కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ చివరి లేఖ
నందమూరి హరికృష్ణ హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా, నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు.. ఎన్టీఆర్ తనయుడిగా, సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా హరికృష్ణ అందరికీ సుపరిచితులు.. కాగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 2 న అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.. అయితే హరికృష్ణ మరణానికి ముందు, ఆయన పుట్టినరోజు వేడుకుల గురించి అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు.. 'సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను' అని హరికృష్ణ లేఖలో పేర్కొన్నారు.. హరికృష్ణ చివరిలేఖను చూసి అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.