తెరాసలో నిరసన సెగ.. బాల్క సుమన్‌ పై హత్యాయత్నం?

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో తెరాసకు నిరసన సెగ తగిలింది.. తెరాస ఇటీవల ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో, చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే దీన్ని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు.. తనకు చెన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఆయన స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.. దీంతో ఓదేలు వర్గం బాల్క సుమన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.     ఈ నేపథ్యంలో బుధవారం నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వచ్చిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు.. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా గాయాలపాలయ్యారు.. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు.. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారని సుమన్ ఆరోపించారు.. తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారనీ, అయితే గన్ మెన్లు, తన మద్దతుదారులు వారిని అడ్డుకుని తనకు రక్షణగా నిలిచారని అన్నారు.. ఓదేలు వర్గం ఎన్ని కుట్రలు చేసినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదన్నారు.. ఇది కేసీఆర్‌ నిర్ణయమని, ఆయన శిష్యుడిగా ఆ నిర్ణయాన్ని పాటించడమే తన విధి అని బాల్క సుమన్‌ తేల్చిచెప్పారు.

రేవంత్‌రెడ్డికి నోటీసులు.. అరెస్ట్ తప్పదా?

  తెలంగాణ కాంగ్రెస్ నేతలను కేసులు చుట్టుముడుతున్నాయి.. ఒక్కొక్కరిగా కేసుల వలలో చిక్కుకుంటున్నారు.. ఇప్పటికే జగ్గారెడ్డిని నకిలీ పాస్ పోర్ట్, అక్రమరవాణా కేసులపై అరెస్ట్ చేయగా.. మరో నేత గండ్ర రమణారెడ్డిపై ఆయుధాల చట్టం కేసు నమోదైంది.. తాజాగా రేవంత్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసారు.. హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి.. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇళ్ల స్థలాలు అమ్మారని రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.. హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డితో పాటు మరో 13 మందికి కూడా నోటీసులు పంపారు.. అయితే ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు.. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని, ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు.. దీంతో సమాధానం చెప్పేందుకు పోలీసులు, రేవంత్ కు 15 రోజులు సమయమిచ్చినట్టు తెలుస్తోంది.. మరోవైపు కొందరు రేవంత్ అరెస్ట్ తప్పదా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. అయితే ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

వైరల్.. జగన్ ని ఇరుకున పెడుతున్న ఫోటో.!!

  ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేయడం కామన్.. ఈ విషయంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ముందు వరుసలో ఉంటుంది.. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు అధికార పార్టీ టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటారు.. టీడీపీ ఏవైనా పథకాలు ప్రవేశ పెట్టినప్పుడు కూడా ఆ పథకాల్లో అవినీతి తప్ప, ప్రజలకు మేలు జరగదు అంటూ విమర్శిస్తూ ఉంటారు.. టీడీపీ ప్రభుత్వం ఆ మధ్య స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్ల విషయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేసారు.. అయితే ఇప్పుడు అదే అన్న క్యాంటీన్ లోని ఒక ఫోటో వైసీపీని ఇరుకున పెడుతోంది.. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖపట్టణంలో జరుగుతుండగా.. ఆ పాదయాత్రలో పాల్గొన్న పలువురు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మధ్యాహ్న వేళ భోజనానికి అన్న క్యాంటీన్లకు వెళ్లడం జరిగింది.. వైసీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 'అన్న క్యాంటీన్లను విమర్శించారు.. ఇప్పుడు అవే అన్న క్యాంటీన్లు అలసిపోయిన మీ కార్యకర్తల కడుపు నింపుతున్నాయి' అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.  

వైసీపీకి షాక్.. మరో కీలకనేత టీడీపీలోకి?

  గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన జగన్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం పొందాలని ఆశపడుతున్నారు.. అయితే జగన్ ఆశ ఆశగానే మిగిలిపోయేలాగా ఉంది.. గత ఎన్నికల తరువాత వైసీపీ నేతలు చాలామంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. దానికి తోడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరికొందరు నేతలు టీడీపీలో చేరుతూ వైసీపీకి షాక్ ఇస్తున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లో కాకినాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న చెలమలశెట్టి సునీల్ పేరు వినిపిస్తోంది.. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.. రీసెంట్ గా అమరావతిలో సీఎం చంద్రబాబును సునీల్ కలిశారని సమాచారం.. టీడీపీలో చేరిక అంశాన్ని బాబు వద్ద సునీల్‌ ప్రస్తావించారని, ఆ మేరకు అక్టోబరు 2న చంద్రబాబు సమక్షంలో అమరావతిలో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ కి స్థానికంగా మంచి పేరుంది.. ఒకవేళ ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరితే కాకినాడ వైసీపీకి గట్టి దెబ్బనే చెప్పాలి.

ఇదేం పని రాజయ్య?

  తెరాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి టి.రాజయ్యను వివాదాలు చుట్టుముడుతున్నాయి.. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య వివాదాలు, ఆరోపణల కారణంగా ఆ పదవికి దూరమయ్యారు.. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఓ మహిళతో ఫోన్ లో రాసలీలల గురించి మాట్లాడుతున్న రాజయ్య ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చింది.. ఆ టేప్ లో రాజయ్య మహిళను నాని అని పిలుస్తూ నువ్వు కొంటె పులివి, చిలిపి చేష్టలు, మీ ఆయన ఎవరో చెప్పు అని మాట్లాడినట్టు ఆడియో టేప్ లో ఉంది.. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇదేం పని రాజయ్య? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

డ్రైవర్ మాట వినుంటే 50 మంది బ్రతికేవారు

  జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 50 కి పైగా చేరింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్‌ కూడా మృతి చెందాడు.. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అయితే ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.. బస్సు ప్రమాదంపై డ్రైవర్ శ్రీనివాస్ బంధువులు స్పందించారు.. బస్సు ఫిట్‌నెస్ లేదని శ్రీనివాస్ ముందే చెప్పాడని అన్నారు.. డ్యూటీకి వెళ్లేది లేదని డ్రైవర్ శ్రీనివాస్ మారాం చేశారని ఆవేదనగా చెప్పారు.. అయినా విధులకు హాజరు కావాలని డిపో మేనేజర్ ఆదేశించారని మండిపడ్డారు.. బస్సు ఫిట్‌నెస్ లేదని డ్రైవర్ చెప్పిన మాటను డిపో మేనేజర్ వినుంటే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకునేవారు కాదుగా.. ఇదేనా ప్రజల ప్రాణానికి మీరిచ్చే విలువ అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్లైమాక్స్ కి చేరిన కాంగ్రెస్- టీడీపీ పొత్తు.. కీలక నేతల భేటీ

  హైదరాబాద్‌లోని‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితరులతో టీడీపీ తెలంగాణ రాష్ట్రఅధ్యక్షుడు రమణ తదితరులు సమావేశమయ్యారు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నట్టు సమాచారం.. ఈ భేటీతో పొత్తులపై ప్రాథమిక అవగాహనకు వచ్చే అవకాశముంది.. తెరాసను ఎలాగైనా ఓడించేందుకు మహాకూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు నిర్ణయించాయి.. దీనిలో భాగంగా ఇప్పటికే టీడీపీ.. సీపీఐ, టీజెఎస్ తో చర్చలు జరిపింది.. తాజాగా పార్క్‌ హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలతో టీడీపీ నేతలు భేటీ అయ్యారు.. ఈ కీలక భేటీలో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బలాబలాలు, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

మొన్న బెదిరింపులు.. ఇప్పుడు క్షమాపణలు

మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు.. గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి కాల్ చేసి బెదిరించిన ఆడియో టేప్ బయటికొచ్చిన విషయం తెలిసిందే.. ఆ ఆడియోలో వసంత నాగేశ్వరరావు 'ప్రభుత్వానికి తొంతుల్లా పనిచేస్తున్నారని.. దేవినేని ఉమని అసెంబ్లీలో చూడటం జగన్ కి కూడా ఇష్టంలేదు.. అవసరమైతే కడప నుంచి మనుషులని దింపుతాడు.. తన కుమారుడికి ఆవేశం ఎక్కువ జాగ్రత్త ఉండు' అని పంచాయతీ కార్యదర్శిని బెదిరించినట్టుగా ఆడియో టేప్ లో ఉంది.. దీంతో తీవ్ర దుమారం రేగింది.. దేవినేనిని చంపుతారా? అంటూ టీడీపీ నేతలు, వైసీపీ నేత తీరుపై మండిపడ్డారు.. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.. అయితే వసంత నాగేశ్వరరావు మాత్రం నేనేం తప్పు చేయలేదు, నాకు ఏ పాపం తెలీదు అంటున్నారు.     గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు.. గొడవలెందుకని మందలించానని, అంతేతప్ప బెదిరించానన్న వార్తల్లో నిజం లేదని అన్నారు.. మంత్రి దేవినేని ఉమ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు తనవాళ్లు చెప్పారని, దీంతో వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని మాత్రమే అడిగానని స్పష్టం చేశారు.. తన మాటలను కుట్రతో రికార్డు చేయించి, ఎడిట్ చేసి వదిలారని ఆరోపించారు.. తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని ఉద్యోగ సంఘాలను కోరారు.. తనపై కేసు పెట్టే పరిస్థితి రావడం సిగ్గుగా ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఏ అధికారినీ దూషించలేదని పేర్కొన్నారు.. తాను చంద్రబాబు, అయ్యన్నపాత్రుడితో కలిసి ఏడేళ్లు పనిచేశానని, తానెలాంటి వాడినో ఆ మాత్రం తెలియదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

టిక్కెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే.. కేసీఆర్ దే బాధ్యత.!!

