ప్రేయసి అలక.. సిటీ అంతా సారీ హోర్డింగ్స్.. ట్విస్ట్ అదుర్స్

లవర్స్ మధ్య చిన్నచిన్న గొడవలు కామన్.. లవర్ అలిగితే కన్నా, బుజ్జి, బంగారం అంటూ బ్రతిమాలుకొని సారీ చెప్పి తిరిగి మాట్లాడేవాళ్ళని చూసి ఉంటారు.. మరి సినిమాల ప్రభావమో ఏంటో తెలీదు కానీ ఒకతను తన లవర్ అలిగితే చాలా వినూత్నంగా సారీ చెప్పాడు.     ఇంతకీ మేటర్ ఏంటంటే.. పుణెలోని పంప్రి చించ్వాడ్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నీలేశ్‌ ఖేడేకర్‌.. అతనికి లవర్ ఉంది.. మరి లవర్ ఉంటే గొడవలు ఉండటం కామనే కదా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.. ఇంకేముంది అతని లవర్ అలకబూనింది.. కన్నా, బుజ్జి అని ఏం బ్రతిమాలతాంలే అనుకున్నాడో? లేక వ్యాపారవేత్త కదా కొంచెం కొత్తగా ఆలోచించాలి అనుకున్నాడో తెలీదు కానీ మనోడికి ఓ ఐడియా వచ్చింది.. లవర్ వెళ్లే దారిలో 'ఐ యామ్‌ సారీ' అంటూ సుమారు 300 హోర్డింగ్స్ ఏర్పాటు చేసాడు.. ఆ అమ్మాయి అలకవీడి నీలేశ్‌ తో మాట్లాడటం ఏమో కానీ, అదిరిపోయే ట్విస్ట్ ఎదురైంది.. అనుమతి లేకుండా ఈ హోర్డింగులు పెట్టాడని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నీలేశ్‌ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.. మరోవైపు అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసారు.. పాపం మరి మనోడి హోర్డింగ్ ప్రేమకు ఆ అమ్మాయి మనస్సు కరిగిందో లేదో తెలీదు కానీ పోలీస్ కేసు మాత్రం నమోదైంది.  

చంద్రబాబు మరో పెళ్ళికి సిద్ధమయ్యారు - జగన్

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు కామన్.. వాటికీ ఎవరూ అతీతం కాదు.. కానీ వైసీపీ అధినేత జగన్ విమర్శలే కాస్త వింతగా ఉంటున్నాయి.. ఆయన విమర్శలు ఏంటో పెళ్లి చుట్టూ తిరుగుతున్నాయి.. మొన్నటికి మొన్న, పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడని పవన్ పెళ్లిళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్ అప్పుడు తీవ్ర విమర్శలు మూటకట్టుకున్నారు.. అయితే తాజాగా జగన్ అదే పెళ్లిళ్ల ప్రస్తావనతో ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసారు.     చంద్రబాబు ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకొని వదిలేసి, ఇప్పుడు ఆరో పెళ్లికి సిద్దమయ్యారట.. రామ రామ చంద్రబాబుకి అయింది ఒకే పెళ్లిగా అంటారా?.. పెళ్లి అంటే మీరు అనుకునే పెళ్లి కాదులేండి.. జగన్ దృష్టిలో పెళ్లి అంటే పార్టీతో పొత్తు.. బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, జనసేనలను పెళ్లి  చేసుకుని వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారంటూ జగన్ విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు, రాయబారిగా నారా బ్రాహ్మణిని రాహుల్ గాంధీ నిర్వహించిన భేటీకి పంపారని జగన్ ఆరోపించారు.. నిజానికి రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇండస్ట్రియలిస్ట్స్, బిజినెస్ పీపుల్ తో భేటీ నిర్వహించారు.. దానిలో భాగంగానే నారా బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ తరుపున భేటీకి వెళ్లారు.. కానీ జగన్ మాత్రం రాజకీయ రాయబారం కోసమే నారా బ్రాహ్మణిని భేటీకి పంపారంటూ ఆరోపిస్తున్నారు.. చూద్దాం మరి జగన్ చెప్పినట్టు చంద్రబాబు, కాంగ్రెస్ ని పెళ్లి చేసుకుంటారా?.. అదే అదే పొత్తు పెట్టుకుంటారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కేరళ వరదల్లో కూడా సెల్ఫీ పైత్యం

