సిసిఎల్ 3 ఫైనల్లో తెలుగు వారియర్స్ పరాజయం

        సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 3 ఫైనల్లో టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ ఓటమి పాలైంది. తెలుగు వారియర్స్ పై కర్ణాటక బుల్‌డోజర్స్‌ జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగారు. సెమీస్‌లో రాణించిన ఓపెనర్లు ఆదిత్య, ప్రిన్స్ ఫైనల్లో చేతులెత్తేశారు. ఒత్తిడికి లోనైన తెలుగు బ్యాట్ మెన్స్ గిరి 16, తేజ 23 బంతుల్లో 31, ఆదర్శ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. నందకిశోర్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు 29 నాటౌట్ చివర్లో ధాటిగా ఆడినా విజయాన్ని అందించలేకపోయాడు.   అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బుల్‌డోజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేశారు. సొంతమైదానంలో చెలరేగిన ప్రదీప్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45, ధ్రువ్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 54 నాటౌట్ వారియర్స్ బౌలర్లను చిత్తుచేశారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ట్రోఫీలను బుల్‌డోజర్స్ ఆటగాడు ధ్రువ్ శర్మ దక్కించుకున్నాడు. సిరీస్ బెస్ట్ బౌలర్ ట్రోఫీని వారియర్స్ ఆటగాడు రఘు అందుకున్నాడు.    

సిసిఎల్ 3 ఫైనల్లో తెలుగు వారియర్స్

        సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 3లో టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో వీర్ మరాఠీ జట్టుపై 75 పరుగుల తో విజయం సాధించి బెంగళూరులో ఆదివారం జరిగే ఫైనల్లో కర్ణాటక బుల్‌డోజర్స్‌తో తలపడడానికి సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన మరాఠీ జట్టు పూర్తి ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంజ్రేకర్ 13, జాదవ్ 19 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. గిరి, ఆదర్శ్, తేజ తలా రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్.. ప్రిన్స్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఆదిత్య 52 బంతుల్లో 7 ఫోర్లతో 59 నాటౌట్ గా నిలవడంతో వారియర్స్ జట్టు 20 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి154 పరుగులు చేశారు. పవర్‌ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆదిత్య, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రిన్స్ నిలిచారు.

ఆస్ట్రేలియా తో టెస్ట్: సెహ్వాగ్ అవుట్, రహానే ఇన్

        ఆస్ట్రేలియా తో జరగనున్న మూడో,నాల్గో టెస్టు కు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అనుకున్నట్లు గానే సెలక్టర్లు సెహ్వాగ్ పై వేటు వేశారు. భారత జట్టులో సెహ్వాగ్ కు స్థానం దక్కలేదు. సెహ్వాగ్ స్థానం లో రహానే కు జట్టులో చోటు లభించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటికే ఇండియా రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను భారత్ వశం అవుతుంది. గత సంవత్సరం అహ్మదాబాదులో ఇంగ్లాండు పైన ఒక సెంచరీ మినహా బాగా ఆడలేదు. ఇప్పటికి సెహ్వాగ్ ఫాం చాలా గోరంగా ఉంది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటి వరకు సెహ్వాగ్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్సులలో అతని పరుగులు అంత తక్కువ ఉండటం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. భారత్ జట్టు : ఎమ్మెస్ ధోనీ(సారథి), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, సచిన్ టెండుల్కర్, రవీంద్ర జడెజా, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ప్రజ్ఞాన్ ఓఝా, అజింక్యా రహానే, హర్బజన్ సింగ్, ఆర్ అశ్విన్, అశోక్ దిండా  

ధోనీ రికార్డు

టీం ఇండియా కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీం ఇండియా 22 టేస్ట్ మ్యాచ్ లను గెలిచింది. ఆస్ట్రేలియాతో హైదరాబాద్ లో జరిగిన రెండవ టేస్ట్ మ్యాచ్ ను గెలిచి ఆ రికార్డును తిరగరాశాడు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఇదంతా గోరింటాను కొండంత చేయడమేనని, డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు సభ్యులు ఎవరూ ఎన్ని మ్యాచ్ లు గెలిచామని చర్చించమని, టేస్ట్ మ్యాచ్ లు గెలవడమే ముఖ్యమని తెలిపాడు. టీం ఇండియా జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సీరీస్ లో పరాజయాల పాలైన తరువాత ఆత్మవిమర్శ చేసుకున్నామని, తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. జట్టు సభ్యుల్లో పుజారా, మురళీ విజయ్ రెండవ టెస్టులో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఉప్పల్ టెస్ట్: ఇన్నింగ్స్‌ 135 రన్స్ తో భారత్ గెలుపు

        ఉప్పల్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆసిస్ బ్యాట్స్ మెన్‌లు పెవిలియన్ బాటపట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే ఆసిస్ కుప్పకూలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.   టీంఇండియా బౌలర్లు అశ్విన్‌కు ఐదు వికెట్లు, జడేజాకు మూడు వికెట్లు, ఇశాంత్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆసిస్‌పై భారత్‌కు ఇది రెండో విజయం. రెండో టెస్టులో ద్విశతకం చేసిన ఛటేశ్వర్‌పుజారాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ' దక్కింది. మరోవైపు కెప్టెన్‌గా టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించి ధోని రికార్డు సృష్టించాడు.  

