మరో నీటిగండం: ఐదుగురు విద్యార్థుల మృతి
posted on Jun 30, 2014 @ 1:50PM
ఇంజనీరింగ్ విద్యార్థుల మీద ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో బీస్ నది దగ్గర జరిగిన దుర్ఘటనలో 23 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మరణించిన విషయాన్ని ఇంకా మరువకముందే నల్లగొండ జిల్లాలోని దిండి ప్రాజెక్టు దగ్గర మరో విషాద సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరిలో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు వున్నారు. వీరు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్లంతా అన్నదమ్ముల బిడ్డలు. తమ తాతయ్య దశదిన కర్మల కార్యక్రమానికి వచ్చి, ఆ తర్వాత ఆరుగురు కలిసి దిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. ఐదుగురూ నీటిలో దిగిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ ఐదుగురు కొట్టుకుపోయారు. ఒక్కరు మాత్రం నీటి ప్రవాహం పెరగడాన్ని గమనించి ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హర్షవర్ధన్, ప్రణీత్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, దేవయాని, జ్యోత్స్నగా గుర్తించారు. మృతదేహాలు బయటపడ్డాయి.