మధ్యతరగతి కారు కలలకు రెక్కలు!
జీఎస్టీ రేట్ల దెబ్బకు కారు కలలకు రెక్కలొచ్చినట్టే ఉన్నాయ్. ఏమో గుర్రం ఎగురా వచ్చన్నట్టు.. ఏమో సాదా సీదా సామాన్యుడు కూడా ఓ పాతిక వేలు చేతిలో ఉంటే కొత్త కారు బుక్ చేయవచ్చన్నట్లుగా అన్నట్టుగా మారింది పరిస్థితి. అంతగా జనసామాన్యానికి జీఎస్టీ 2. 0 తో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఒక్కసారే వచ్చేసినట్లైంది. ఇలాంటి బంపరాఫర్లు ప్రకటించడంలో ముందుండే మారుతీ సుజుకీ అయితే.. తన కార్ల ధరలను భారీ ఎత్తున తగ్గిస్తూ ముందుగానే ప్రకటించేసింది. వాటిలో లక్షకు పైగా డిస్కౌంట్ ఇచ్చే కార్ల మోడళ్లు అరడజను వరకూ ఉన్నాయి.
ఉదాహరణకు ఎస్ ప్రెసో ధర ఏకంగా లక్షా ముప్పై వేల వరకూ తగ్గుతోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదే కోవలోకి వచ్చే కార్ల వివరాలేంటో చూస్తే.. ఆల్టో కే 10, గ్రాండ్ విటారా- లక్షా 7 వేలు, ఫ్రాంక్స్, బ్రెజ్జా- లక్షా 12 వేలు.. ఇక సెలేరియో 97 వేలు, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, వంటివి 80 వేల నుంచి 90 వేల మధ్య.. వ్యాగనార్, ఇగ్నిస్ ధరలు 70 వేలు- 80 వేల మధ్య తగ్గనున్నాయి. టూర్ ఎస్, జిమ్నీ, ఎక్స్ ఎల్ 6, ఇన్విక్టో, ఎకో, క్యారీ ఎల్పీజీ వంటివి 50 వేల నుంచి 70 వేల రూపాయల వరకూ తక్కువ ధరలకు లభించనున్నాయి. ఒక్క ఎర్టిగా మాత్రమే కేవలం 46 వేలు మాత్రమే తగ్గే వేరియంట్. మిగిలిన మోడళ్లన్నీ యాభై వేల నుంచి లక్షా ముప్పై వేల మధ్య ధరలు తగ్గనున్నాయి. ఇందులో కస్టమర్లకు మరింత లాభదాయకమైన విషయమేంటంటే బేసిగ్గానే మారుతీ.. డిస్కౌంట్లు ఎక్కువ, డౌన్ పేమెంట్లు తక్కువగా ఇచ్చే కంపెనీ.. ఒక వేళ జీఎస్టీ తగ్గుదల ద్వారా కూడా కస్టమర్లు క్యూ కట్టకుంటే మరింత డిస్కౌంట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి మధ్య తరగతి వారి కారు కలకు ఇక రెక్కలొచ్చినట్టే.. అన్నది మార్కెట్లో గట్టిగా వినిపిస్తోన్న మాట! మరి మీ కారు బుక్ చేస్కోడానికి మీరు రెడీయేనా?