ఏపీ పర్యాటకులకు గుడ్‌న్యూస్...త్వరలో ఆంధ్రా ట్యాక్సీ యాప్
ఆటో ట్యాక్సీ రంగంలో కూడా ప్రభుత్వ వాహనాలు ఉంటే బాగుండు.. చౌకగా, సౌకర్యవంతంగా వెళ్లిపోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. వారి ఆశలు నిజం కాబోతున్నాయి. ప్రైవేటు క్యాబ్ సంస్థలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా ప్రయాణికులు చౌకగా, సురక్షితంగా ఆటో, ట్యాక్సీ సేవలు పొందవచ్చు. విజయవాడలో ప్రైవేటు ఆటో, ట్యాక్సీల నుంచి పర్యాటకుల దోపిడీని అరికట్టేందుకు, డ్రైవర్లకు స్థిరమైన ఉపాధి కల్పించేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.
యాప్ ద్వారానే కాకుండా వాట్సప్, ఫోన్ కాల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చాలా చౌక. కానీ అదే స్థానికంగా ఉండే ప్రాంతాలకు ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు చెప్పే ధరలు వింటే. మరీ ముఖ్యంగా మెట్రో నగరాలు, సిటీల్లో.. చాలా దగ్గర దగ్గర దూరాలకు కూడా భారీ మొత్తంలో వసూలు చేస్తుంటారు. ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ క్యాబ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రయాణికులు చాలా చౌకగా.. సురక్షితంగా ప్రయాణాలు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా.. ఆంధ్రా ట్యాక్సీ అనే ప్రభుత్వ పోర్టల్, యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా జనాలు ఆటో, ట్యాక్సీలో కూడా తక్కువ ధరలకే ప్రయాణాలు చేయవచ్చు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో 'ఆంధ్రా ట్యాక్సీ' అనే ప్రభుత్వ పోర్టల్/యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. విజయవాడ దుర్గ గుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు చౌకగా, సురక్షితంగా రవాణా సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. విజయవాడ వచ్చే పర్యాటకులు, భక్తుల వద్ద నుంచి స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా మోసాలను అరికట్టి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా.. పర్యాటకం వృద్ధి చెందడం మాత్రమే కాక.. వాహనదారులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్ ద్వారా.. ఆటో, క్యాబ్‌లను.. యాప్, వాట్సప్, ఫోన్‌కాల్, క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు కావలసిన ప్రాంతాన్ని యాప్‌లో నమోదు చేస్తే, అక్కడ రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి.
ఆ యాప్లో కనిపించే డ్రైవర్లను అధికారులు ముందే అన్ని రకాలుగా చెక్ చేసి.. ఆ తర్వాత అనుమతిస్తారు. అలానే రవాణా శాఖ అధికారులు పరీక్షించి, ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ ఆంధ్రా ట్యాక్సీలో అవకాశం కల్పిస్తారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వాహనాల డేటా, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ఈ యాప్‌ను రూపొందించారు. యాప్‌లో నమోదైన వాహనాల సమాచారం రాష్ట్ర డేటా కేంద్రానికి చేరుతుంది.
దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుంది. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు రవాణా సేవలతో పాటు, హోటల్ గదులను కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం ప్యాకేజీలను కూడా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా డ్రోన్ సేవలను కూడా అందించనున్నారు. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.