పూజారా డబుల్ సెంచరి, ఇండియా 521/8 డిక్లేర్

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు లో ఇండియా తొలి ఇనింగ్స్ ను 8 వికెట్ల నష్టానికి 521 పరుగులకు డిక్లేర్ చేసింది. పుజారా 374 బంతుల్లో 21 ఫోర్లతో 206 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. యువరాజ్ సింగ్ 74 పరుగుల వద్ద, అశ్విన్ 23 పరుగుల వద్ద ధోనీ ఐదు పరుగుల వద్ద అవుట్ అయ్యారు.   323/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాను పూజారా భారీస్కోరు దిశగా నడిపించాడు. తొలి రోజు ఆటలో 98 పరుగులు సాధించిన పూజారా, రెండో రోజు తనదైన శైలిలో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా 374 బంతులాడిన పూజారా డబుల్ శతకాన్ని సాధించగలిగాడు. 160 ఓవర్లు ఆడిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 521 పరుగులకు డిక్లేర్ చేసింది.     

అదరగొట్టిన సెహ్వాగ్, పుజారా దూకుడు

  అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 323 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా, ఓపెనర్లు సెహ్వాగ్, గౌతంగంభీర్ శుభారంభం చేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గంభీర్ 45 పరుగులు సాధించగా, సెహ్వాగ్ దూకుడుగా ఆడి ఒక సిక్స్, 15 ఫోర్లతో 90 బంతుల్లో సెంచరీ చేశాడు. 117 పరుగుల వద్ద స్వాన్ బౌలింగ్ లో సెహ్వాగ్ అవుటైయ్యాడు.   రంజీ మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సచిన్ ఇంగ్లాండ్ పై నిరాశపరిచాడు. 18 బంతులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 13 పరుగులకే అవుటయ్యాడు. పూజారా మాత్రం తన సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 181 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ దిశగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం పూజారా (98) యువరాజ్ సింగ్ (24) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రేమ్ స్వాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

నిరాశపర్చిన సచిన్ టెండూల్కర్

  ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో సచిన్ భారత్ అభిమానులను నిరాశపర్చాడు. రంజీ మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సచిన్ ఇంగ్లాండ్ పై కూడా సెంచరీ చేస్తాడని అందరు భావించారు. 18 బంతులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 13 పరుగులకే అవుటయ్యాడు. సచిన్‌ది మూడో వికెట్. మొదటి వికెట్ గంభీర్ రూపంలో 134 పరుగుల వద్ద, రెండో వికెట్ సెహ్వాగ్ రూపంలో 224 పరుగుల వద్ద అవుట్ కాగా సచిన్ 250 పరుగుల వద్ద అవుటయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడి సెంచరీ చేశాడు. రెండేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. ఒక సిక్స్, 15 ఫోర్లతో 90 బంతుల్లో సెంచరీ చేశాడు.

దేశానికి ఒక జ్వాల లేదా ఒక సైనా ఉంటే చాలదు: గుత్తా

  షట్లర్ గుత్తా జ్వాల కోచ్‌ గోపీచంద్ పై ఘాటైన విమర్శలు చేసింది. జాతీయ కోచ్‌గా ఉన్న గోపీచంద్ సొంత ప్రైవేట్ అకాడమీని నిర్వహించడం సరికాదని జ్వాల తప్పుపట్టింది. సొంత ప్రైవేట్ అకాడమీని నిర్వహిస్తున్న వ్యక్తి జాతీయ కోచ్‌గా ఉండడం నైతికంగా సరికాదు. అతను సెలెక్షన్ ప్యానెల్‌లో ఉంటే క్రీడాకారులందరికీ న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించింది. ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పించాలి. దేశానికి ఒక జ్వాల లేదా సైనా ఉంటే చాలదు. ఎంతోమంది క్రీడాకారులు ఎదగాలి. నేను దూరమైతే అశ్విని, దిజుకు సరైన డబుల్స్ భాగస్వామి లేరు' అని జ్వాల చెప్పింది. బ్యాడ్మింటన్ ప్రస్తుతం ధనికుల క్రీడగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించింది. బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడింది. కోచింగ్ క్యాంప్‌నకు తనను అనుమతించకుండా కోచ్ గోపీ వేధిస్తున్నాడంటూ కోర్టును ఆశ్రయించిన మరో క్రీడాకారిణి ప్రజక్తా సావంత్‌కు జ్వాల మద్దతు తెలిపింది. ప్రజక్తాను క్యాంప్‌లో చేర్చుకోవాల్సిందిగా బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికా 255/2 : రాణించిన కల్లిస్, ఆమ్లా

