హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ ఖండన ఎక్కడ?
posted on Sep 11, 2025 @ 3:48PM
బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయం సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఎపిసోడ్ ఆమె సస్పెన్షన్ తో ముగిసిందని అంతా భావించినా పార్టీలో మాత్రం ఆ అలజడి ఇసుమంతైనా చల్లారలేదని అంటున్నారు. కాళేశ్వరం అవినీతి అంతా హరీష్ రావు, సంతోష్ లదే అంటూ కవిత చేసిన విమర్శల కారణంగానే ఆమెను సస్పెండ్ చేశారని అంటున్నా.. కవిత సస్పెన్షన్ తో ఆ ఆంశం ముగిసిందనడానికి వీలులేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన అవినీతి విమర్శలను ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ ఖండించలేదు. ఔను కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కవిత ఆరోపణలను ఖండించలేదు. కేవలం ఆమెను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. సస్పెన్షన్ వేటుతో కవిత ఏం వెనక్కు తగ్గలేదు. ఆరోపణలను వెనక్కు తీసుకోనూ లేదు. అయినా కూడా హరీష్ రావుకు మద్దతుగా కవిత ఆరోపణలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలతో కాలం గడిపేస్తున్నారే కానీ, సొంత పార్టీలో అతి కీలక నేతపై తన సోదరి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను ఖండించడం మాత్రం చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో హరీష్ పై ఆరోపణల పరంపర రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. కవిత మద్దతుదారులే కాదు.. కాంగ్రెస్ వర్గాల నుంచి సైతం హరీష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరో వైపు విశ్లేషకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు సుద్దపూస కాదని నమ్ముతుండటం వల్లనే బీఆర్ఎస్ ఆయనపై ఆరోపణలను ఖండించడం లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హరీష్ మద్దతు దారులలో కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది.