16 నెలల చిన్నారికి టెలీ సర్జరీ

భారత వైద్య చరిత్రలోనే ప్రప్రథమంగా ఓ 16 నెలల చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన వైద్యడు హైదరాబాద్ వాసి కావడం మనకందరికీ గర్వకారణం.  హైదరాబాద్ నుంచి డాక్టర్ వి. చంద్రమోహన్ గుర్గావ్ లోని చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. పుట్టుకతోనే మూత్రనాళంలో సమస్య ఉన్నగుర్గావ్ కు చెందిన బాలికకు డాక్టర్ చంద్రమోహన్ హైదరాబాద్ లోనే ఉండి ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబో సిస్టమ్ సహాయంతో దాదాపు గంట పాటు శస్త్రచికిత్స చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతమైంది.

ఆపరేషన్ జరిగిన మరుసటి రోజునే ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యింది. అంతే కాదు అతి చిన్న వయస్సులోనే టెలీ సర్జరీ చేయించుకున్న బాలికగా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.  కాగా ఈ టెలీ సర్జరీ భారత్ లో వైద్య సేవల విస్తరణకు, అందరికీ అత్యధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని అంటున్నారు.    మారుమూల ప్రాంతాలకు కూడా కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదనడానికి ఈ టెలీ సర్జరీని ఉదాహరణగా చూపుతున్నారు వైద్య నిపుణులు.  

బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా జిల్లా ఎస్పీ పేరుతోనే మోసాలు

ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్ లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది. ఫర్నిచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని  పలువురికి  జిల్లా ఎస్పీ పేరుతో గురువారం జనవరి 8) మెస్సేజ్ లు అందాయి. ఈ విషయం  పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే అప్రమత్తమై ఆ ఫేక్ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేశారు. సైబర్ మోసాలు వివిధ రూపాల్లో  పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంద ర్భంగా  ఎస్పీ సంకీర్త్ ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.  

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ.కోటి.. కుమారుడికి ప్రమోషన్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అత్యంత అమానవీయంగా వేధింపులకు గురై  ఆ మానసిక క్షోభతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.   ప్రభుత్వ డాక్టర్ అయిన  సుధాకర్ కు జగన్ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే డాక్టర్ సుధాకర్ కుమారుడిని పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.   జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది.  ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా..  విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తన విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనపై  పిచ్చివాడు అన్న ముద్రవేసి,  ఆసుపత్రికి పంపడం వంటి  అత్యంత అమానవీయ చర్యలకు అప్పటి జగన్ ప్రభుత్వం పాల్పడింది. ఆ  మానసిక వేదన, ఆ అవమానంతోనే  ఆయన కన్నుమూశారు.   నాడు డాక్టర్ సుధాకర్ అనుభవించిన నరకయాతనను విపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రభుత్వ పరంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సహకారం అందించాలని నిర్ణయించారు.   ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు విద్యార్హతలను బట్టి నేరుగా పదోన్నతి కల్పించాలని  గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు.  అలాగే ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.   

పశ్చిమ బెంగాల్ లో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు.. బయటపడ్డ వైసీపీ ఆర్థిక లోసుగులు

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక నేరం జరిగినా దానితో వైసీపీకి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఐ ప్యాక్ సంస్థ ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ తో తృణమూల్ అనుబంధం 2021 ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. అలాగే ఇదే ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  రెడ్డికి కూడా 2024 ఎన్నికలలో  ఇటువంటి సహకారమే అందించింది. అది పక్కన పెడితే  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో..  గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్ కతా ఈడీ సోదాల్లో..  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్‌ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఈడీకి లభించినట్టు తెలుస్తోంది. ఈ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలలో లభ్యం కావడంతో, ఈడీ రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తునకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

సంక్రాంతికి నో టోల్ ఫ్రీ

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి నగరాలు, పట్టణాలలో ఉండే ప్రజలు స్వంత ఊళ్లకు వెళ్లడం ఆనవాయితీ. ఇలా  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లే ప్రజలకు టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ను ఇబ్బందులకు గురి చేస్తుండటం, గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుని అగచాట్లు పడటం సాధారణంగా మారిపోయింది. ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకూ టోల్ ఫ్రీకా ప్రకటించాలని తెలంగాణ పర్యాటక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే తెలంగాణ విజ్ణప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ తిరస్కరించారు. జాతీయ రహదారులపై ఉచిత టోల్ కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు.  ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.  