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. తింటున్నా సెల్ఫీ, ఏదైనా చూసినా సెల్ఫీ, నడుస్తున్నా సెల్ఫీ, ప్రమాదం జరిగినా సెల్ఫీ, ప్రమాదం జరగాలన్నా సెల్ఫీ .. అసలు ఈ సెల్ఫీ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.. అసలు ఈ సెల్ఫీ పైత్యం చూస్తుంటే కొన్నిసార్లు పిచ్చెక్కిపోతుంది.. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.     ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో కేరళ అల్లకల్లోలం అయిపోయింది.. కేరళ ప్రజలకు, సైనికులు విరామం లేకుండా సహాయం అందిస్తున్నారు.. దానిలో భాగంగానే కొందరు సైనికులు ఆర్మీ హెలికాఫ్టర్ లో వెళ్తుండగా.. ఒక యువకుడు రెడ్ క్లాత్ ఊపుతూ కనిపించాడు.. అయ్యో పాపం ప్రమాదంలో ఉన్నాడనుకుంటా అని అతికష్టం మీద హెలికాఫ్టర్ ని ల్యాండ్ చేసి, ఆ యువకుడి దగ్గరికి వెళ్లారు.. అప్పుడు ఆ యువకుడు ఏమన్నాడో తెలుసా?.. నేనే ప్రమాదంలో లేను, నాకు సహాయం అవసరం లేదు.. మీతో సెల్ఫీ దిగాలని పిలిచా అన్నాడట.. దీన్ని పిచ్చి అనాలో, ఇంకేమనాలో అర్ధంకావట్లేదు.. ఓ వైపు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తుంటే, వారికి సహాయం చేయాలని కష్టపడుతున్న ఆర్మీ వారిని ఇలా సెల్ఫీ పేరుతో పిలిచి వారి సమయం వృధా చేయటం ఎంత వరకు కరెక్ట్.. సెల్ఫీ దిగడంలో తప్పులేదు, కానీ దానికో సమయం సందర్భం ఉంటుందని తెలుసుకోపోవడం తప్పు.. ఎప్పుడు మారతారో ఏంటో ఇలాంటి జనాలు.

సీఎంకి ఎదురుదెబ్బ.. విచారణ తప్పేలా లేదు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2007 లో విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో యూపీ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సుప్రీమ్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.. ఈ కేసును ఎందుకు విచారణ చేపట్టకూడదో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.     జనవరి 2007లో మొహర్రం సందర్భంగా గోరఖ్ పూర్‌లో హిందువులు, ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణల్లో రాజ్ కుమార్ అగ్రహారి అనే హిందూ మతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు.. ఆనాడు ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని యోగీ ఆదిత్యనాథ్ సందర్శించకూడదని, దీనివల్ల హింస చెలరేగే అవకాశముందని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.. అయితే అహింసా పద్ధతిలోనే ఘటనాస్థలంలో యోగీ ఆదిత్యనాథ్ ధర్నా చేశారు.. ఈ సందర్భంగా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఆయన అనుచరులు కొన్ని ముస్లిం కట్టడాలకు నిప్పంటించారు.. ఆ సమయంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు.. ఆదిత్యనాథ్‌ను అరెస్ట్ చేసారు.. ఆయన అరెస్టుతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.. ముంబై నుంచి గోరఖ్ పూర్ వెళ్లే గోదాన్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూ యువవాహిని కార్యకర్తలు నిప్పంటించారు.. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.. నాటి అల్లర్లలో ఆందోళనకారులు మసీదులను, ఇళ్లను, బస్సులను, రైళ్లను తగులబెట్టారు. దీంతో గోరఖ్ పూర్‌ అల్లర్ల కేసుకు యోగీ ఆదిత్యనాథ్‌ ప్రసంగం కూడా కారణమని ఆరోపణలు వచ్చాయి.. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. యూపీ ప్రభుత్వం సీఎం ని విచారించేందుకు నిరాకరించింది.. అలాగే అలహాబాద్ హైకోర్టు కూడా ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.. ఈ కేసులో సీఎం ను విచారించేందుకు యూపీ ప్రభుత్వం నిరాకరించడాన్ని అలహాబాద్ కోర్ట్ సమర్ధించడంపై పలువురు తప్పుపట్టారు.. ఈ విషయంపై పర్వేజ్ అనే వ్యక్తి సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేయగా.. సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

