తెలంగాణలో ముందస్తు రాదు.. రాకూడదు.!!
posted on Sep 1, 2018 @ 12:40PM
తెలంగాణలో ముందస్తు గురించి చర్చ జోరుగా నడుస్తుంది.. అధికార పార్టీ తెరాస ముందస్తుకు తహతహలాడుతోంది.. ప్రగతి నివేదన సభ పేరుతో భారీ సభకు శ్రీకారం చుట్టి ఎన్నికల వేడిని మొదలు పెట్టింది.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తెరాస మీద విమర్శలు గుప్పిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌ను కలిసి ముందస్తు ఎన్నికల పైనా, ప్రస్తుత పరిస్థితులపైనా చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ముందస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేయడం లేదని చెప్పారు.. నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోవన్నారు.. ఒకవేళ మొండిగా వ్యవహరించి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని అనుకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.. రాష్ట్రంలో ఇటీవల 20 లక్షల ఓట్ల తొలగింపులో మతలబు ఏమిటన్నారు.. ముందస్తు ఎన్నికల వెనక తెరాస కుట్ర దాగి ఉందని విమర్శించారు.. అదేవిధంగా మరో కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా తెరాసపై విమర్శలు గుప్పించారు.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచే సత్తా ఉంటే ప్రగతి నివేదన సభ ఎందుకని ప్రశ్నించారు.. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చడమే ప్రగతి అంటే ఎలా? అన్నారు.. ప్రగతి నివేదన సభతో స్పీడు పెంచడం కాదని, ఓటమిని అంగీకరించి ముందుస్తు ఎన్నికలంటూ సభ నిర్వహిస్తున్నారన్నారు.. ఎంతోమంది ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆత్మహత్యలు చేసుకున్నవారికి న్యాయం చేయని దుస్థితిలో తెరాస ఉందన్నారు.