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.. ఇటీవల తెరాస ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.. తన ఇంట్లోనే తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు.. తనకు టిక్కెట్‌ కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇస్తేనే గానీ తాను గృహ నిర్బంధం నుంచి బయటకు రానని ఆయన చెబుతున్నారు.     తాను 2009 నుంచి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఓదెలు పేర్కొన్నారు.. తాజా జాబితాలో సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇచ్చిన తనకు ఇవ్వకపోవడం చాలా బాధించిందన్నారు.. తనకు ఇప్పటికీ కేసీఆరే దేవుడని, ఎంపీ బాల్క సుమన్‌ వల్లే తనకు టిక్కెట్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంలో ఏదొకటి తేలేవరకు తాను గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.. మరోవైపు 24 గంటల్లో టిక్కెట్ పై హామీ రాకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని, తనకేదైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యతని ఓదెలు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయంపై తెరాస అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

పార్టీ మారనున్న అల్లు అర్జున్ మామ?

  అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది.. మరోవైపు టిక్కెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక పార్టీ నుండి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లో హీరో అల్లు అర్జున్ మామ శేఖ‌ర్‌రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. స్నేహారెడ్డి తండ్రి శేఖ‌ర్‌రెడ్డి గత ఎన్నికల్లో తెరాస పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఆయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు.. ఎన్నికల అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెరాసలో చేరారు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వడంతో అల్లు అర్జున్ మామ శేఖ‌ర్‌రెడ్డికి మొండిచెయ్యి చూపినట్టు అయ్యింది.. దీంతో అసంతృప్తిలో ఉన్న శేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.. మరి అల్లు అర్జున్ మామ నిజంగానే కారు దిగి కాంగ్రెస్ తో చేతులు కలుపుతారో లేదో చూడాలి.

కొండగట్టు వద్ద బస్సు బోల్తా.. 32 మంది మృతి

  జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ఘాట్‌రోడ్డులోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో 32 మంది మృతిచెందినట్లు సమాచారం.. మరికొందరు తీవ్రంగా గాయపడగా వారిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రమాద సమాచారం తెలియగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.. ఈ ప్రమాదంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. క్షతాగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యేగా పదేళ్లు.. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం.!!

  రాజకీయం సేవ చేయడానికి కాదు, సంపాదించుకోవడానికి అనుకునే అంతలా మారిపోయిన ఈ రోజుల్లో.. పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసి కూడా ఏసీ కార్లలో తిరగకుండా ఆర్టీసీ బస్సులో తిరిగే నాయకులు ఉంటారంటే నమ్ముతారా?.. అసాధ్యం అంటారా?.. ఉంటారు అలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు.. కానీ నూటికో కోటికో ఒకరుంటారు.. అలాంటి వారిలో ఒకరే డాక్టర్  వీరపనేని యల్లమందరావు.. గుంటూరు జిల్లాలో కీలక స్థానమైన వినుకొండ నుండి కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయన ఇప్పటికీ సాధారణ వ్యక్తిలా హంగు ఆర్భాటం లేకుండా ఏక్కడకి  వెళ్ళినా ఆర్టీసీ బస్ ప్రయణం చేయడం విశేషం.. ఎమ్మెల్యేగా పనీ చేసే రోజుల్లో కూడా శాసనసభ సమావేశాలకి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్రైను లో సామాన్యుడిలా ప్రయాణం చేసేవారు..  ప్రయాణంలోనే ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చేవారు.. నేటి రాజకీయనాయకులు ఇలాంటి వారిని చూసి చాలా నేర్చుకోవాలి.  

జగ్గారెడ్డి అరెస్ట్.. నకిలీ పాస్ పోర్ట్.. మానవ అక్రమ రవాణా?

  సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మాజీ విప్‌ తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.. మానవ అక్రమ రవాణా అభియోగాలపై ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.. పటాన్‌చెరులో ఆయన ఓ కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.. తాను, తన భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ 2004లో జగ్గారెడ్డి నలుగురికి పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారంటూ సోమవారం ఒక వ్యక్తి సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు జగ్గారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు తన భార్య, పిల్లలతో కాకుండా గుజరాత్‌కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అక్కడే వదిలేశారని గుర్తించారు.. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పాస్‌ పోర్టులు తీసుకోవడమే కాకుండా వాటితో జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారనే విషయంపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్..!!

