తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
posted on Sep 19, 2025 @ 3:35PM
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 19) మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతిలోని అన్ని విభాగాలతో పాటు తిరుపతి జిల్లా యంత్రాంగంతో కూడా పూర్తి సమన్వయం చేసుకుంటూ సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వివరించారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకరించే ఆభరణాలు శుభ్రపచటం పూర్తయ్యిందన్నారు. అలాగే విద్యుత్ దీపాలంకరణలు, ఇంజినీరింగ్ పనులూ చేపట్టామని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు 60 టన్నుల పూతలో అలంకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో తిరుమలలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. గరుడ గరుడ సేవ రోజు రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర వైద్య సేవల కోసం అదనంగా 50 మంది వైద్యులు, 60 మంది సేవకులను నియమిస్తున్నట్లు వివరించారు.
ఇక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సేవలందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులను నియమించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో నాలుగువేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామనీ, అంతకంటే ఎక్కువగా వాహనాలు వస్తే వాటికి తిరుపతిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పిన టీటీడీ ఈవో.. సిఫారసు లేఖలను కూడా అనుమతించబోమని చెప్పారు.