  ఆస్ట్రేలియాతో తోలి టెస్ట్ ను దక్షిణాఫ్రికా ఘనంగా ప్రారంభించింది. ఆమ్లా 90 బ్యాటింగ్, కలిస్ 84 బ్యాటింగ్ తో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆమ్లా రెండు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. పచ్చిక వికెట్ మీద స్వింగ్, పేస్‌లతో చెలరేగుతారనుకున్న కంగారులు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రెండో వికెట్‌కు పీటర్సన్‌తో కలిసి 90, కలిస్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను అటు వికెట్ కీపర్, ఇటు ఫస్ట్ స్లిప్ లియోన్ అందుకోలేకపోయారు. కలిస్ కూడా 42 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిడిల్ వేసిన బంతి టీవీ రిప్లేలో నోబాల్‌గా తేలింది. ఆసీస్ బౌలర్లలో ప్యాటిన్సన్, లియోన్ చెరో వికెట్ తీశారు.  

అజహర్‌ పై జీవితకాలం వేటును రద్దు చేసిన హైకోర్టు

  మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు 12 ఏళ్ల తరువాత ఊరట లభించింది. ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజారుద్దీన్‌పై 2000లో బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్దీన్‌ సిటీ సివిల్‌ కోర్టులో నాడు పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ సిటీ సివిల్‌ కోర్టు నాడు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుధీర్ఘంగా హైకోర్టు విచారించింది. విచారణ అనంతరం అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రద్దు చేస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో అజారుద్దీన్‌ అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌కు ఊరట లభించడంతో ఆయన కుటుంబీకులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.

టెస్టుల్లో యువీ, రైనా అవుట్

    ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు సంచలనాలు ఏమి జరగలేదు. సందీప్ పాటిల్ సారథ్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ పాత సంప్రదాయాన్నే కొనసాగించింది. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాకు చోటు దక్కలేదు. సీనియర్లు, యువకులతో కూడిన జట్టులో మొత్తం ఏడుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్, ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఒక వికెట్ కీపర్ ఉన్నారు.  విజయ్, రహానెకు చోటు. ఫామ్‌లోలేని ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్, గంభీర్‌ను జట్టులో కొనసాగిస్తూనే రిజర్వ్ ఓపెనర్‌గా తమిళనాడు ఆటగాడు మురళీవిజయ్, ముంబయి బ్యాట్స్‌మన్ రహానెను తీసుకున్నారు. వీరి ఎంపిక ఢిల్లీ ఓపెనర్లకు ఓ రకంగా హెచ్చరికలాంటింది. బద్రీనాథ్ స్థానంలో విజయ్‌కు అవకాశమిచ్చారు. మిడిలార్డర్‌లో వెటరన్ సచిన్‌తో పాటు పుజార, కోహ్లీ, యువీపై బాధ్యతలు ఉంచారు. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 15న అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ ఆరంభంకానుంది.