ఉప్పల్ టెస్ట్: కష్టాల్లో ఆసీస్ 74/2

        ఉప్పల్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజూ ఇండియా 154.1 ఓవర్లలో 503 పరుగులు చేసి ఆలౌటైంది. ఛటేశ్వర్ పూజారా చెలరేగి 332 బంతుల్లో డబుల్ సెంచరీ 204 పరుగులు చేశాడు. కెరీర్‌లో పూజారాకు ఇది రెండో ద్విశతకం. డబుల్ సెంచరీతో పుజారా టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేశారు. ఆసీస్ పై భారత్ 266 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లు మాక్స్‌వెల్ 4, దోహార్తి-3, ప్యాటిన్సన్ 2, సిడిల్ ఒక వికెట్ తీసుకున్నారు.   అనంతరం బ్యాటింగుకు దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 74 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత్ 192 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇండియా స్కోర్ వివరాలు : విజయ్ : 167, సెహ్వాగ్ : 6, పుజారా : 204, సచిన్ : 7, కోహ్లీ : 34, ధోనీ ఐ 44, జడేజా : 10, అశ్విన్ 1, హర్భజన్ సింగ్ : 0, కుమార్ : 10, ఇషాంత్ శర్మ నాటౌట్ : 2, ఎక్స్‌ట్రా : 18.

ఉప్పల్ టెస్ట్: పూజారా డబుల్ సెంచరీ,అవుట్

          హైదరాబాద్ ఉప్పల్ లో ఆస్ట్రేలియా తో జరుగుతున రెండో టెస్టు మూడో రోజు పూజారా డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో పుజారా టెస్టుల్లో వెయ్యి పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇది టెస్టులో రెండో డబుల్ సెంచరీ. ఇంతకుముందు ఇంగ్లాండ్ పై ద్విశతకం చేశాడు. 311/1తో మూడో రోజు బరిలోకి దీగిన భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో వికెట్ కు 370 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పిన తరువాత మురళి విజయ్ 361 బంతుల్లో 161 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆతరువాత డబుల్ సెంచరీ చేసిన పూజారా కూడా మూడో వికెట్ గా వెనుదిరిగాడు. లంచ్ విరామానికి ఇండియా స్కోరు 400/3. సచిన్ మూడు పరుగులు, కోహ్లి నాలుగు పరుగులతో ఆడుతున్నారు.

ఉప్పల్ టెస్ట్: సెంచరీలు చేసిన విజయ్, పూజారా

        ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శతకాలు సాధించారు. చటేశ్వర్ పూజారా, భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీలు సాధించారు. టెస్టుల్లో పూజారాకు ఇది నాలుగో శతకం. 188 బంతుల్లో పూజారా సెంచరీని సాధించాడు. భారత ఓపెనర్ మురళీ విజయ్ 243 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. ఈ శతకంలో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు వున్నాయి. టెస్టుల్లో విజయ్‌కు ఇది రెండో శతకం. పుజారా, విజయ్‌లు చెలరేగి సెంచరీలు చేయడంతో భారత్ 311/1 పరుగులు చేసింది. సెహ్వాగ్ త్వరగా అవుటైనా విజయ్, పుజారాలు మైదానంలో సెంచరీల మోత మోగించారు. ఆసీస్ పైన రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 74 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఉప్పల్ టెస్ట్: ఆస్ట్రేలియా237/9, భారత్ 5/0

        హైదరాబాద్ ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 237 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మూడు ఓవర్ల ఆట మిగిలిన ఉన్న స్థితిలో ఇన్నింగ్సును డిక్లేర్ చేసి, భారత ఓపెనర్లపై ఒత్తిడి పెంచేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్రయత్నించాడు. అంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులతో, మురళీ విజయ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.   టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ను భునేశ్వర్ కుమార్ మూడు ప్రధాన వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ను కెప్టెన్క్ క్లార్క్‌, మాథ్యూ వాడే ఆదుకున్నారు. అర్థ సెంచరీ చేసిన తర్వాత వాడే 62 పరుగుల వద్ద హర్భజన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు చెయ్యలేకపోయారు. క్లార్క్ 91 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసుకోగా, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. డిక్లేర్ చేసే సమయానికి పాటిన్సన్ ఒక పరుగుతో, దోహర్తీ జీరో పరుగులతో క్రీజులో ఉన్నారు.  

