ఘనంగా పీవీ జయంతి
posted on Jun 28, 2014 @ 12:25PM
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమం హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో జరిగింది. పీవీ జయంతిని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పీవీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘పీవీ మా తెలంగాణ బిడ్డ... ఆయన విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తే గుంపులో గోవింద అవుతుంది. అలా కాకుండా సమున్నత స్థానంలో ఘనంగా పీవీ విగ్రహ ప్రతిష్ట చేస్తాం. దేశం గర్వించేలా ఆ కార్యక్రమం చేపడతాం. పీవీని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదు. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు పీవీ పేరు పెడతాం. దాంతో పాటు జిల్లాలో స్థాపించబోయే యూనివర్సిటీల్లో ఒక దానికి పీవీ పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తాం. పీవీ గౌరవానికి తగినట్లుగా స్మారక భవనం ఏర్పాటు చేస్తాం. దేశంలో తొలిసారి భూ సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహరావు, దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్నికోరతాం. ఆయన ఆదర్శాలు, సంస్కరణలు, రచనలు భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపడతాం’’ అన్నారు.