ఇన్ఫోసిస్ కాస్ట్ కటింగ్

  ఇక్కడ ఉద్యోగాల్లేవ్..! సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీకూడా ఈ బోర్డ్ పెట్టేసింది. ఇండస్ట్రీకి మళ్లీ రిసెషన్ మొదలయ్యింది. భారీగా పెరుగుతున్న వ్యయం, విపరీతంగా తగ్గిపోతున్న వర్క్ కాంట్రాక్ట్ లు ఈ నిర్ణయానికి కారణం. కనీసం మూడు నెలలవరకూ క్యాంపస్ ఇంటర్యూవు చేయకూడదని ఇన్ఫోసిస్ యాజమాన్యం నిర్ణయించింది.   ఇప్పటిదాకా ఇంటర్వ్యూ దశలో ఉన్న 17 వేల ఉద్యోగాలకుకూడా ఈ నిర్ణయంతో బ్రేక్ పడింది. ఇంతకు ముందు ఎంపిక చేసిన అభ్యర్ధులకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చేవాళ్లు. ఇప్పుడా శిక్షణ కాలాన్ని రెండున్నర నెలలకు కుదించారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా పెద్ద కంపెనీలు కాస్ట్ కటింగ్ ప్రయత్నాల్లో మునిగితేలుతుంటే బోలెడన్ని చిన్నచిన్న కంపెనీలు తాళాలేసేసుకున్నాయ్. చాలాకంపెనీలు స్టాఫ్ ని తగ్గించుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నాయ్.

నేనే గనక హోం మంత్రినైతే : టిజి

  తాను గనక హోం మంత్రి పదవిలో ఉండి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్ని ఘనంగా జరిపించి ఉండేవాడినని మంత్రి టి.జి. వెంకటేష్ వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్ని వ్యతిరేకించేవాళ్లకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హతకూడా లేదని విమర్సించారు. అప్పట్లో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కి మార్చడంవల్లే ఇప్పుడిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కర్నూలు రాజధానిగా ఉండుంటే సీమాంధ్ర ప్రాంతం ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.   ఇంకా ఇలాంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని చాలా చాలా జరుపుకుని తీరతామన్న నమ్మకం తనకు బలంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. జాతీయ జెండాని ఆవిష్కరించి వేడుకల్నిప్రారంభించిన లగడపాటితోపాటు కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యమని ఆయన అన్నారు.

దేనికైనా రెడీ వివాదం..తెలంగాణ వాదుల మద్దతు

  దేనికైనా రెడీ సినిమా వివాదం తారా స్థాయికి చేరుతోంది. మోహన్ బాబు ఇంటిముందు ఆందోళన జరిపిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులపై దాడిచేయడంపై తెలంగాణ వాదులుకూడా మండిపడుతున్నారు. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని మోహన్ బాబుతోపాటు ఆయన అనుచరుల్నికూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల చందాలతో బతుకుతున్న మోహన్ బాబు తిరిగి జనంపై దాడిచేయడం అత్యంత హేయమైన విషయమంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.   సినిమాలమీద కలెక్షన్లు పోగేసుకుని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ పరిహసించే ప్రయత్నాల్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. బ్రాహ్మణులపట్ల మోహన్ బాబు కుటుంబ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరించారని తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఖండించారు. సినిమాలో సీన్లని వెంటనే తొలగించి, ఈ వివాదంపై వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని తెలంగాణ అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్.   మరోవైపు మంచు విష్ణువర్ధన్ బాబుకూడా అదే స్థాయిలో మండిపడుతున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చినవాళ్లు తమ ఇంటిపై దాడి చేయడమేంటంటూ వీరంగమేస్తున్నారు. తానింట్లో లేను కాబట్టి సరిపోయిందని, లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. ఇంకోసారి ఇలాంటి పని చేయాలనుకున్నవాళ్లు సిటీలో తిరగడానిక్కూడా భయపడాల్సొస్తుందని విష్ణువర్థన్ బాబు హెచ్చరించాడు.ఇరువర్గాలూ రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదుకూడా చేశాయి.

రీతీ స్పోర్ట్స్‌తో సైనా నెహ్వాల్‌ 40 కోట్ల డీల్

సైనా నెహ్వాల్‌ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని టైటిల్స్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. దక్కన్ క్రానికల్‌తో తమ ఒప్పందం జూలై 31ముగియటంతో సైనా రీతీ స్పోర్ట్స్‌తో డీల్‌ను కుదుర్చుకుంది. భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూసుకోవడానికి యాడ్ షూట్స్ అన్నీ హైదరాబాదులోనే జరగాలని సైనా టీమ్ ఒప్పందంలో రాసుకుంది.