తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్!

తిరుమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభమైది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు సీఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ను పరిశీలించారు. రిక్లైమ్ ఏస్ యంత్రం పనితీరును పరిశీలించారు. ఈ యూనిట్ ప్రారంభంతో ఇకపై కొండ మీద ట్రెట్రా ప్యాక్స్, స్నాక్ ప్యాకెట్ల వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదని అంటున్నారు. ప్లాస్టిక్ కంటెంట్ ను భక్తులు ఈ యూనిట్ లో వేసేయవచ్చు. ఇందు కోసం యూపీఐ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయల్సి ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ వేసిన వారికి ఐదు రూపాయలు ఇస్తారు.  

చినుకు పడితే.. విశ్వనగరం విశ్వనరకం

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి విశ్వనగరం చిగురుటాకులా వణికింది.  నగరం మొత్తం అతలాకుతలం అయ్యింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో తండ్రీ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.  పోలీసుల ప్రాధమిక దర్యాప్తు లో మృతులను బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన అశోక్ (50)  అతని కుమార్తె దివ్య (5) గా గుర్తించారు.  భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా   హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మశాన వాటిక గోడ కూలిపోయి మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.  ఇక వర్షం పడితే డేంజర్ జోన్ గా మారిపోయే  అసిఫ్ నగర్ లో పెద్ద ఎత్తున వరద నీరు పొంగిపొర్లతో పరిస ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి చేరుకున్నాయి.  గత రెండు రోజులుగా దోమల్ గూడ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయి ఉంది.  ఏవీ కాలేజ్ ,గగన్ మహల్  ఎగువ ప్రాంతం నుండి దిగువన ఉన్న దోమల గూడ, సూరజ్ నగర్ కాలనీ, రాజ్ మహల్ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ ద్వారా స్టాగింగ్ అయిన  వరద నీరు  పంపించేటట్లు చూస్తామని అధికారులు చెబుతున్నారు.   ఇక భారీ వర్షానికి రెండు రోజులుగా హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇది విశ్వనగరం కాదు విశ్వ నరకం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చినుకు పడితే హైదరాబాద్ వాసులకు యమయాతన తప్పడం లేదని అంటున్నారు. వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఇక నగరంలో ఎక్కడ చూసినా గంటలతరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం మామూలైపోయిందని అంటున్నారు. 

అమెరికాలో పోలీసు కాల్పులు.. పాలమూరు యువకుడి మృతి

అమెరికాలో మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు పోలీసు కాల్పులలో మరణించాడు. మహబూబ్ నగర్  రామయ్యబౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ తొమ్మిదేళ్ల కిందట అంటే 2016లో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాంటాకార్లలో ఉంటున్నాడు.   ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, నిజాముద్దీన్  ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత, పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ ఈ నెల 3వ తేదీన తన రూమ్ మేట్ తో గొడవపడిన నిజాముద్దీన్ ను అదే రోజు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అక్కడి పోలీసుల కథనం ప్రకారం సెప్టెంబర్ 3 తెల్లవారుజామున ఇరుగుపోరుగు వారి నుంచి ఫోన్ లో అందిన ఫిర్యాదు మేరకు శాంతాక్లారా పోలీసులు నిజాముద్దీన్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంట్లో గొడవపడుతున్న శబ్దాలు వినిపించడంతో పోలీసులు లోనికి వెళ్లారు. అక్కడ నిజాముద్దీన్ అతడి రూమ్మేట్ పై కత్తితో దాడి చేస్తుండటం గమనించిన పోలీసులు వారించారు. అయినా వినకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ మరణించాడు.   ఇక నిజాముద్దీన్ తల్లిదండ్రులైతే  తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ ను  పోలీసులు కాల్చి చంపారని, ఆ విషయం నిజాముద్దీన్ రూమ్మేట్ ద్వారా తమకు తెలిసిందని అంటున్నారు.  ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా తమ కొడుకు మృతదే హాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరిం చాలని కోరారు. 

కాటేసిన పామును కొరికి చంపేశాడు!

ఎవరైనా పాము కాటేస్తే.. ప్రాణభయంతో వణికి పోతారు. వెంటనే వైద్య సాయం కోసం పరుగులు తీస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం నన్నే కరుస్తావా అంటూ పాముపై పగబట్టి దానినే కొరికి చంపేశారు. ఆ తరువాత విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయమేంటంటే.. తొట్టంబేడు మండలం చియ్యవరంకు చెందిన వెంకటేష్ బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వెడుతుండగా అతడిని ఓ  తాచుపాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ కు తనను కాటేసిన పాముపై పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ పామును పట్టుకుని దాని తల కొరికి చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆ చచ్చిన పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పక్కన పెట్టుకుని పడుకున్నాడు. గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం ఇంట్లో వారు గమనించారు. విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకటేష్ ను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారు అతడిని తిరుపతి రుయాఆస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు అతడిని రుయాకు తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు.  

