గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్

  'నారా హమారా - టీడీపీ హమారా' పేరుతో టీడీపీ భారీ సభ ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.. ఈ సభ ద్వారా ముస్లింలకు టీడీపీ ఎంత అండగా ఉందనే విషయాన్ని ముస్లింలలోకి తీసుకెళ్లారు.. అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం, టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ముస్లింలకు న్యాయం జరగదంటూ ‘నారా హఠావో- ముస్లిం బచావో’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నసంగతి తెలిసిందే.. కాగా వైసీపీ కార్యక్రమాలను గుంటూరు జిల్లాలోని ముస్లింలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.. నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు.. మార్కెట్‌లోని గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. జగన్ కుట్ర రాజకీయాలకు ముస్లిం సోదరులు బలికావద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

కడపలో కేంద్రమంత్రి కారుపై బూటు విసిరిన మహిళ

  కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప వాసులు కోరుతున్న సంగతి తెలిసిందే.. దానిని కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.. అయితే ఈ ఉక్కు సెగ ఇప్పుడు కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డేకు తాకింది.. కడప ఆర్‌అండ్‌బీ వద్ద అనంతకుమార్‌ కారును రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వీరిని లాగి పక్కకు పడేశారు.. ఆ తర్వాత కారు ముందుకు కదిలింది.. అనంతకుమార్ కారు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారు వైపు బూటును విసిరింది.. ఆ బూటు అయితే తగల్లేదు కానీ కడప నిరసన ఘాటయినా కేంద్రానికి తగులుతుందేమో చూడాలి.  

బీజేపీకి మిత్రపక్షం పెద్ద షాక్..!!

  2014 ఎన్నికల విజయం తరువాత మాకు ఎదురులేదు, మేం చెప్పిందే వేదం అనుకున్న బీజేపీకి.. ఈమధ్య వ్యతిరేకత పెరగడంతో షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి.. మొన్నటికి మొన్న టీడీపీ, ఎన్డీయే నుండి బయటికొచ్చి వ్యతిరేకంగా పోరాడుతుంది.. ఇక శివసేన అంటీ ముట్టనట్టుగా ఉంటుంది.. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు బీహార్ అధికార పార్టీ జేడీయూ కూడా బీజేపీకి షాక్ ఇస్తుంది.. బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది, ఉపఎన్నికల్లో కూడా చేదు ఫలితాలు ఎదురయ్యాయి.. దీంతో ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుందో ఏమో కానీ జేడీయూ సీట్ల పంపకం విషయంలో అసలు తగ్గట్లేదు.. మాకు ఎక్కువ సీట్లు కావాల్సిందే అంటూ పట్టుపడుతుంది.. అవసరమైతే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెగేసి చెప్తుంది.. మొత్తం 40 స్థానాలున్న బీహార్‌లో బీజేపీ- 20, జేడీయూ-12, ఎల్‌జేపీ- 6, ఆర్‌ఎల్ఎస్పీ- 2 సీట్లు కేటాయింపు జరిగినట్టు ప్రచారం జరిగింది.. అయితే, సీట్ల పంపకం ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి.. ఆ లెక్క తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, జేడీయూకి అధిక స్థానాలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.. పాపం మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో.

