ్రాహ్మ‌ణులు, న‌లుగురు రెడ్లకు అవ‌కాశం ఇచ్చారు. బీసీవాదుల‌మ‌ని చెప్పుకుంటూనే క‌నీసం స‌గం మందికి కూడా క‌మిటీలో ప్ర‌యారిటీ ఇవ్వలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో ఈ  ప‌రిణామాలు ఎలా దారి తీస్తాయో తెలీడం లేద‌ని అంటున్నారు. అందుకే రాజాసింగ్ దీన్ని సికింద్ర‌బాద్ ఎంపీ కిష‌న్ రెడ్డి క‌మిటీగా  కామెంట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కిష‌న్ రెడ్డి మాట ఇంకా చెల్లుబాటు కావ‌డం అంటే అది తిరిగి పాత బీజేపీగానే వెన‌క‌బ‌డి ఉంటుంది త‌ప్ప కొత్తద‌నం అంటూ ఏమీ ఉండ‌దు.. ముందుకెళ్ల‌డం అంత‌క‌న్నా జ‌ర‌గ‌ద‌న్న కామెంట్ వినిపిస్తోంది. రాజాసింగ్ మాట‌ల‌ను అనుస‌రించి చెబితే ఆయ‌న‌కు అధికారంలోకి పార్టీ రావ‌డం క‌న్నా.. ఎవ‌రు అధికారంలో  ఉంటారో వారి ద్వారా ప‌నులు చ‌క్క‌బెట్ట‌డం బాగా తెలుసు కాబ‌ట్టి.. ఇది ముందుకెళ్లే క‌మిటీ కాదు.. వెన‌కెన‌క దాగి సొంత ప‌నులు  చేయించుకునే క‌మిటీగా కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి !

  తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని  ఆందోళనకారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నిరసనకారులతో వర్చువల్‌గా సమావేశమైన సుశీల ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్‌తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనలకు జెన్ జీ అంగీకరించినట్లు తెలుస్తోంది.సుశీలా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. జనరల్-జెడ్ వర్చువల్ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచారం ప్రకారం, దాదాపు 5000 మంది వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. సుశీలా కర్కి నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఆమె జూన్ 7, 1952న మొరాంగ్ జిల్లాలోని బిరత్‌నగర్‌లో జన్మించారు. ఆమె మహేంద్ర మొరాంగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. దీని తరువాత, ఆమె నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందింది.  

బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా : రాజాసింగ్

  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు వెనుక కొందరు ఉండి బీజేపీని నడిపిస్తున్నారని తెలిపారు. ఆయన రబ్బరు స్టాంప్ మాత్రమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. ఇద్దరు స్వతంత్రులుగా పోటీ చేద్దామని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తెలుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని తెలిపారు.  తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు. తనకు ఢిల్లీ పెద్దలు తరుచూ ఫోన్ చేసి మాట్లాడుతారని, తనకు అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం ఉందని ఆయన అన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ సెక్యులర్ వాదిని మాత్రం కానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి తిట్టారని అన్నారు. తాను చేసే కామెంట్స్ పార్టీపై కాదని, కొందరు నేతలపై మాత్రమే అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.   

దసరా రోజున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు : సీఎం చంద్రబాబు

    పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి.. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో చెప్పాం... ఎన్ని కష్టాలున్నా అమలు చేస్తామని సీఎం తెలిపారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలని సీఎం తెలిపారు. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  2023, మే నెల 28న రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని సూపర్ సిక్స్ హామీలతో పాటు ఉమ్మడిగా కూటమి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి  ప్రజా తీర్పు కోరామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. కనీ వినీ ఎరుగని రీతిలో 57 శాతం ఓట్ షేర్, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టివేసిందని చంద్రబాబు అన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై దురాగతాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారని ఆయన పేర్కొన్నారు.    ప్రతి పేద బిడ్డా చదవాలని తల్లికి వందనం’ తీసుకువచ్చామని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా, పరిమితులు లేకుండా అందరికీ రూ. 15 వేలు చొప్పున అందించాం. 67 లక్షల మంది విద్యార్ధుల చదువులకు ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.      ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్‌ హిట్‌ అయింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేశాం’’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలిసభ కావడంతో కార్యకర్తలు భారీగా తరలించ్చారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ సభా ప్రాంగణానికి రాగానే.. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వారికి చంద్రబాబు, పవన్‌, మాధవ్‌ అభివాదం చేశారు. దీంతో వారంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.