నోటి దూల.. ఉద్యోగం పోయిందని విలవిల

భారీ వరదలతో కేరళ అల్లకల్లోలం అయిపోయింది.. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు కేరళను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.. కేరళను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని, కాపాడాలంటూ దేవుడిని వేడుకుంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు.. అయితే ఓ వ్యక్తి కేరళ వరదల గురించి వివాదాస్పద పోస్ట్ పెట్టి ఉద్యోగమే పోగొట్టుకున్నాడు.. కేరళకు చెందిన రాహుల్‌ చెరు పళయట్టు ఒమన్‌లోని లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.. తన నోటిదూలతో ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.     ఇంతకీ విషయం ఏంటంటే.. కేరళలో ‘శానిటరీ నాప్‌కీన్లు’ కూడా అందిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్‌ పోస్టు చేశారు.. ఈ పోస్టుకు స్పందించిన రాహుల్‌ ‘కండోమ్‌లు కూడా అవసరమే’ అంటూ అసభ్యంగా పోస్టు చేశాడు.. ఈ పోస్టుపై లులు గ్రూప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ‘రాహుల్‌ సోషల్‌మీడియాలో చేసిన అసభ్య కామెంట్ల నేపథ్యంలో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. దీంతో స్పందించిన రాహుల్‌, ఫేస్‌బుక్‌ ద్వారా క్షమాపణలు తెలిపాడు.. ‘ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నాను.. ఏం మాట్లాడుతున్నానో చూసుకోలేదు.. జరిగిందానికి నిజంగా క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని వీడియో ద్వారా తెలిపాడు.. అయితే రాహుల్‌ క్షమాపణలను కంపెనీ అంగీకరించలేదు.. ‘ఇలాంటి ఘటనలను మేం సమర్థించబోం.. మా సంస్థ మానవ సంబంధాలకు, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది.. రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ చీఫ్‌ కమ్యూనికేషన్ ఆఫీసర్ స్పష్టం చేశారు.. అందుకే అంటారు నోరు అదుపులో పెట్టుకోవాలని.. నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే ఇలాగే ఉంటుంది.

పవన్ ట్వీట్.. అమితాబ్ రీ ట్వీట్.!!

