నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు.. వైసీపీ నేతల ప్రమేయాన్ని నిర్ధారించిన పోలీసులు
posted on Nov 25, 2024 @ 5:12PM
వైసీపీ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలకు పాల్పడిన వారంతా ఒక్కొక్కరుగా చట్టం చేతికి చిక్కుతున్నారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా నేరాలకు పాల్పడి ఆయన అండతో చట్టానికి చిక్కకుండా దర్జాగా తిరిగిన వారంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత తప్పించుకోవడానికి అజ్ణాతాన్ని ఆశ్రయిస్తున్నారు.తాజాగా చంద్రబాబుపై నందిగామలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం బయటపడింది.
2022 నవంబర్ 5 లో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కృష్ణాజిల్లా నందిగామలో పర్యటిస్తున్న సమయంలో ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన రావు గాయపడ్డారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేయాల్సిన అప్పటి పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్ కాంతి రాణా తాతా పూలు చల్లుతుండగా చిన్న చిన్న రాళ్లు పడ్డాయని పేర్కొంటూ తేలికపాటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తు కూడా ముందుకు సాగలేదు. అది వేరే సంగతి. అప్పటి దాడిలో గాయపడిన చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుసూదన రావుకు రక్తగాయాలు అయ్యాయి. ఆ విషయాన్ని కూడా అప్పట్లో పరిగణనలోనికి తీసుకోకుండా అప్పటి సీపీ కాంతి రాణా తాతా కుట్రపూరితంగా వ్యవహరించారు.
అప్పట్లోనే తెలుగుదేశం నేతల చంద్రబాబుపై దాడి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అయితే పోలీసులు ఆ ఆరోపణలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా నందిగామలో జగన్ హయాంలో గత ఏడాది నవంబర్ 5న జరిగిన రాళ్ల దాడి కేసు రీఓపెన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కన్నెగంటి సజ్జనరావు, పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్, మార్తి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ దాడి వెనుక వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుల ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.