హైదరాబాద్ టెస్ట్: ఆస్ట్రేలియా 19/2

        ఇండియా..ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో పేలుళ్లు జరిగిన నేపధ్యంలో ఈ మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. వార్నర్ 6 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతరువాత కోవాన్ కూడా నాలుగు పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి 19 పరుగులతో ఆడుతోంది.

చెన్నై టెస్ట్: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా

        చెన్నైలో ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జడేజా బౌలింగ్ లో చివరి వికెట్ కోల్పోయింది. ఇండియా కు పరుగుల 50 టార్గెట్ సేట్ చేసింది. 50 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ మురళి విజయ్ మళ్ళీ విఫలమయ్యాడు. 12 బంతుల్లో ఒక సిక్సర్ బాదేసి అవుటయ్యాడు. 19 పరుగులు చేసిన సెహ్వాగ్ లాయోన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన మాస్టర్ సచిన్ వరుస బంతుల్లో రెండు సిక్స్ లు బాది13 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఛతేశ్వర్ పుజారా 8 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. ఇండియా ఆస్ట్రేలియా పై 8 వికెట్ల తేడాతో విజయం సాదించింది. ఈ విజయంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది. ఈ ఒక్క విజయంతో ఇండియా సంబరపడిపోకుండా ఒక్కసారి ఇంగ్లాండ్ సిరీస్ ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంగ్లాండ్ తో కూడా మొదటి మ్యాచ్ గెలిచి మిగతా మ్యాచ్ లు వాళ్ళకి సమర్పించిన విషయం తెలిసిందే.       

చెన్నై టెస్ట్: ముగిసిన ధోని ధనాధన్ ఇన్నింగ్స్

        ఆస్ట్రేలియా పై ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా 572 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు 192 పరుగుల ఆధిక్యం దక్కింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఇన్నింగ్సు ఆడి సోమవారం ఉదయం అవుటయ్యాడు. అతను 224 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాటిన్సన్ బౌలింగులో అవుటయ్యాడు. ధోనీ తర్వాత భువనేశ్వర్ కుమార్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 572 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ బౌలర్లు పటిన్సన్ ఐదు వికెట్లు, లైయోన్ మూడు వికెట్లు, సిడిల్ ఒకటి, హెన్సిక్స్ ఒక వికెట్‌ను తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ 380 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

చెన్నై టెస్ట్ : ఆస్ట్రేలియా పై ధోని డబుల్ ధమాకా

        ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇండియా సెంచరీల మోత మోగించింది. మూడోరోజు సెంచరీ చేస్తాడనుకున్న మాస్టర్ సచిన్ అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ, ధోనిలు మాత్రం అదరగొట్టారు. సచిన్ టెండూల్కర్ 81 పరుగుల చేసి లియాన్ బౌలింగులో అవుటయ్యారు. ఆతరువాత క్రీజులో వచ్చిన ధోని తన ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. వరుసగా వికెట్లు పోతున్నా ధోనీ నిబ్బరంగా ఆడుతూ 200 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం స్కోరు 515 ఎనిమిది వికెట్లు కోల్పోయింది.  ఆసీస్ పై ఇండియా 135పరుగుల ఆధిక్యం సాధించింది. ధోనీ నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటడమే కాకుండా తొలిసారి డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో డబుల్ చేయడం ధోనీకి ఇదే తొలిసారి. 231 బంతుల్లో ద్విశతకం చేసిన ధోనీ 21 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ధోనీ ఇప్పటి వరకు 74 టెస్టుల్లో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలు చేశాడు. 2005 డిసెంబర్ 5న ధోనీ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. మళ్లీ అదేగట్టపై ధోనీ తొలి డబుల్ సెంచరీ చేశాడు.

