Read more!

రాకెట్ సూపర్ సక్సెస్ అయిందోచ్!

 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో శాటిలైట్ లాంచ్ వెహికల్ (రాకెట్)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్‌ని భారత ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో సోమవారం ఉదయం 9.52 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించింది.. ఈ వాహననౌక పీఎస్‌ఎల్‌వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 27వది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్‌కు చేరుకొని స్వయంగా రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఉన్నారు. మరోసారి విజయం సాధించిన షార్ శాస్త్రవేత్తలను ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు అభినందించారు.