పొరపాటున హీరోయిన్‌ని కాల్చి చంపిన‌ పోలీసులు

  నోటి మాట, తుపాకీ తూటా వదిలేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలి.. తొందరపడి మాట జారితే ఎదుటి వ్యక్తికి బాధ కలుగుతుంది.. తూటా వదిలితే ఏకంగా ఎదుటి వ్యక్తి ప్రాణమే పోతుంది.. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.. పోలీసులు షూట్ చేసారు హాలీవుడ్ హీరోయిన్ ప్రాణాలు కోల్పోయింది.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. హాలీవుడ్ నటిగా వెనెస్సా మెర్క్యూజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఆమె కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతుంది.. ఇటీవల సర్జరీ జరిగినా ఆమె పరిస్థితి అంతగా బాగోలేదని తెలుస్తోంది.. కాగా ఆమె నివాసం ఉంటున్న ప్రాంతానికి పోలీసులు ఓ సామజిక కార్యక్రమం కోసం వెళ్లారు.. అక్కడికి మెర్క్యూజ్ కూడా వచ్చింది.. ఒక్కసారిగా ఆమె అధికారిపై తుపాకీ గురిపెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. దాదాపు గంటన్నరసేపు పోలీసులు,మానసిక వైద్యుడు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించారు.. వైద్యం అందిస్తామని చెప్పారు కానీ ఆమె ఆ మాటలు పట్టించుకోకుండా తుపాకీ గురిపెట్టింది.. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు ఆమెని కాల్చి చంపారు.. మెర్క్యూజ్ మరణించిన తరువాత ఆమెని పోలీసులు పరిశీలించగా ఆమె వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ లాంటిదని తేలింది.. శని నెత్తి మీద కూర్చుంటే మహాసముద్రాలు ఈదినోడు కూడా ఇంటిముందు మురికి కాలువలో పడి చనిపోయినట్టు.. హాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని, చివరికిలా ట్రాజెడీగా జీవితాన్ని ముగించింది.  

కర్ణాటక సీఎం.. ఆంధ్రా కోడలు

  కర్ణాటక సీఎం కుమారస్వామి విజయవాడ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ పర్యటనకు కారణం ఆయన కుమారుడు నిఖిల్ వివాహ విషయం అని తెలుస్తోంది.. కర్ణాటక సీఎం ఇంట్లో ఆంధ్రా అమ్మాయి కోడలిగా అడుగు పెట్టబోతుందట.. ప్రాఫిట్ షూ కంపెనీ చైర్మన్ కోటేశ్వరరావు కుమార్తె సహజతో, కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహం జరగనుంది.. కుమారుడి పెళ్లిచూపులు కోసమే కుమారస్వామి తన భార్య అనితతో కలిసి విజయవాడ వచ్చినట్టు సమాచారం.. నిఖిల్, సహజ మధ్య రెండేళ్లుగా పరిచయం ఉందని, బెంగళూరులో సహజ చదువుకుంటున్నప్పుడు వారి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని అంటున్నారు.. పిల్లల ప్రేమకు పెద్దల అంగీకారం లభించినట్టేనని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. మరోవైపు ఈ పెళ్ళికి పారిశ్రామికవేత్తలు రఘురామ కృష్ణంరాజు,లగడపాటి రాజగోపాల్ పెళ్లి పెద్దలుగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ముందస్తు రాదు.. రాకూడదు.!!

  తెలంగాణలో ముందస్తు గురించి చర్చ జోరుగా నడుస్తుంది.. అధికార పార్టీ తెరాస ముందస్తుకు తహతహలాడుతోంది.. ప్రగతి నివేదన సభ పేరుతో భారీ సభకు శ్రీకారం చుట్టి ఎన్నికల వేడిని మొదలు పెట్టింది.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తెరాస మీద విమర్శలు గుప్పిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ను కలిసి ముందస్తు ఎన్నికల పైనా, ప్రస్తుత పరిస్థితులపైనా చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ముందస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేయడం లేదని చెప్పారు.. నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోవన్నారు.. ఒకవేళ మొండిగా వ్యవహరించి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని అనుకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.. రాష్ట్రంలో ఇటీవల 20 లక్షల ఓట్ల తొలగింపులో మతలబు ఏమిటన్నారు.. ముందస్తు ఎన్నికల వెనక తెరాస కుట్ర దాగి ఉందని విమర్శించారు.. అదేవిధంగా మరో కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా తెరాసపై విమర్శలు గుప్పించారు.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచే సత్తా ఉంటే ప్రగతి నివేదన సభ ఎందుకని ప్రశ్నించారు.. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చడమే ప్రగతి అంటే ఎలా? అన్నారు.. ప్రగతి నివేదన సభతో స్పీడు పెంచడం కాదని, ఓటమిని అంగీకరించి ముందుస్తు ఎన్నికలంటూ సభ నిర్వహిస్తున్నారన్నారు.. ఎంతోమంది ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆత్మహత్యలు చేసుకున్నవారికి న్యాయం చేయని దుస్థితిలో తెరాస ఉందన్నారు.

ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ

రోజురోజుకి మానవత్వం తగ్గిపోతుంది అనటానికి ఇదే నిదర్శనం.. ఈమధ్య సెల్ఫీల పిచ్చి బాగా పెరిగి పోయింది.. కానీ కొందరి సెల్ఫీల పిచ్చి చూస్తే మాత్రం అసహ్యం వేస్తుంది.. ఎదుటి మనిషి చావుబతుకుల్లో ఉంటే సాయం చేయాల్సింది పోయి సెల్ఫీలు దిగటం, చనిపోయిన వారితో సెల్ఫీ దిగి పైత్యం చూపించటం.. ఈమధ్య ఇలాంటివి బాగానే చూస్తున్నాం.. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.     నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైతే, కామినేని హాస్పిటల్ కి తరలించటం అక్కడ ఆయన మృతి చెందటం తెలిసిందే.. ఓ వైపు ఆయన మృతితో కుటుంబసభ్యులు, అభిమానులు విషాదంలో ఉంటే.. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది చేసిన ఓ పనికి అందరికీ కోపం వస్తుంది.. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి సెల్ఫీ దిగారు.. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది చర్య పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై కామినేని ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది.. హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.

మళ్ళీ నోరుజారిన బికాంలో ఫిజిక్స్

  ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంటే ఎంతమంది గుర్తుపడతారో తెలీదు కానీ బికాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు.. ఆ ఒక్క మాటతో ఆయన మామూలు ఫేమస్ అయ్యారా మరి.. ఇప్పటికీ సోషల్ మీడియాలో బికాంలో ఫిజిక్స్ అనే మాట కనిపిస్తూనే ఉంటుంది.. కొన్ని తెలుగు పాటల్లో కూడా వినిపిస్తూనే ఉంది.. అయితే తాజాగా జలీల్ ఖాన్ మరొకసారి నోరుజారారు.. ఈ మాట మరీ బికాంలో ఫిజిక్స్ అంత ఫేమస్ కాదులే కానీ నవ్వు మాత్రం తెప్పిస్తుంది.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఇటీవల గుంటూరులో టీడీపీ నిర్వహించిన ‘నారా హమారా - టీడీపీ హమారా’ కార్యక్రమంలో పాల్గొన్న జలీల్ ఖాన్ ప్రసంగిస్తూ.. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదంటూ విమర్శిస్తున్న క్రమంలో.. రాజశేఖర్ రెడ్డి మరియు వాళ్ళ నాన్న జగన్ మోహన్ రెడ్డి'లు కూడా చేసిందేం లేదని విమర్శించారు.. జగన్ మరియు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి అనాల్సిన చోట, రాజశేఖర్ రెడ్డి మరియు వాళ్ళ నాన్న జగన్ అనడంతో దీనిపై జోకులు పేలుతున్నాయి.. ఇలా మాట్లాడటం బికాంలో ఫిజిక్స్ కే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

హరికృష్ణ కారు ప్రమాదం.. మరి మా పరిస్థితి ఏంటి కేసీఆర్

నందమూరి హరికృష్ణ నార్కట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.. ఆయన మరణంతో నందమూరి కుటుంబంలో, టీడీపీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.. అయితే ఈ ప్రమాదంలో వేరే కారులో ప్రయాణిస్తున్న యువకులు కూడా గాయపడ్డారు.. ఈ ఘటనలో గాయాలపాలైన వారిలో హైదరాబాద్ కు చెందిన ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్‌లు ఉన్నారు.. వీరికి సంబంధించిన కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రితోపాటు కారు కూడా ధ్వంసమైంది.     ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణతో పాటు వీరిని కూడా నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు.. అయితే హరికృష్ణ భౌతికకాయాన్ని తరలించిన తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తామంతా మధ్యతరగతి వాళ్లమని, అప్పులు చేసి మరీ కెమెరాలు కొన్నామని, అవి ఇప్పుడు పనిచేయకుండా పోయాయని తెలిపారు.. గాయాలపాలైన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.. హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నారు.. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