16 నెలల చిన్నారికి టెలీ సర్జరీ

భారత వైద్య చరిత్రలోనే ప్రప్రథమంగా ఓ 16 నెలల చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన వైద్యడు హైదరాబాద్ వాసి కావడం మనకందరికీ గర్వకారణం.  హైదరాబాద్ నుంచి డాక్టర్ వి. చంద్రమోహన్ గుర్గావ్ లోని చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. పుట్టుకతోనే మూత్రనాళంలో సమస్య ఉన్నగుర్గావ్ కు చెందిన బాలికకు డాక్టర్ చంద్రమోహన్ హైదరాబాద్ లోనే ఉండి ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబో సిస్టమ్ సహాయంతో దాదాపు గంట పాటు శస్త్రచికిత్స చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతమైంది. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజునే ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యింది. అంతే కాదు అతి చిన్న వయస్సులోనే టెలీ సర్జరీ చేయించుకున్న బాలికగా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.  కాగా ఈ టెలీ సర్జరీ భారత్ లో వైద్య సేవల విస్తరణకు, అందరికీ అత్యధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని అంటున్నారు.    మారుమూల ప్రాంతాలకు కూడా కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదనడానికి ఈ టెలీ సర్జరీని ఉదాహరణగా చూపుతున్నారు వైద్య నిపుణులు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ శిలా తోరణం వరకూ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  20 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం(సెప్టెంబర్ 18) శ్రీవారిని మొత్తం 68 వేల 95మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 032 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70 లక్షల  రూపాయలు వచ్చింది.

జ్యుస్ తాగుతుండగా హార్ట్ ఎటాక్‌తో యువకుడి మృతి

  కరోనా అనంతరం చాలామంది యువ కులు ఉన్నట్లుండి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ కు గురవు తున్నారు. గతంలో ఓ యువకుడు జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ.... మరొకరు కాలేజీలో... ఇంకొకరు బస్ స్టాప్ లో ఇలా పలువురు  యువకులు మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరొకటి చోటు చేసుకుంది. జ్యుస్ తాగుతూ హార్ట్ ఏటాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా లోని పల్లి పాడు గ్రామానికి చెందిన మేడ ఏకలవ్య(30) అనే యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాదు నగరానికి వచ్చి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఒక రూమ్ లో ఉంటూ ... ఉద్యోగం కోసం వేట కొనసాగించాడు. అయితే ఏకలవ్య బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ ముందు జ్యుస్ పాయింట్ వద్ద జ్యుస్ త్రాగుతూ.. అకస్మాత్తుగా కిందపడిపోయాడు.  అది గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి అతనికి  సిపిఆర్ చేశారు... కానీ అప్పటికే అతను మృతి చెందాడు.  దింతో  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని  మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంప ట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు  

అదానీకి సెబీ క్లీన్‌చిట్

  సెబీ తాజాగా గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2023లో వచ్చిన హిండెన్‌బర్గ్‌ నివేదికలో స్టాక్‌ అవకతవకలు, నిధుల మళ్లింపులు, అకౌంటింగ్‌ మోసాలు జరిగాయంటూ ఆరోపించినా, విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ కూడా ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నిర్ణయంతో అదానీ షేర్లకు ఊరట లభించింది. హిండెన్‌బర్గ్‌ తప్పుదోవ పట్టించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని గౌతమ్‌ అదానీ డిమాండ్‌ చేశారు. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెలువడిన తర్వాత అదానీ షేర్లు క్షీణించి, 150 బిలియన్‌ డాలర్ల విలువ చెరిపేశాయి. తరువాత సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పుడు సెబీ క్లీన్‌చిట్‌తో గ్రూప్‌ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ పరిణామంపై గౌతమ్‌ అదానీ స్పందిస్తూ, తమపై వేసిన తప్పుడు ఆరోపణలు పెట్టుబడిదారులను నష్టపరిచాయని, దేశానికి క్షమాపణ చెప్పాలని హిండెన్‌బర్గ్‌ను డిమాండ్‌ చేశారు. “సత్యమేవ జయతే… జైహింద్!” అంటూ ఆయన పోస్ట్‌ ముగించారు.  

