సెభాష్ లోకేష్!.. చంద్రబాబు నోట అరుదైన ప్రశంస
posted on Sep 12, 2025 @ 2:39PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రోజు రోజుకూ ప్రజానాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. అయితే పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ప్రశంసలు అందుకోవాలంటే ఇది సరిపోదు.. ఇంతకు మించి ఉండాలి అంటారు పరిశీలకులు. మామూలుగా చంద్రబాబు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే.. అది పూర్తయ్యే వరకూ ఆయన నిద్రపోరు.. ఆ పనితో సంబంధం ఉన్నవారిని నిద్రపోనివ్వరు అంటారు. ఎవరిదాకానో ఎందుకు పలు సందర్భాలలో స్వయంగా చంద్రబాబే ఆ విషయం చెప్పారు.
ఇప్పటికే పరిశీలకులు నారా లోకేష్ ను తండ్రికి తగ్గ తనయుడు అనడమే కాకుండా అంతకు మించి.. తండ్రిని మించిన తనయుడు అని కూడా శ్లాఘిస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. ప్రతిభను చంద్రబాబు గుర్తిస్తారు. ఆ ప్రతిభకు పరీక్ష పెడతారు. ఆ విషయంలో ఆయనకు తన, పర బేధాలుండవు. ఇప్పుడు జరిగిందదే.
అల్లర్లతో అట్టుడికి పోతున్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా, సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చే గురుతర బాధ్యతను చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను లోకేష్ ఆయనే అచ్చెరువోందేంత సమర్థతతో నిర్వహించారు. నిద్రపోను.. నిద్రపోనివ్వను లాంటి మాటలు లేవు. హడావుడి లేదు, ఆర్భాటం లేదు. పరుగులు పెట్టడం లేదు.. పరుగులు పెట్టించడం లేదు. అమరావతి సెక్రటేరియెట్ లోని ఆర్టీజీఎస్ లో కూర్చుని ఆ పనంతా కనుసైగలతో జరిగగిపోయేలా చేశారు.. చుశారు లోకేష్. అవును ఆర్టీజీఎస్ సెంటర్ నుంచే నేపాల్ లో చిక్కుకుని బిక్కు బిక్కుమం టున్న తెలుగువారిలో భరోసా నింపడంతో పాటు.. సురక్షితంగా స్వరాష్ట్రానికి చేరుతామన్న నమ్మకాన్నీ కలిగించారు.
అదే సమయంలో కేంద్రంలోని పెద్దలతో టచ్ లో ఉంటూ.. నేపాల్ నుంచి తెలుగువారిని స్వరాష్ట్రానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఆయన కోరిన మీదటే.. కేంద్ర రెండు విమానాలను ఏర్పాటు చేసింది. ఈ లోగా ప్రతి రెండుగంటలకు ఓ సారి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారితో మాట్లాడారు. వారి యోగక్షేమాలు కనుక్కున్నారు.వీడియో కాల్స్ కూడా చేశారు. కేంద్రం రెండు విమానాలను ఏర్పాటు చేస్తే అవి నేపాల్ లోని తెలుగువారిని తీసుకుని ఢిల్లీ చేరుకునే సరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక ఛార్టర్డ్ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. ఆ విమానంలోనే వారిని ఢిల్లీ నుంచి విశాఖకు, తిరుపతి, కడప జిల్లాలకు చేర్చింది. అక్కడ నుంచి ప్రత్యేక కార్లు, బస్సులు ఏర్పాటు చేసి వారి వారి నివాసాలకు చేరేలా అన్ని ఏర్పాట్లూ లోకేష్ ఒంటి చేత్తో పూర్తి చేశారు.
మొత్తం మీద నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో లోకేష్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరు అందరినీ మెప్పించింది. అలాగే చంద్రబాబునూ మెప్పించింది. అందుకే సెభాష్ లోకేష్ అంటూ ప్రశంసించడమే కాకుండా చూడమంటే ఏకంగా తీసుకువచ్చేశారు అంటూ ఆనందంతో ప్రశంసించారు.