  లక్షల మంది సైనికులు దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా శత్రుదేశాల నుండి కాపాడుతున్నారు కాబట్టే కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు.. అందుకే అంటారు అన్నం పెట్టే రైతుకి, దేశ ప్రజల ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణం అడ్డుపెట్టే సైనికుడికి జీవితాంతం రుణపడి ఉండాలని.. గత కొన్ని రోజులుగా కేరళను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.. ఈ వరదలు కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలమంది నిరాశ్రయులయ్యారు.. కేరళకు అండగా నిలబడటానికి అనేక మంది ఆర్థికసాయం చేయటానికి ముందుకొచ్చారు.. మరి సైనికులు వారి పక్కనే ఉండి ధైర్యం చెప్తున్నారు.. విరామం లేకుండా సేవ చేస్తున్నారు.. వారి సేవే జనసేనాని పవన్ ట్వీట్ కి కారణమైంది.     మాతృభూమిని కాపాడుతున్న భారత సైనికులకు సలాం అంటూ ట్వీట్ చేసారు.. అంతేకాదు ఆ ట్వీట్ లో, గతంలో సైనిక ఉన్నతాధికారులు భరతమాత, భారత సైన్యం గురించి చేసిన వ్యాఖ్యలని జత చేసారు.. పవన్ చేసిన ఈ ట్వీట్ కు భారీ స్పందన వచ్చింది.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా పవన్ ట్వీట్ పై స్పందించారు.. 'జై హింద్, వి సెల్యూట్ ఔర్ భారత్' అంటూ రీట్వీట్ చేసారు.. దీనికి బదులుగా పవన్, అమితాబ్ కి కృతఙ్ఞతలు చెప్తూ మరో ట్వీట్ చేసారు.. కృతజ్ఞతలతో పాటు, భారత జవాన్ల ధైర్య సాహసాలపై ఎకె రామానుజన్ అనువాదం చేసిన ఓ పద్యాన్ని కూడా జత చేసారు.. మొత్తానికి జవాన్లకు సెల్యూట్ చేస్తూ జనసేనాని చేసిన ట్వీట్ కు భారీ స్పందన వస్తుంది.  

కేరళకు పేటీఎం అధినేత పదివేలు విరాళం.. ఎంత గొప్ప మనస్సో

భారీ వర్షాలు, వరదలు కారణంగా కేరళలో ప్రాణ నష్టంతో పాటు, భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది.. కేరళను ఆదుకునే అందుకు దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరూ ముందుకొస్తున్నారు.. సామాన్యులు ఇచ్చే వందల నుండి, సంపన్నులు ఇచ్చే లక్షలు, కోట్లు వరకు ప్రతి రూపాయి కేరళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది.. అందుకే సామాన్యులు తమకి తోచిన సాయం వందలు, వేలు చేస్తున్నారు.. కానీ ఓ సంపన్నుడు కూడా సంపదలో తాను సామాన్యుడిని అనుకున్నట్టున్నాడు.. వేలకోట్ల ఆస్తి ఉండి, వేలల్లో విరాళం ఇచ్చాడు.. ఆయన ఎవరో కాదు పేటీఎం అధినేత విజయ్ శేఖర శర్మ.     సుమారు 12 వేల కోట్లు ఆస్తి ఉన్న ఈయన, కేరళకు కేవలం పదివేల రూపాయిలు విరాళం అందించారు.. ఈ విరాళానికి సంబంధించిన రసీదును ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. అంతేకాదు విరాళాలను ఇచ్చేందుకు తమ పేటీఎంను వాడుకోవాలని పిలుపునిచ్చారు.. ఇంకేముంది నెటిజన్లకు ఆయన మీద కోపం కేరళ వరదల్లాగా కట్టలు తెంచుకుంది, ఆయన మీద విమర్శల వర్షం కురిపించారు.. సమాజంలో నీ స్థాయి ఏమిటి? నీవిచ్చే విరాళం ఏమిటి? అంటూ కొందరు.. జనాల సొమ్ముతో రూ.12 వేల కోట్లు సంపాదించి ఇప్పుడు అదే జనాలకు రూ.10 వేల ముష్టి వేస్తావా? అంటూ కొందరు మండిపడ్డారు.. అత్యంత ధనవంతుడైన విజయ్ శేఖర్ రూ.10వేల విరాళంగా ఇచ్చి, పేటీఎం ప్రచారం చేసుకుంటున్నారని మరి కొందరు విమర్శలు గుప్పించారు.. విమర్శకుల దెబ్బకు విజయ్ శేఖర్ శర్మ వెంటనే ట్విట్టర్ నుంచి ట్వీట్ ను తొలగించారు.. కానీ, అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజెన్లు దానిని వైరల్ చేశారు.. వేల కోట్లు ఆస్తి ఉండి వేలల్లో విరాళం ఇచ్చి.. పిసినారులందు పేటీఎం అధినేత వేరయ్యా అనిపించుకుంటున్నారుగా.