టూరిజం డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని క్రియోటివ్ అకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు.   విజయవాడ పున్నమీ ఘాట్ లో   అవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన  ఆయన తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఈ   కార్యక్రమానికి హాజరైన  యూరోపియన్ యూనియన్ రాయబారి (ఈయూ) రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి  ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు.  తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ ప్రతిరూపమన్న చంద్రబాబు ఆవకాయ్ అనగానే ప్రపంచంలో ఎవరికైనా సరే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం  సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు.  ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు. ఇక ఈ ఆవకాయ ఫెస్టివల్ ను తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా నిర్వహించుకుంటున్నామన్న చంద్రబాబు తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు.  కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి.  మైసూర్, కలకత్తాలకు దీటుగా  విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా ఆ ఉత్సవాలను జరుపుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.  

పదేళ్లలో పర్యాటకంలో ఏపీ నంబర్ వన్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి పరుగులు పెడుతోంది.  రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే  విజయవాడలో మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్  ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. గురువారం (జనవరి 9)న ప్రారంభమైన అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ లో  సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయన్నారు.   పర్యాటక రంగాన్ని  ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో  పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.   సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ,  పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఇక అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని గుర్తు చేశారు.  రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందనీ, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నచంద్రబాబు, దేశానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో పాతిక శాతం ఆంధ్రప్రదేశ్ కే దక్కాయనీ, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తేటతెల్లం చేసిందని అన్నారు.   పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయన్న ఆయన. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందడంలో భద్రత, శుభ్రత కీలకపాత్ర వహిస్తాయన్నారు.  ఇక రాష్ట్ర పర్యాటకంలో తెలుగు సినీమా కూడా ప్రధాన పాత్ర పోషించాలన్నారు.  క్రియేటివిటీకి తెలుగు సినిమా చిరునామా అన్న విషయాన్ని   భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే  నిదర్శమన్నారు.   ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు.    గత ప్రభుత్వం సాంస్కృతిక ,  వినోద కార్యకలాపాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేయడానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.    విజయవాడ ఉత్సవ్ మరియు కనక దుర్గ ఉత్సవ్‌లను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు.     అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూరోపియన్ యూనియన్  రాయబారి హెర్వే డెల్ఫీ సాంకేతికంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్  వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్స్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. త్వరలో ఏపీలో  ఈయూ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తానూ చూశానని, 'నాటు నాటు' పాట తనను ఎంతో ఆకర్షించిందని డెల్ఫీ పేర్కొన్నారు. సంప్రదాయం, సంస్కృతిని మేళవిస్తూ   నిర్వహిస్తున్న ఆవకాయ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో, నైపుణ్యంలో, ఆర్ధిక వృద్దిలో పెట్టుబడులతో ఏపీని లీడింగ్ స్టేట్ గా అభివర్ణించిన ఆయన, ఈ డైనమిజమే యూరోపియన్ యూనియన్ ను విశేషంగా ఆకట్టుకుంటోందని అన్నారు.  

కోడి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం.. తిరుపతిలో ఇద్దరు అరెస్టు

తిరుపతిలో  ఇద్దరు వైసీపీ కార్యకర్తలనుపోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధినేత జన్మదినం సందర్భంగా వారు చేసిన చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకీ వారేం చేశారంటే.. మాజీ  సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం చేసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  తిరుపతి కట్టకిందపల్లెకు చెందిన నల్లందుల బాలసుబ్రహ్మణ్యం, ప్రైవేట్ ఉద్యోగి భువనకుమార్ రెడ్డి  గత డిసెంబర్ 21న కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ   దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత ఈ విషయంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో  పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గురువారం (జనవరి 8) వారిరువురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.   నిందితుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమీప బంధువు.  నిందితులు కోర్టుకు వచ్చిన సమయంలో వారిని పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కోర్టుకు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. కాగా కోర్టు వారిరువురికీ బెయిలు మంజూరు చేసింది.

షూటింగ్ జాతీయ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు.. సస్పెన్షన్ వేటు

  కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్ లోని ఓ హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ స్థాయి షూటర్‌ అయిన 17 ఏళ్ల బాలిక ఆరోపించడంతో ఆయనపై ఈ వేటు పడింది. ఈ నేపథ్యంలో అంకుశ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. హోటల్ గదిలో జరిగిన సంఘటనల గురించి సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ఆటతీరు సమీక్షించాలనే సాకుతో ఫరీదాబాద్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని కోచ్ బెదిరించాడని తెలిపింది. హోటల్ నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయస్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా షూటర్‌పై ఈ లైంగిక దాడి జరిగింది. అంకుశ్‌ భరద్వాజ్‌పై పోక్సోసహా పలు సెక్షన్ల కింద ఫరీదాబాద్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలను ధృవీకరించడానికి సంఘటన జరిగిన రోజు హోటల్‌లోని అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను వెంటనే భద్రపరిచి తమకు అందజేయాలని నిర్వాహకులను కోరామని పోలీసులు తెలిపారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించిన 13మంది జాతీయ షూటింగ్ కోచ్‌ల్లో అంకుశ్‌ ఒకరు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో విచారణ ముగిసేవరకూ అంకుశ్ భరద్వాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు.     

