ఇది రాష్ట్ర కమిటీ కాదు...కిషన్ రెడ్డి కమిటీ!
posted on Sep 10, 2025 @ 9:08PM
బీజేపీలో కమిటీల కలహం మొదలైంది. రాష్ట్రానికి కొత్త అధక్షుడొచ్చాడన్న కొత్త ఆశే లేకుండా పోయింది. పాత కొత్తల మేలు కలయికగా ఉండాల్సిన పార్టీ జట్టు కూర్పు కాస్తా ఏకపక్షం అయిపోయింది. ఒక దశలో మాజీ బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఇది స్టేట్ కమిటీనా? సికింద్రాబాద్ కమిటీనా? అంటూ తేల్చేశారు. ఆయన అన్నట్టుగానే స్టేట్ బీజేపీలో సికింద్రాబాద్ నుంచి ఏకంగా 11 మందిని తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ఈ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. తమకు తగిన ప్రాధాన్యతనివ్వక పోవడంతో.. రాజాసింగ్ లాంటి చాలా మంది ఆయన బాటలో నడిచే అవకాశముందన్న మాట వినిపిస్తోంది.
అయితే ఇదేమీ తన మార్క్ టీమ్ కాదంటారు రామచంద్రరావు. ఇది బీజేపీ మార్క్ టీం. ఈ టీమ్ తోనే తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఘంటా పదంగా చెప్పారాయన. అంతే కాదు.. ఇలాంటి అసంతృప్తులూ ఉంటూనే ఉంటాయి. ఇందులో ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదు. రాజాసింగ్ లాంటి వారు విమర్శిస్తూనే ఉంటారని కామెంట్ చేశారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు.
ముగ్గురు ఎంపీలున్న ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ నుంచి కనీసం ఒక్కరు కూడా కమిటీలో లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని నేతలకు కనీస ప్రాతినిథ్యం లేకుండా పోయిందని వాపోతున్నారీ ప్రాంత వాసులు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వీరు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో గత ఎన్నికల్లో కష్టపడ్డ ఎందరో లీడర్ల పేర్లు కమిటీలో పెట్టాలన్న పప్రతిపాదనలు అందాయి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి వారు నేరుగా రామచంద్రరావు ముందటే చెప్పారు. మా వాళ్లకు తగిన చోటు కల్పించాల్సిందేనని.. కానీ, ఎలాంటి కనికరం చూపినట్టు కనిపించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన సిఫార్సులు చేశారు. వీరెవరి ప్రతిపాదనలు కూడా పట్టించుకోలేదు. అన్నీ బుట్టదాఖలయినట్టు తెలుస్తోంది.
కమిటీ మొత్తం మాజీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఆపై రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ భన్సల్ సన్నిహితులతో నిండిపోయినట్టు కనిపిస్తోంది. వీరితో పాటు రాష్ట్ర సంఘటన్ కార్యదర్శిగా పని చేసిన ఒక నేతతో పాటు.. పార్టీ ఆర్ధిక వ్యవహారాలు చూసిన ఒక ఒక ప్రొఫెసర్ సూచనలు సైతం కీలకంగా పని చేసినట్టు అంచనా వేస్తున్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్ మాటను కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయ్.
ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల, కొండా, గోడం నగేశ్ వంటి వారి సలహా సూచనలేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వీరంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఒక నేతకు ఫుట్ బాల్ బహుమతిగా ఇచ్చి తన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి.
ఇదిలా ఉంటే ఒక పక్క కాంగ్రెస్ బీసీ బిల్లు అంటూ నానా హంగామా చేస్తోంటే.. ఎప్పటిలాగానే బీసీలకు బొత్తిగా మొండి చేయి చూపించింది బీజేపీ రాష్ట్ర కమిటీ. బేసిగ్గా కమిటీలో 40 శాతం పాత వారికి చోటివ్వాల్సి ఉంది. కానీప్రస్తుత జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ముగ్గురూ కొత్తవారే. బండి వర్గీయులుగా పేరుబడ్డ గీతామూర్తి, మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, రాణీరుద్రమకు కమిటీలో చోటు దక్కలేదు. మరోపక్క అరవింద్, ఈటల సూచించిన పేర్లను సైతం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
11 ఓసీలుంటే ఇందులో నలుగురు బ్రాహ్మణులు, నలుగురు రెడ్లకు అవకాశం ఇచ్చారు. బీసీవాదులమని చెప్పుకుంటూనే కనీసం సగం మందికి కూడా కమిటీలో ప్రయారిటీ ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలు ఎలా దారి తీస్తాయో తెలీడం లేదని అంటున్నారు. అందుకే రాజాసింగ్ దీన్ని సికింద్రబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కమిటీగా కామెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
కిషన్ రెడ్డి మాట ఇంకా చెల్లుబాటు కావడం అంటే అది తిరిగి పాత బీజేపీగానే వెనకబడి ఉంటుంది తప్ప కొత్తదనం అంటూ ఏమీ ఉండదు.. ముందుకెళ్లడం అంతకన్నా జరగదన్న కామెంట్ వినిపిస్తోంది. రాజాసింగ్ మాటలను అనుసరించి చెబితే ఆయనకు అధికారంలోకి పార్టీ రావడం కన్నా.. ఎవరు అధికారంలో ఉంటారో వారి ద్వారా పనులు చక్కబెట్టడం బాగా తెలుసు కాబట్టి.. ఇది ముందుకెళ్లే కమిటీ కాదు.. వెనకెనక దాగి సొంత పనులు చేయించుకునే కమిటీగా కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.