బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా : రాజాసింగ్
posted on Sep 10, 2025 @ 6:43PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు వెనుక కొందరు ఉండి బీజేపీని నడిపిస్తున్నారని తెలిపారు. ఆయన రబ్బరు స్టాంప్ మాత్రమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. ఇద్దరు స్వతంత్రులుగా పోటీ చేద్దామని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తెలుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని తెలిపారు.
తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు.
తనకు ఢిల్లీ పెద్దలు తరుచూ ఫోన్ చేసి మాట్లాడుతారని, తనకు అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం ఉందని ఆయన అన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ సెక్యులర్ వాదిని మాత్రం కానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి తిట్టారని అన్నారు. తాను చేసే కామెంట్స్ పార్టీపై కాదని, కొందరు నేతలపై మాత్రమే అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.