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది.. ఇప్పటికే తెరాస 105 అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించింది.. మరోవైపు విపక్షాలు కూడా ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెరాసను ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని చూస్తోంది.. ఇప్పటికే కాంగ్రెస్- టీడీపీ పొత్తు గురించి వీపరితమైన చర్చలు జరుగుతున్నాయి.. త్వరలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ పొత్తులో భాగంగా టీడీపీ 15 నుంచి 20 స్థానాల మధ్యలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.     అయితే ఇప్పుడొక ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది.. అదే టీడీపీ తరుపున తెలంగాణలో ప్రచారం చేసే స్టార్ కాంపైనర్ ఎవరు?.. ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉందికానీ పూర్తి స్థాయి ప్రచార బాధ్యతలు చేపట్టే సమయం ఉండదు.. దీంతో తెలంగాణ ప్రచార బాధ్యతలు లోకేష్ కి అప్పగించాలని చూస్తున్నారట.. మరోవైపు కొందరు నేతలు ఎన్టీఆర్ పేరు కూడా తెరమీదకు తీసుకొస్తున్నారట.. గతంలో ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ చేత తెలంగాణలోని కొన్ని స్థానాల్లో ప్రచారం చేపిస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట.. అసలే తండ్రి మరణంతో బాధలో ఉన్న ఎన్టీఆర్ ని ప్రచారం చేయమని చంద్రబాబు అడుగుతారా?.. రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాల దృష్టి పెడుతున్న ఎన్టీఆర్ ఇలాంటి సమయంలో ప్రచారం చేయడానికి అంగీకరిస్తారా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

అసెంబ్లీ సాక్షిగా బీజేపీకి లోకేష్ పంచ్..!!

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. వైసీపీ సమావేశాలకు దూరంగా ఉండటంతో బీజేపీ ప్రతిపక్షం లా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీనిలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ముందుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ నిజాయితీగా పనిచేస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు.. ఎన్ఆర్ఈజీఏ గురించి మంత్రి నారా లోకేశ్ మాట్లాడుంటే బాగుండేదన్నారు.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోకల్లా అత్యధికంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.. కేంద్రంలోని రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్, ప్రధాని మోదీ నిష్పక్షపాతంగా రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేయచ్చో, అలా మేలు చేయడానికి ఎన్ఆర్ఈజీఏ ద్వారా పలు ప్రయత్నాలు చేస్తున్నారు.. లోకేష్ మంచి పనులు చేశారని తానెలాగైతే మెచ్చుకుని ధన్యవాదాలు చెప్పానో, అలాగే మంచి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబితే బాగుంటుందని లోకేష్ కు మాణిక్యాల రావు సూచించారు.. దీనిపై స్పందించిన లోకేష్.. బీజేపీకి చెందిన నేతలు అస్తమానం కేంద్రానికి లెటర్లు రాస్తున్నారు.. అవినీతి జరిగిపోతోంది, నీరు చెట్టుకు నిధులు డైవర్ట్ చేస్తున్నారని పదే పదే చెబుతున్నారు.. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడా అవినీతి జరగట్లేదు.. కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వమే మాకు క్లీన్ చిట్ ఇచ్చింది.. అకౌంటబిలీటి ట్రాన్‌స్పిరెన్సీలో గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు సార్లు ఏపీ మొదటి స్థానంలో ఉంది.. బీజేపీ వాళ్లే కాదు, వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేంద్రానికి లేఖలు రాశారు.. కేంద్రానికి పదేపదే ఇలా లేఖలు వస్తుండటంతో సందేహించి చాలా ఆడిట్ టీమ్‌లను పంపింది.. ఇప్పటికీ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నూటికి నూరుశాతం ఆడిట్ అయ్యాయి.. ఆ తర్వాత వచ్చిన ఆడిట్ టీమ్ కూడా ఏపీలో ఎలాంటి అవకతవకలు జరగట్లేదని అని తేల్చిచెప్పేసింది.. కేంద్ర మంత్రి తోమర్, యంగ్‌ మినిస్టర్‌గా మంచి పనులు చేస్తున్నావని నన్ను మెచ్చుకున్నారు.. అవసరమైతే ఇంకా ఎక్కువగా నిధులు ఇస్తానని కూడా ప్రోత్సహించారు.. ఇది ఆన్ రికార్డ్‌గా చెబుతున్నాను అని లోకేష్ వివరించారు.