రూపాయి విలువ పాతాళానికి

  ఈ రోజుల్లో రూపాయికి ఏమొస్తుందో తెలీదు కానీ రోజురోజుకి రూపాయి విలువ పడిపోవటం చూస్తుంటే భారతీయుల గుండె కలుక్కుమంటుంది.. 'పతనమవుతున్న రూపాయి విలువ' అనే వార్త లేకుండా రోజు గడవట్లేదు.. నిన్నటి వరకు రూపాయి విలువ 70 దాటిందని బాధపడుతుంటే ఇప్పుడు ఏకంగా 71 ని తాకింది.. ఇలా చెప్పటం కంటే పాతాళానికి చేరిందని చెప్పటం కరెక్ట్ ఏమో.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది.. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది.. రూపాయి నిన్నటి సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసింది.. ఈరోజు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలో రూ.70.95 పైసల వద్ద ప్రారంభమైంది.. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 కి చేరింది.

గుండె పోటుతో మరణించిన దర్శకురాలు బి.జయ

తెలుగు ఇండ‌స్ట్రీలో లీడింగ్ పిఆర్ఓగా ఉన్న బిఎ రాజు భార్య మరియు "చంటిగాడు".. "గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు".. "ప్రేమికులు".. "ల‌వ్లీ" లాంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించిన బి జ‌య‌.కన్నుమూశారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో గుండెపోటుతో ఆమె కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ప్రస్తుత తరం మహిళా దర్శకుల్లో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా గొప్ప పేరును సంపాదించుకొన్నారు. పలు చిత్రాలకు ఉత్తమ దర్శకురాలిగా అవార్డులు, రివార్డులు అందుకొన్నారు. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత 2005లో ప్రేమికులు, 2007లో గుండమ్మ గారి మనవడు, 2008లో సవాల్, 2012లో లవ్లీ, 2017లో వైశాఖం చిత్రానికి దర్శకత్వం వహించారు.తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ డైరెక్ట‌ర్స్ లో జ‌య కూడా ఒక‌రు. అంతేకాదు.. తెలుగు ఇండస్ట్రీకి "ప్రేమికులు" సినిమాతో కామ్నా జఠ్మిలానీ.. "చంటిగాడు"తో సుహాసిని.. "లవ్లీ" సినిమాతో శాన్విని హీరోయిన్‌గా పరిచయం చేసింది జయే.ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

హరికృష్ణ పార్థివ దేహాన్ని ఎన్టీఆర్‌భవన్‌కి ఎందుకు తీసుకెళ్లలేదు?

  నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ఆయన నివాసం నుండి మహాప్రస్థానం వరకు సాగింది.. ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో ముగిసాయి.. అయితే తొలుత హరికృష్ణ పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి తరలించి, అభిమానులు సందర్శనార్థం అక్కడ కాసేపు ఉంచాలనుకున్నారు.. కానీ అది కుదరలేదు.. శ్మశాన వాటికకు వెళ్లేముందు పార్థివ దేహానికి స్నానం చేయించాల్సి వుంది.. ఇదంతా చేసి టీడీపీ ఆఫీసుకి తీసుకెళ్తే, మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది.. ఇదంతా ఇబ్బందితో కూడిన వ్యవహారమని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లలేదని సమాచారం.. అదీగాక సమయం మించిపోవడంతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో అభిమానుల తాకిడి ఎక్కువైతే కంట్రోల్ చేయటం కష్టమని కూడా భావించినట్టు తెలుస్తోంది.. దీంతో అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని హరికృష్ణ నివాసం వద్దనే వుంచారు.. మరోవైపు ఎన్టీఆర్ భవన్ కి తీసుకెళ్లడం కుదరకపోవడంతో హరికృష్ణ పార్థివదేహంపై చంద్రబాబు టీడీపీ జెండాను కప్పారు.

