Read more!

బాధ్యతగా ఉంటున్నారా??


ప్రపంచంలో మనిషి ఏదైనా గొప్పగా చేయగలిగింది ఉందంటే అది బాధ్యతగా ఉండటమే అనిపిస్తుంది. వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇతర పనులలో కావచ్చు పూర్తిస్థాయి బాధ్యతగా ఉండటం అనేది చాలామంది విషయంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఇదే విషయం మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. 

ఎందుకీ ఫిర్యాదులు?? అని ఆలోచిస్తే ఎందుకంటే ఇంకేముంటుంది బాధ్యతగా లేకపోవడం వల్ల అని అందరికీ అర్థమైపోతుంది. 


అయితే….


సమాజంలో దృష్టిలో బాధ్యత!!


చాలామంది చాలా కోణాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనలు అన్నీ అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ట్రైన్ తన మెయిన్ స్టాప్ కు వచ్చి చేరినట్టు, మనిషి ఆలోచనలు కూడా అన్ని విధాలుగా ఆలోచించి చివరకు తమ దగ్గరే ఆగుతారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే బాధ్యత అనే విషయాన్ని  ప్రతి మనిషి తను ఆశిస్తున్న ప్రయోజనాలకు దగ్గరే నాటుకుంటాడు. 


ఉదాహరణకు ఒక కాలేజీ కుర్రాడు తనకు కావలసిన అవసరాలను, వస్తువుల్ని తీర్చడం తన తండ్రి బాధ్యత అనుకుంటాడు. ఒకవేళ ఆ కుర్రాడు అడిగింది ఏదైనా అతని తండ్రి నిరాకరిస్తే బాద్యతలేని తండ్రి అనేస్తాడు. స్నేహితుల దగ్గర అదే మాట చెప్పేస్తాడు. ఇలాంటి వాళ్ళు ప్రస్తుత సమాజంలో బేషుగ్గానే ఉన్నారు. 


నిజానికి బాధ్యతంటే ఏంటి??


బాధ్యత అనేది డిమండింగ్, కమండింగ్ ల మధ్య సాగేది కానే కాదు. అది మనిషిలో ఉండాల్సిన లక్షణాలలో ఒకటి. ఈ విషయం అర్ధం చేసుకుంటే ప్రతి ఇల్లు కూడా ఫిర్యాదులు లేకుండా హాయిగా ఉంటుంది. ఒక తండ్రి తన ఆర్థిక కారణాల వల్ల ఉన్నదాంట్లో తన పిల్లలని సంతోషపెట్టాలని చూస్తే పిల్లలు కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ పరిస్థితికి తగ్గట్టు సర్దుకుపోవాలి. వృత్తిలో సమర్థవంతమైన పనిని అందివ్వాలి. స్నేహితులు చుట్టాల దగ్గర  అనవసర డాబు పోకుండా మోహమాటాల కోసం సామర్త్యానికి మించిన పనులు ఒప్పుకోకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైనా నిజాయితీగా చెప్పేయడం, చేయడం వంటివి చేస్తే వ్యక్తిత్వాన్ని చూసి అందరూ గౌరవిస్తారు. 


ఒకరి మెప్పు కోసమో, ఒకరు గొప్పగా చెప్పుకోవడం కోసమో కాకుండా తాము చేయవలసిన పనిని తమ పూర్తి సామర్త్యంతో చేస్తే అప్పుడు మనిషి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్టు. 


కొందరు ఏమి చేస్తారంటే!!


కొందరికి సామాజిక స్పృహ చాలా ఎక్కువ(ఈ మాట కొంచం వెటకారంగా చెప్పబడింది). ఎంత ఎక్కువ అంటే, ఓ సంపాదన పరుడు ఆరంకెల జీతం తీసుకుంటూ గుడిలోనో, అనాథశ్రమంలోనో మరింకోచోటో అన్నసంతర్పణలు, వస్త్రధానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న కన్నతల్లికి ప్రేమగా ఓ ముద్ద అన్నం పెట్టరు. సమాజం ఇచ్చే అటెన్షన్ కోసం ఇలా చేసే వాళ్ళు చాలా బాద్యతకలిగిన వాళ్ళలా సమాజానికి మాత్రమే అనిపిస్తారు. కానీ ముఖ్యంగా బాధ్యత ఉండాల్సింది తమ ఇంటి విషయంలో, తరువాత కుటుంబసభ్యుల అవసరాల విషయంలో, ఆ తరువాత సమాజం విషయంలో. అంతేకానీ అన్నీ వదిలిపెట్టేసి తన వాళ్ళు దిగులుగా, లోటుతో, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటే సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయడం బాధ్యత అనిపించుకోదు. 


ఈ సమాజంలో ప్రస్తుతం మనుషుల తీరు గమనిస్తే చెప్పుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఎప్పుడూ అన్నిటికీ పెద్దల మీదనో, ఇంట్లో ఉన్న సంపాదనా పరుల మీదనో ఆధారపడటం మాని ఇంటికి సహాయంగా ఉండకపోయినా తమని తాము సరైన విధంగా ఉంచుకుని, మంచిగా తీర్చిదిద్దుకుంటే (దీన్నే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం అంటారు) ఎవరి జీవితం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉన్నట్టే. అదే గనుక జరిగితే అన్ని విషయాలలోనూ అన్ని కోణాలలోనూ బాధ్యతగా ఉండటం అనేది క్రమంగా అలవాటైపోతుంది.


మరి ఏవి బాధ్యతలు??


ఓ తండ్రి తన పిల్లలకు మంచి దారి చెప్పడం, చూపించడం, జీవితాన్ని గురించి వివరిస్తూ ఉండటం, చదువు, సంస్కారం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడం. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదు. ఇంకా చెప్పాలంటే అదీ, ఇదీ అన్నట్టు ఇంటిని చక్కబెడుతూ, ఎన్నో రంగాలలో రాణిస్తున్న మహిళా ముత్యాలు బోలెడు ఉన్నాయి.


పిల్లలు తల్లిదండ్రులు తమ మీద ఇష్టాలు రుద్దుతున్నారు అనుకోకుండా పెద్దల ఆలోచనలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చదువు విషయంలో తమ ఇష్టాల్ని చెప్పి అందులో ఉత్తమంగా రాణించాలి. జులయిగా తిరగడం, అల్లరిగా మారిపోవడం వదిలి కాసింత పరిపక్వతతో ఆలోచించాలి.


ఉపాధ్యాయులు ఈ సమాజానికి మంచి పౌరులను అందించడానికి ప్రయత్నం చేస్తే ఆ పౌరులే సమాజాన్ని శాసించే వ్యక్తులు అవుతారు. అంతేకానీ ఎప్పుడూ ర్యాంకులు, మార్కులు అంటే విద్యార్థులకు ఆ మార్కులు, ర్యాంకులు, చదివిన చుదువు తాలూకూ విషయం తప్ప వాళ్లకు ఇంకేమీ తెలియకుండా పోతుంది.


ప్రభుత్వాల గురించి రాజకీయ నాయకుల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ.  అయినా బాధ్యతగా ఉండాల్సింది మనమైతే ప్రభుత్వాల గురించి ఎందుకు చెప్పండి!!


                                                                                                         ◆వెంకటేష్ పువ్వాడ.