వైఎస్ రాజకీయవారసుడు నా కొడుకే.. షర్మిల ప్రకటనతో వైసీపీలో గాభరా
posted on Sep 12, 2025 @ 10:50AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ భయాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల నిజం చేసేశారు. వైఎస్ రాజకీయవారసుడిగా జగన్ వినా మరొకరు లేరని వైసీపీయులు ఎంతగా అరిచి, గొంతు చించుకుని చెప్పుకుంటున్నా.. షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ వారిలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ పెంచేసింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి.. తల్లి వెంట ఒక్క పర్యటనలో పాల్గొన్నారో లేదో వైసీపీలో గగ్టోలు మొదలైంది.
అంతే వైసీపీయులు విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోయారు. రాజారెడ్డి వైఎస్ వారసుడెలా అవుతారు? అందుకు అవకాశమే లేదు అంటూ మీడియా, సోషల్ మీడియాలో పోస్టులు, ప్రకటనతో రెచ్చిపోయారు. దీంతో షర్మిల రియాక్ట్ అయ్యారు. ఎవరు ఔనన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని కుండబద్దలు కొట్టేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టారని గుర్తు చేశారు. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరిచి గీపెట్టినా దీనిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేసేశారు. తన కుమారుడు ఇంకా రాజకీయాలలోకి అడుగు పెట్టనే లేదు.. అప్పుడే జగన్ వైసీపీలో ఇంత గాభరా వారిలోని భయాన్ని, అభద్రతా భావాన్నీ సూచిస్తోందని అన్నారు.
జగన్ రెడ్డి తన తండ్రి రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి మరీ రాజకీయ లబ్ధి, ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితమంతా వ్యతిరేకించిన బీజేపీతో జగన్ చేతులు కలిపారని షర్మిల పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ బీజేపీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కేసుల భయంతో బీజేపీకి అణిగిమణిగి ఉండటమే కాకుండా ఆ పార్టీ నాయకత్వానికి అడుగులకు మడుగులొత్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన సొంత రాజకీయ మనుగడ కోసం జగన్ బీజేపీతో రాజీపడిపోయారన్న షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి నిజమైన రాజకీయ వారుసుడిగా ఉంటారనీ, వైఎస్ ఆశయాలు, విలువలను కొనసాగిస్తారని షర్మిల అన్నారు.