చనిపోయేముందు కూడా స్నేహితుడికి సాయం

రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ముగిసింది.. ఆయనకు సంతాపం తెలపటానికి వచ్చిన స్నేహితులు, సన్నిహితులు ఆయన మంచితనం గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు.. హరికృష్ణ మంచితనం, సాయం చేసే గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా హరికృష్ణ స్నేహితుడు ఒకరు ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు.     హరికృష్ణ హైదరాబాద్ అబిడ్స్‌లోని తన ఆహ్వానం హోటల్‌ను ఆర్థిక కష్టాల్లో ఉన్న తన స్నేహతుడికి రెండు నెలల క్రితం లీజుకు ఇచ్చారట.. స్నేహితుడు కృష్ణారావు వ్యాపారంలో నష్టపోయారు.. దీంతో ఆయనను పిలిచి హోటల్‌ను అద్దెకు ఇచ్చి, ఆర్థికంగా కుదురుకునేందుకు సహాయం చేసారని సమాచారం.. స్నేహితుడిని తన ఇంటికి పిలిపించుకొని ఇబ్బందుల్లో ఉన్నావని బాధపడవద్దు, తోచిన సహాయం చేస్తానని చెప్పి, లీజుకు ఇచ్చారని తెలుస్తోంది.. ఈ హోటల్ బాగా నడుస్తోందని, దీంతో నీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని సూచించారట.. ఈ విషయాన్ని కృష్ణారావు గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.

ఒకరిది నేను తీసుకోను.. కన్నీరు పెట్టుకున్న కృష్ణంరాజు

నందమూరి హరికృష్ణ మృతికి కుటుంబసభ్యులు, అభిమానులే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేసారు.. సీనియర్ హీరో కృష్ణంరాజు, హరికృష్ణతో సన్నిహితంగా ఉండేవారు.. హరికృష్ణ మరణ వార్త విని సంతాపం తెలపటానికి వచ్చిన కృష్ణం రాజు.. హరికృష్ణ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.     'హరికృష్ణ గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు.. నన్ను అన్నయ్యా అని ఆప్యాయంగా పిలిచేవాడు.. ఈ రోజు ఇలా జరగటం చెప్పలేనంత బాధగా ఉంది.. కొడుకు పోయినప్పుడు దేవుడు ఇంత అన్యాయం చేశాడు అన్నాడు.. ఇపుడు నీక్కూడా దేవుడు అన్యాయం చేశాడురా' అంటూ కృష్ణం రాజు కన్నీరు పెట్టుకున్నారు.. 'హరికృష్ణ నా సొంత తమ్ముడు లాంటోడు.. ఓ రోజు నా కార్లో టేప్ రికార్డర్ చూసి ఎంత బావుందో అన్నయ్యా అన్నాడు.. తీసుకోరా అని నేను అంటే, నేను సంపాదించిన తర్వాత కొనుక్కుంటాను అన్నయ్యా.. ఒకరిది నేను తీసుకోను అన్నాడు.. మీ నాన్నగారిది అయినా ఇలానే అంటావా అంటే, అంతే అన్నయ్య అన్నాడు.. నేను నా సొంతంగా సంపాదించాలి, సొంతంగా బ్రతకాలి అనే నిజాయితీ పరుడు.. ఎవరైనా సంతోషపడుతుంటే చూసి ఆనందపడేవాడు.. పది మందికి ఉపకారం చేయాలనుకునేవాడు' అని అన్నారు.

తండ్రి మరణం.. 250 ఎకరాలు అమ్మేసిన ఎన్టీఆర్.!!