జగన్‌కు భారీగా డొనేషన్ ఇచ్చా.. ఎలా గెలవాలో నాకు తెలుసు.!!

  వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగా తాజాగా మునగపాకలోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో యలమంచిలి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.. అయితే ఈ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి.     మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సమన్వయకర్త కన్నబాబురాజు మధ్య మాటల యుద్ధం జరిగింది.. బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ 'తనపై నియోజకవర్గ సమన్వయకర్త కన్నబాబురాజు తప్పుడు ప్రచారాలు చేసి తనను అవమానపరుస్తున్నారని, కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మి తనను పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.. అనంతరం మాట్లాడిన కన్నబాబురాజు గత ఎన్నికల్లో జగన్‌కు ఎక్కువ డొనేషన్‌ ఇచ్చింది తానేనని, ఎవరి మాటా లెక్కచేయనని, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో తనకు బాగా తెలుసు అని అన్నారు.. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో విజయ్‌సాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. విభేదాలను మరిచి, ఐక్యంగా పని చేసినప్పుడే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయగలుగుతామని అన్నారు.

కాంగ్రెస్ కి పెద్ద షాక్.. జనసేనలోకి సీనియర్ నేత

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్.. సుమారు నాలుగేళ్ళ తరువాత ఏపీలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ కూడా అయింది.. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అనే మాటను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. ఓ వైపు ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కి ఊహించని షాక్ తగిలింది.. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ, కాంగ్రెస్ కి బై చెప్పి జనసేనకు జై కొట్టారు.     కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడుతూ.. గత 32 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో అనేక పదవులు చేపట్టానని, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీలోనే ఉంటూ సేవలందించానని తెలిపారు.. పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతూ వెనుకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.. కాంగ్రెస్‌తో తనకెటువంటి విబేధాలు లేవని... ఒక్క కార్యకర్తను కూడా వెంట తీసుకెళ్లడం లేదన్నారు.. జనసేన పార్టీలో టికెట్‌ ఆశించడం లేదని, కేవలం పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చినందువల్లే ఆయన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.. పవన్‌ జిల్లా పర్యటన సమయంలో అధికారికంగా చేరతానని చెప్పారు.

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

  కేరళలో వరదల పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ.. కేరళకు తక్షణ సాయం కింద 500కోట్లు రూపాయిలు ప్రకటించారు.. అదే విధంగా వరద బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించారు.. అయితే మోదీ, కేరళకు సాయం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.. 'డియర్‌ పీఎం.. కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి.. కేరళలో ప్రజల పరిస్థితి, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.. మరోవైపు కేరళ ప్రజలకు ఆర్థికసాయం అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకొచ్చింది.. ఈ విషయమై నేడు ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సమావేశమై విరాళాలపై నిర్ణయం తీసుకున్నారు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల నెల వేతనాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది.. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు.  

మోదీకి షాక్.. మన్మోహన్ హయాంలోనే అధిక వృద్ధి రేటు!!

  భారత ఆర్థిక వృద్ధి రేటు మోదీ హయాంలో అధికంగా ఉంటుందని భావించారు.. కానీ తాజా నివేదికల ప్రకారం మన్మోహన్ హయాంలోనే అధిక వృద్ధి రేటు నమోదయినట్టు తెలుస్తోంది.. 'స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ’ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం.. వృద్ధి రేటు మన్మోహన్ సింగ్ హయాంలో అధికంగా ఉందని తెలుస్తుంది.. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగింది.. 1991 ఆర్థిక సరళీకరణ తర్వాత నమోదైన వృద్ధి రేటులలో ఇదే ఎక్కువని నివేదిక పేర్కొంది.. ఈ నివేదిక మోదీ మరియు బీజేపీ శ్రేణులకు పెద్ద షాక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరోవైపు కాంగ్రెస్ 'మన్మోహన్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో సగటు వృద్ధి రేటు 8.1 శాతం కాగా, మోదీ ప్రభుత్వ వృద్ధి రేటు కేవలం 7.3 శాతమే’నని నివేదిక వెలువడిన అనంతరం ట్వీట్ చేసింది.  