హైదరాబాద్‌లో భారీ వర్షానికి కూలిన గోడ... కార్ల ధ్వంసం

  హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లుతుండగా, లోతట్టు కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి.   * మైసమ్మగూడ చెరువులో దుర్ఘటన ఈ ఉదయం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు తేలియాడుతున్నాయని స్థానికులు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. ప్రాధమిక దర్యాప్తులో అవి బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన అశోక్‌ (50), అతని కుమార్తె దివ్య (5)గా గుర్తించారు. ఈ ఘటనపై అశోక్ భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   * హబీబ్‌నగర్‌లో గోడ కూలి కార్లు ధ్వంసం మరోవైపు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడకు ఆనుకొని పార్క్ చేసిన మూడు కార్లపై అది పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కూలిన గోడను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. * అసిఫ్‌నగర్ – తల్లగడ్డ ప్రాంతాల్లో వరద ఉధృతి అసిఫ్‌నగర్, తల్లగడ్డ ప్రాంతాల్లో వరదనీరు రోడ్లమీద పొంగిపొర్లుతోంది. లోతట్టు ఇళ్లలోకి కూడా నీరు చొచ్చుకెళ్తోంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించకుండా వరద మధ్యలో ప్రయాణించడంతో వాహనాలు నీటిలో ఇరుక్కుంటున్నాయి. ఒక బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వరద గల్లీలో చిక్కుకుపోగా, గోడపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. హైడ్రా, ఫైర్ శాఖ సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.   * దోమలగూడలో నీటిముగ్గు నిన్నటి నుండి దోమలగూడ స్ట్రీట్ నంబర్ 7 ప్రాంతంలో వరద నీరు అలాగే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా & హైదరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి నారాయణ అక్కడికి చేరుకొని పరిసరాలను పర్యవేక్షించారు. ఏవీ కాలేజ్, గగన్‌మహల్ ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వర్షపు నీరు దోమలగూడ, సూరజ్‌నగర్ కాలనీ, రాజ్‌మహల్ ప్రాంతాల్లో చేరి నిల్వ అయింది. మోటార్ పంపుల సహాయంతో నీటిని తరలించేందుకు టీములు రంగంలోకి దిగాయి. వాటర్ లాగింగ్ తొలగించే వరకు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.   * అధికారులు జాగ్రత్త సూచనలు హైడ్రా, ఫైర్ శాఖ, మున్సిపల్ అధికారుల బృందాలు నగరంలోని కీలక ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ప్రజలు వరద ప్రాంతాల్లోకి వెళ్లరాదని, అవసరమైతే సహాయక బృందాలను సంప్రదించాలని సూచించారు.

ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం

  ఏపీలో  నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నడిచే వివిధ నగరాల్లోని స్థానిక సలహా కమిటీలకు లోకల్ అడ్వైజరీ కమిటీ కూడా కొత్త అధ్యక్షులను నియమించింది. శ్రీశైలం మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రమేష్‌ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఛైర్మన్‌గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్‌, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా రాధాకృష్ణ నియమితులయ్యారు.   టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షులు 1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి 2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్ 3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు 4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఏడుగుండ్ల సుమంత్ రెడ్డి 5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింఘానియా 6. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే  

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్

  ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమానికి ఆలస్యంగా హాజరై, ముఖ్య అతిథి విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకలేదని ఆరోపణలు వచ్చాయి.  దీనిపై సీఎంవోకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇక, మిడ్ మానేరు నిర్వాసితుడికి పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చూపినందుకు తెలంగాణ హైకోర్టు కూడా కలెక్టర్‌పై వారెంట్ జారీ చేసింది. నోటీసులు, వారెంట్‌లు వరుసగా రావడంతో ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా తీరు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బ్రిటన్ హైకమిషనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్‌షిప్స్ను రాష్ట్ర ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  కో-ఫండింగ్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్స్ అందించేందుకు హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. సమావేశంలో నూతన విద్యా విధానం, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ రంగాలపై చర్చించారు. రేవంత్ ప్రతిపాదనలపై లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించగా, ఈ చర్చలు తెలంగాణ–బ్రిటన్ సంబంధాలకు కొత్త ఊపు ఇస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మూసీ నది అభివృద్ధి, ఇతర రంగాల్లో పెట్టుబడుల కోసం బ్రిటిష్ కంపెనీలను భాగస్వాములుగా చేయాలని సీఎం కోరారు. విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు సహకారం మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు.   

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, బోరబండ, చార్మినార్‌, కుషాయిగూడ, సైనిక్‌పురి వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. వర్షంతో రహదారులు జలమయమై, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.  