నల్గొండ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే.. నాలుగేళ్ళ క్రితం హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో మరణించారు.. దీంతో నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఎందుకిలా వెంటాడుతున్నాయి అంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.     స్వర్గీయ ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ విషయాన్ని గతంలో హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.. ఆ ఇంటర్వ్యూలో సిటీలు నచ్చవని, తాత అంటే ఇష్టమని చెప్పారు.. 'నాన్న సినిమాలతో చెన్నై, హైదరాబాద్ తిరుగుతుండేవారు..నాబాల్యం మొత్తం నిమకూరులోనే గడిచింది.. చుట్టం చూపుగా మాత్రమే నాన్న వద్దకు చెన్నై, హైదరాబాద్ వెళ్ళేవాడిని.. నాకు సిటీలంటే చిరాకు.. అందుకే ఎప్పుడూ నిమ్మకూరులోనే ఉండేవాడిని.. నా ఇష్టాలకు అనుగుణంగానే తాతయ్య నన్ను నిమ్మకూరులోనే పెంచారు.. తల్లి తండ్రి నాకు అన్నీ తాతయ్యే.. నాన్న వద్దకు చెన్నై వెళ్లినా అక్కడ సిటీ వాతావరణం నాకు జైలుని తలపించేది.. ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు.. పల్లెటూరిలో పొలాలు, స్వచ్ఛమైన గాలి, నానమ్మ, తాతయ్య అనురాగం బాగా ఆస్వాదించేవాడిని.. 1976 లో నాన్నగారు హైదరాబాద్ లో రామకృష్ణ స్టూడియో కట్టడం ప్రారంభించారు.. అందువలన బలవంతంగా ఇక్కడకు రావలసి వచ్చింది.. మొదట రానని మొండికేశా.. నువ్వు ఇక్కడ అన్నీ చూసుకుంటావనే స్టూడియో కడుతున్నా.. నీకు తోడుగా తాతయ్య కూడా ఇక్కడికే వస్తారు అని నాన్నగారు చెప్పారు.. ఆ మాటతో అంగీకరించా.. తాతయ్య ఒకసారి శంషాబాద్ సమీపంలో ఉన్న మా పొలాలు చూసి వస్తున్నారు.. ఆ సమయంలో రాజేంద్ర నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతయ్య మరణించారు.. నా తండ్రి ప్రాణం తీసిన పొలం నాకు వద్దు అంటూ నాన్నగారు 250 ఎకరాలు ఉన్నపళంగా అమ్మేశారు' అని హరికృష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

నోట్ల రద్దు అట్టర్‌ ప్లాప్..!!

నోట్ల రద్దు ఈ మాటని భారతీయులు అంత ఈజీగా మర్చిపోరేమో.. నోట్ల రద్దుతో నల్లధనం లేకుండా పోతుంది అంటూ 2016 నవంబరు 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేస్తున్నాం అని మోదీ ప్రకటించారు.. ప్రజలు కూడా దేశానికి మంచి జరుగుతుందిగా అనుకున్నారు.. కానీ క్యూల్లో నిల్చొని కష్టాలు పడ్డారు.. ప్రతిపక్షాలు అయితే ఈ నోట్లరద్దు వల్ల ప్రజలు కష్టపడటం తప్ప పెద్ద ప్రయోజనం ఉండదని మొత్తుకున్నా ఆ మాటలు ఎవరూ పట్టించుకోలేదు.     మోదీనేమో ఈ 50 రోజులు కష్టపడండి.. దేశం బాగుపడుతుంది.. మంచి జరుగుతుంది.. నల్ల డబ్బు, నకిలీ నోట్లు, ఉగ్రవాదం అన్నీ కంట్రోల్ అవుతాయి అన్నారు.. ప్రజలు నమ్మారు కానీ మోదీ చెప్పినట్టు జరగలేదు.. ప్రతిపక్షాలు చెప్పిందే నిజమైంది.. నోట్ల రద్దు అట్టర్‌ ప్లాప్ గా మిగిలిపోయింది.. రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లలో 99.3 శాతం తిరిగి తెల్లధనమై బ్యాంకులకు చేరింది.. రద్దయిన మొత్తం రూ.15.41 లక్షల కోట్లలో కనీసం ఐదు లక్షల కోట్ల నల్లధనం తేలుతుందని మోదీ సర్కారు భావించగా, కేవలం రూ.10,727 కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరలేదని బుధవారం రిజర్వు బ్యాంకు ప్రకటించింది.. అంటే, కనీసం ఒక్క శాతం కూడా మిగల్లేదు.. కొత్త నోట్ల ముద్రణకు అయిన రూ.21 వేల కోట్ల ఖర్చులన్నా పెద్ద నోట్ల రద్దులో మిగల్లేదు.. ఇదికాక నోట్ల రద్దు తర్వాత ఏడాదిలో ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం రూ.2.25 లక్షల కోట్లని ఆర్థిక నిపుణులు తేల్చారు.. దీంతో ప్రజలు షాక్ అవుతున్నారు.. ప్రతిపక్షాలు మేం చెప్పినట్టే జరిగిందని మండిపడుతున్నాయి.. చూస్తుంటే నోట్ల రద్దు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుందని అనిపిస్తోంది.