ప్రేమించుకున్నారని పబ్లిగ్గా తలలు నరికారు!
posted on Jun 28, 2014 @ 5:48PM
పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఒక జంట ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న పాపానికి ఆ జంటలోని అమ్మాయి బంధువులు అందరూ చూస్తుండగా పబ్లిగ్గా ఆ జంట తలలు నరికేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్.లో ఈ సంఘటన జరిగింది. లాహోర్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని దక్షా తెహ్సిల్ అనే గ్రామంలో నివసించే ముయాఫియా బీబీ (23) అనే యువతి పొరుగూరికి చెందిన సజ్జాద్ అహ్మద్ (27) అనే యువకుడిని ప్రేమించింది. ఈ జంట ప్రేమను ముయాఫియా బీబీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో వీరిద్దరూ పారిపోయి జూన్ 18న పెళ్ళి చేసుకున్నారు. పదిరోజులు గడిచిన తర్వాత ఈ జంటకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఒక సమాచారం అందింది. జరిగిందోదే జరిగిపోయింది. మేం మీ పెళ్ళిని ఆమోదిస్తున్నాం. మీరు ఇక ఇంటికి వచ్చేయొచ్చనేది ఆ సమాచారం సారాంశం. తమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించిందన్న ఆనందంతో ఆ కొత్త జంట ముయాఫియా బీబీ ఇంటికి ఆనందోత్సాహాలతో బయల్దేరింది. అయితే వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టగానే ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఊరి చౌరస్తాలో వారిమీద దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఆ కొత్త జంట తలలను అత్యంత కిరాతకంగా నరికేశారు. ఏ ఊరిలో అయితే తమ పరువు పోయిందో ఆ ఊరిలో అందరిముందు వారిద్దరినీ చంపడం ద్వారానే తమ పోయిన పరువు తిరిగి వస్తుందని ముయాఫియా బీబీ కుటుంబ సభ్యులు భావించారని ఆ తర్వాత పోలీసుల విచారణలో తేలింది.