అంబటి రాయుడు సూపర్ సెంచరీ

        రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ కప్‌ను 25వసారి అందుకునే దిశగా అడుగులేస్తోంది. అంబటి రాయుడు 217 బంతుల్లో 118పరుగుల అజేయ సెంచరీ చేశాడు. అర్ధ సెంచరీలను శతకాలుగా మార్చాల్సిన అవసరం ఉందని తెలుగు తేజం అంబటి రాయుడు అంటున్నాడు. టీమిండియా జట్టులో చోటుకోసం ఆలోచించడడం లేదన్న రాయుడు.. తన బ్యాటింగ్‌తో సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. '50 పరుగులు పైబడి చేసే ఇన్నింగ్స్‌ను శతకాలుగా మార్చాలి. ప్రస్తుతం 27 అర్ధ సెంచరీలు, 14 సెంచరీలు. భవిష్యత్తులో ఈ నిష్పత్తిని సమం చేస్తా' అని రాయుడు చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ మాత్రమే చేశానని, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌పైనే ధ్యాస నిలపాలి తప్ప పరుగులపై కాదనుకున్నానని తొలిసారి ఇరానీ కప్‌లో ఆడుతున్న రాయుడు అన్నాడు. ఈ సీజన్ తనకెంతో కలిసొచ్చిందంటున్న రాయుడు.. సెంచరీల సంఖ్యను పెంచుకోలేకపోవడం నిరాశ పర్చిందన్నాడు. తన బ్యాటింగ్ శైలిలో కొన్ని మార్పులు చేయడంతో ఇకపై భారీగా పరుగులు రాబట్టగలననే ఆశాభావం వ్యక్తం చేశాడు.  

చెలరేగిన సచిన్, రికార్డ్ బ్రేక్

        ముంబైలో జరుగుతున్న ఇరానీ కప్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. వాంఖేడే స్టేడియంలో ముంబై తరఫున ఆడుతున్న సచిన్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీ సాధించాడు. మాస్టర్ కి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది 81వ సెంచరీ. ఇరానీ కప్ లో రెండో సెంచరీ.1989లో ఇదే స్టేడియంలో ఢిల్లీ పైన 16 ఏళ్ల వయస్సులో ఇరానీ కప్‌లో సెంచరీ సాధించాడు. సచిన్ ఈ సెంచరీను మూడో రోజు చేశాడు. సునీల్ గవాస్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచులలో చేసిన 81 సెంచరీల రికార్డును సచిన్ సమం చేశాడు.రెస్ట్ ఆఫ్ ఇండియాపై ముంబై 409 పరుగులకి ఆలౌటైంది. సచిన్ 18 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 140 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు

స్టెయిన్ బౌలింగ్ అదుర్స్ : పాక్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం

        జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్టు లో సౌత్ఆఫ్రికా ఘనవిజయం సాదించింది. రెండో ఇన్ని౦గ్స్ లో పాకిస్తాన్ 268 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా మొదటి టెస్టులో 211 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.   మొదటి టెస్టులో డేల్ స్టెయిన్ బౌలింగ్ పాక్ ఎదురునిల్వలేకపోయింది. తొలి ఇన్ని౦గ్స్ లో 49 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్, రెండో ఇన్ని౦గ్స్ లో 268 పరుగులకే ఆలౌటైంది. డేల్ స్టెయిన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే ఐదు వికెట్లు సాధించాడు. వికెట్ కీపర్ డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో పాటు 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డును సమం చేశాడు.  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అద్భుత బౌలింగ్‌తో రాణించిన స్టెయిన్‌కే దక్కింది.

40వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై

        రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై ఘనవిజయం సాధించింది. సౌరాష్ట్ర పై 125పరుగులు ఇన్ని౦గ్స్ తేడాతో గెలిచి రికార్డ్ 40వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్ని౦గ్స్ లో ధవళ్ కులకర్ణి, అజిత్ అగరార్కర్ దెబ్బకు సౌరాష్ట్ర 82కే ఆలౌటైంది. అజిత్ అగరార్కర్ 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, కులకర్ణి 32 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మొదటి ఇన్ని౦గ్స్ లో  సౌరాష్ట్ర144 పరుగులు చేయగా, ముంబై 355 పరుగులు చేసింది. రెండో ఇన్ని౦గ్స్ లో కూడా సౌరాష్ట్ర బ్యాట్స్ మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. ఎస్‌హెచ్ కోటక్ (0), ఎస్‌డి జోగియానీ (0), ఆర్ఆర్ దావే (5), ఎవి వాసదేవ (0), జెఎన్ షా (6), ఎస్‌పి జాక్సన్ (9), కెఆర్ మక్వానా (7), ఎస్ సానాండ్యా (16) చెత్తగా అవుటయ్యారు. టీ విరామ సమయానికి సౌరాష్ట్ర 58 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. టీ విరామ సమయం తర్వాత ధర్మేంద్ర సిన్హ్ జడేజా (22), జైదేవ్ ఉనద్కత్ (9) త్వరగా అవుటయ్యారు. సౌరాష్ట్ర పై ముంబై 125పరుగులు ఇన్ని౦గ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. రంజీల్లో సెంచరీల రికార్డ్ బద్దలు కొట్టిన వసీం జాఫర్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.