ప్రపంచ కుబేరుడు థాయ్‌లాండ్ రాజు... రూ.4.5 లక్ష కోట్ల ఆస్తులు

  ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ.. ఏ వ్యాపార సామ్రాజ్యంతో సంబంధం లేకుండా.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తులు, వాటిని తెలివిగా పెట్టుబడులు పెట్టి ఒక రాజు ఏకంగా రూ. 4.5 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆయనే థాయ్‌లాండ్ రాజు మహా వజ్రాలాంగ్‌కోర్న్ ( కింగ్ రామ 10). ఆయన తన తండ్రి కింగ్ భూమిబోల్ అదుల్యాడేజ్ (కింగ్ రామ 11) మరణం తరువాత 2016లో సింహాసనాన్ని అధిష్టించారు. 2019లో అధికారికంగా పట్టాభిషేకం జరిగింది.  ఆయనకు ఉన్న ఇళ్లల్లో రోజుకో ఇంటికి వెళ్లి బస చేసినా.. తిరిగి మొదటి ఇంటికి చేరుకునేందుకు 47 ఏళ్లు పడుతుందట.  థాయ్‌లాండ్ రాజు సంపద అక్షరాలా 50 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఆయన విలాసవంతమైన లైఫ్‌స్టైల్ చూస్తే ప్రపంచంలో ఉన్న కుబేరులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు పేరు మీద థాయ్‌లాండ్‌లో వేల సంఖ్యలో భవనాలు, రాజప్రాసాదాలు ఉన్నాయి.   ఇక థాయ్‌లాండ్ రాజు వద్ద 38 ప్రైవేట్ జెట్‌లు, విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 300కు పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అయిన రోల్స్ రాయిస్, బెంట్లీ వంటివి ఉన్నాయి. ఆయన వద్ద పడవలు కూడా ఉన్నాయి. మొత్తం 52 బంగారు పూత పూసిన పడవలు ఉన్నాయంటే ఆయన సంపద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రం అయిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వద్దే ఉండటం విశేషం. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు ఆదాయానికి ప్రధాన వనరు థాయ్‌లాండ్ దేశంలోని భూములేనని సంబంధిత వర్గాలు చెబుతాయి.  థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఆయన ఆధీనంలో సుమారు 16 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క బ్యాంకాక్‌ నగరంలోనే 17 వేలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ఏటా వేల కోట్ల రూపాయలు ఆయన సంపదలోకి వచ్చి చేరతాయి. కార్పొరేట్ పెట్టుబడుల ద్వారా కూడా థాయిలాండ్ రాజు ఆస్తులు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని అతిపెద్ద బ్యాంక్ అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వాటాలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ సియామ్ సిమెంట్‌లో కూడా 33 శాతం వాటాలు ఈయనకే ఉన్నాయి.     

టీ20 వరల్డ్ ముందు భారత్‌కు షాక్...కీలక ప్లేయర్ దూరం

  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  జట్టులో మంచి ఫాంలో ఉన్న యువ బ్యాట్స్‌మన్ తిలక్‌వర్మకు పొట్ట కింద భాగంలో గాయమవ్వడంతో అతనికి ఆపరేషన్ చేశారు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని వైద్యులు వెల్లడించారు.   ఆ క్రమంలో ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ 20 సిరీస్‌‌కు ఆ హైదరాబాదీ క్రికెటర్ దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్  హజారే ట్రోఫీలో హైదరాబాద్ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా ఇటీవల అతనికి పొట్ట కింద భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే స్కానింగ్ చేయించారు. డాక్టర్ల సూచన మేరకు తిలక్‌కు తక్షణం సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే 3, 4 వారాలు ఆటకు దూరమవ్వనున్నాడు. ఫలితంగా కివీస్‌తో సిరీస్‌కు ఆ యువ బ్యాట్స్‌మాన్ అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో ఇప్పటివరకు మరొకరికి జట్టులోకి తీసుకోలేదు. ఏదేమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ. అతడు వరల్డ్ కప్‌లో ఆడినా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. పాకిస్థాన్‌తో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాదీ బ్యాటర్ అదరగొట్టాడు. 53 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.