కేసీఆర్, వాజ్ పేయి అంతిమ సంస్కారాలకు ఎందుకు వెళ్లలేదు?

  మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు విచారం వ్యక్తం చేసారు.. ఆయన మరణవార్త విని దేశం నలుమూలల నుండే కాదు, విదేశాల నుండి కూడా ప్రముఖులు ఢిల్లీ వచ్చి నివాళులు అర్పించారు.. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వాజ్ పేయి అంతిమ సంస్కారాలకు హాజరుకాలేదు.. వాజ్ పేయి మరణ వార్త అనంతరం.. శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.. వాజ్ పేయి మీద తనకున్న ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని సంతాప సందేశాల రూపంలో ప్రకటించారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ కేసీఆర్ అసలు ఢిల్లీకి వెళ్లి ఎందుకు నివాళులు అర్పించలేదంటూ చర్చలు మొదలయ్యాయి.. అయితే తెరాస శ్రేణులు మాత్రం.. కేసీఆర్ సోదరి దశదిన కర్మలు ఉండటంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లలేదని చెప్తున్నారు.. కానీ కొందరి అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది.. కేసీఆర్ సోదరి దశదిన కర్మ కార్యక్రమం అనంతరం సాయంకాలం అయినా ఢిల్లీకి వెళ్లి మహానేతకు నివాళులర్పిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేరళకు 500 కోట్లు సాయం ప్రకటించిన మోదీ

  కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది.. ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు.. ఇప్పటికే సినీపరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు పలువురు విరాళాలు అందించారు.. అలాగే తెలంగాణ ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి 25 కోట్ల సాయం ప్రకటించింది.. తాజాగా ప్రధాని మోదీ కేరళ వరద పరిస్థితిపై సమీక్షించి, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తో కొచ్చిలో సమావేశమయ్యారు.. కేరళకు తక్షణ సాయంగా 500 కోట్ల రూపాయిలను మోదీ ప్రకటించారు.. దీనిలో భాగంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయిలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయిలు చొప్పున పరిహారం అందిస్తామని మోదీ తెలిపారు.

వాజ్‌పేయికి మోదీ ఘన నివాళి

  మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి మొదలైంది.. అంతిమయాత్ర వాహనం వెనక లక్షలాదిమంది కదిలారు.. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి స్మృతి స్థల్‌ వరకూ సుమారు ఏడు కిలోమీటర్లు దూరం.. ఆ లక్షలాది మంది కళ్ళకి మహానేత దూరమయ్యారనే బాధ తప్ప, ఆ 7 కిలోమీటర్ల దూరం కనిపించలేదు.. ఆ లక్షలాదిమందిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి స్మృతి స్థల్‌ వరకూ నడిచి మోదీ, వాజ్‌పేయికి ఘన నివాళి అర్పించారు.. ఒక మాజీ ప్రధాని అంతిమ యాత్రలో ప్రధాని పాల్గొని, 7 కిలోమీటర్లు నడిచి ఘనంగా నివాళి అర్పించడం చరిత్రలో ఇదే తొలిసారి అని బీజేపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రధాని మోదీ మాత్రమే కాదు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రివర్గం, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా 7 కిలోమీటర్లు నడిచి మహానేతకు ఘన నివాళి అర్పించారు.

ముగిసిన వాజ్‌పేయి అంత్యక్రియలు

  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత, వాజ్‌పేయి చితికి నిప్పంటించారు.. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిగాయి.. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అడ్వాణీ సహా పలువురు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయికు నివాళులర్పించారు.  

నెహ్రూ, ఇందిరాగాంధీలతో వాజ్‌పేయి ఇలా ఉండేవారా..!!