శశికళ సంస్థల్లో ఈడీ సోదాలు

  తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్త్నె, హైదరాబాద్‌లోని 10 చోట్ల తనిఖీలు నిర్వహించింది. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. జీఆర్‌కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులను రూ.200 కోట్లకు మోసం చేశారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. కనీసం పది స్థలాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్‌ఎ నిబంధనల కింద దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ దర్యాప్తు రూ.200 కోట్ల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించినదని, దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు కీలక నగరాల్లో ఈడీ చేసిన సోదాలపై మాత్రం అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ కేసు ఆధారంగా, నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో శశికళతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఏపీలో ప్లాస్టిక్ నిషేధం.. ఎప్పట్నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ నిషేధం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని నగరం అమరావతిలోని సెక్రటేరియెట్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం.. ఇప్పడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలలో వచ్చే నెల 2 నుంచి అంటే గాంధీ జయంతి రోజు నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలులోనికి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక ఆ తరువాత డిసెంబర్ 31 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నట్లు ఆయన తెలిపారు.  విజయవాడలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం (సెప్టెంబర్  18)న జరిగిన స్వచ్ఛతా హి సేవ అవగాహన కార్యక్రమంలో మంత్రి నారాయణ ప్రసంగించారు. ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు.  

ఆర్జీవీపై రాయదుర్గం పీఎస్ లో కేసు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది.  వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వివాదాలలో ఉండే రామ్ గెపాల్ వర్మపై మాజీ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.  మావోయస్టులపై గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన దహనంవెబ్ సీరిస్ కు సంబంధించి అంజనా సిన్హా ఫిర్యాదు చేశారు. ఆ వెబ్ సిరీస్ లో  అంజనా సిన్హా పేరును  ప్రస్తావిస్తూ.. అంజనాసిన్హా చెప్పిన విధంగానే ఆ వెబ్ సిరీస్ లో కొన్ని సీన్లు తీశామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   రామ్ గోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్లో తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరు వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బెంగళూరు కంపెనీకి లోకేష్ ఆహ్వానం

మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.  తాజా ఇంగ్లాండ్  పర్యటనలో ఉన్న లోకేష్ బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ కంపెనీని విశాఖకు ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది.  బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు..  రహదారుల అధ్వాన పరిస్థితి కూడా  జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. అలాగే అక్కడి సంస్థలు బెంగళూరులో కొనసాగడంపై పునరాలోచనలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే  బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ వేగంగా స్పందించారు.  విషయమేంటంటే.. దేశంలో అతి పెద్ద డిజిటల్ ట్రక్కింగ్ ఫ్లాట్‌ఫాంగా ఉన్న బ్లాక్‌బక్ అరే సంస్థను 2015లో నెలకొల్పారు. గతంలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని, ఆఫీసుకు రావాలంటే తమ ఉద్యోగులకు గంటన్నర సమయం పడుతోందని బ్లాక్‌బక్ సీఈఓ రాజేష్ యాబాజి  సోషల్ మీడియాలో ఓ   పోస్టు పెట్టారు. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని, గత అయిదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదని, దీంతో తాము తమ సంస్థను ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించుకున్నామనీ ఆ పోస్టులో పేర్కొన్నారు.  ఆ పోస్టుపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్..  ‘హాయ్ రాజేష్, మీ కంపెనీని విశాఖకు ఆహ్వానిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చారు.   భారత్‌లోని అత్యుత్తమ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ మౌలిక సుదుపాయాలను మెరుగుపరుస్తున్నారం. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మీ సంస్థను విశాఖకు తరలించే విషయంపై మీ అభిప్రాయాన్ని నాకు నేరుగా సందేశం పంపండి అంటూ లోకేష్ పేర్కొన్నారు.  లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన విషయంలో చూపుతున్న ఆసక్తి, శ్రద్ధలకు ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసుల మృతి

అమెరికాలో గన్ కల్చర్ కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన పెన్సిల్వే నియాలో జరిగింది. గృహహింస కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు వెళ్లిన వారిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో విధి నిర్వహణ లో ఉన్న ముగ్గురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు పోలీసుల తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులకు తెగబడిన దుండగుడు కూడా హతమయ్యాడు.    పెన్సిల్వేనియాలోని కొడొరస్ టౌన్‌షిప్‌లో బుధవారం సెప్టెంబర్ 17) మధ్యాహ్నం  గృహహింస కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు.   ఈ సందర్భంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.  ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందని ప్రకటించిన అధికారులు వివరాలను మాత్రం వెల్లడించలేదు.