  ఇప్పటి రాజకీయ నాయకులు చాలామంది ఒకరిమీద ఒకరు అర్ధంపర్థం లేని ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాల విలువ తగ్గిస్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు.. సిద్ధాంత పరంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసినా, వ్యక్తిగతంగా మాత్రం మంచిగా ఉంటూ విలువైన రాజకీయాలు నడిపేవారు.. అలాంటివారిలో ముందువరుసలో ఉంటారు వాజ్‌పేయి.. నెహ్రూ, ఇందిరాగాంధీలను సిద్ధాంతపరంగా వ్యతిరేకించినా.. వారు మంచి చేస్తే వాజ్‌పేయి ప్రశంసించేవారు.     నెహ్రూకి కూడా వాజ్‌పేయి అంటే అభిమానం ఉండేదట.. భారత పర్యటనకు వచ్చిన విదేశీ అతిథిలకు, ప్రధానమంత్రిలకు వాజ్‌పేయిని పరిచయం చేస్తూ.. 'ఈయన ఎదుగుతున్న విపక్ష నాయకుడు.. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటారు.. నా దృష్టిలో ఆయన మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు.. భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి' అని నెహ్రూ చెప్పిన సందర్భాలు ఉన్నాయట.. అలాగే వాజ్‌పేయి కూడా నెహ్రూను గౌరవించేవారు.. 1977లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టాక, సౌత్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వెళ్లగా అక్కడ గోడపై ఉండాల్సిన నెహ్రూ చిత్రపటం లేకపోవడాన్ని గమనించారు.. వెంటనే ఆయన నెహ్రూ చిత్రపటం ఎక్కడ ఉండేదో దానిని అక్కడే ఉంచాలని ఆదేశించారట.     అలానే ఓ సారి వాజ్‌పేయి ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది.. ఉత్తర భారతదేశంపై పాకిస్తాన్ తొలుత వైమానిక దాడులు చేయడంతో భారత్ యుద్ధ క్షేత్రంలోకి దిగింది..అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పలు దేశాల మద్దతు సంపాదించడంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయి వెనకడుగు వేసింది.. ఈ యుద్ధం దక్షిణాసియా రాజకీయ చిత్రంలో భారత్‌ను బలీయ శక్తిగా మార్చింది.. ఈ యుద్ధం తరువాత రాజ్యసభలో వాజ్‌పేయి మాట్లాడుతూ ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.. విపక్షంలో ఉన్నప్పటికీ ప్రధాని స్థానంలో ఉన్న ఇందిరాగాంధీ తెగువను ప్రశంసించడానికి ఏమాత్రం సందేహించని వాజ్‌పేయిని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి.

బీజేపీ పంజరాన్ని తయారు చేస్తుంది..!!

  రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ..  ప్రజల హక్కులను కాలరాస్తూ, దేశాన్ని పంజరంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మరియు అమిత్ షా మీద విమర్శలు చేసారు.. ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ప్రసంగంలో భారత్‌ను బంగారు పక్షి అంటూ చెబుతారు.. దేశం బంగారు పక్షి అయితే దాని కోసం ఓ పంజరాన్ని తయారు చేయాలి.. ఇవాళ వాళ్లు పంజరం తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాన్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.. భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయమనీ, దాన్నీ బీజేపీ పక్షిలా చూస్తుంటే తాము మాత్రం అందరినీ కలుపుకుని పోయే గంగానదిలా చూస్తున్నామన్నారు.. విమర్శలతో పాటు రాహుల్, అమిత్ షా మీద ఛలోక్తులు కూడా విసిరారు.. ప్రజల హక్కులను కాలరాస్తున్నారంటూ రాహుల్ బీజేపీ మీద విమర్శలు చేస్తుండగా, ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో మైక్ ఆగిపోయింది.. దీంతో తన మైకును అమిత్‌షా ఆపేసి ఉంటారని రాహుల్ సరదాగా పేర్కొనడంతో అక్కడున్నవారంతా నవ్వారు.