తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు!

తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు సోమవారం ( మే 26) సాయంత్రానికి తాకనున్నాయి. నిన్నటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను విస్తరించిన రుతుపవనాలు.. ఈ ఏడాది వారం ముందుగానే కేరళ తీరాన్ని తాకిన సంగి తెలిసిందే. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ ఏడాది మాత్రం ఐదు రోజుల ముందుగానే  కేరళను తాకాయి. దానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఇవి చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో దేశలోని పలు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్‌ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్‌, నాగాలాండ్‌, ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళఖాతంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే తొలకరి వానలు మొదలయ్యాయి.  అలాగే    కర్ణాటక  మరఠ్వాడ వద్ద ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటలలో  బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కర్నాటక, తెలంగాణ, రాయలసీమలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురుస్తాయని వివరించింది.  

స్థానిక సమరానికి రేవంత్ సర్కార్ రెఢీ?

తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు  స్థానిక సంస్థల ఎన్నికలలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది పైనే అయినా,  ప్రభుత్వం ఎన్నికల ఉసెత్తక పోవడంతో  ఇటు పార్టీ నాయకులో, అటు గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యకతమవుతోంది.  ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యమైతే పార్టీకి, ప్రభుత్వానికి కూడా మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు అందడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.  నిజానికి, జూన్ జూలై నెలల్లో  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయిం చింది. అయితే..  గ్యారెంటీలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం ఎన్నికలపై ప్రభావం చూపు తుందని  సొంత సర్వేలు తేల్చిచెప్పడంతో ముఖ్యమంత్రి ఎన్నికల నిర్వహణ విషయంలో తటపటాయిస్తూ వచ్చారని అంటున్నారు. అయితే.. అదే సమయంలో ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా, ఆలస్యం అయిన కొద్దీ పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉందనే సంకేతాలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహించాలానే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2.. తెలంగాణ అవతరణ  దినోత్సవం రోజున స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గంట కొడతారని అంటున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో..  ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పంచాయతీ ఎన్నికల ప్రస్తావన చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత జూన్‌ 5లోగా స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) నుంచి ప్రకటన రావచ్చని అధికార వర్గాల సమాచారం.  రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌,ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఇటీవల సచివాలయంలో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్లు చెపుతు న్నారు. పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నదని ముఖ్యమంతి అధికారులకు తెలుపగా, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పినట్టు సమా చారం. అంతే కాకుండా ముఖ్యమత్రి సమీక్ష సమావేశం అనంతరం తొలిసారిగా కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులతో మాట్లాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడవచ్చని, సిద్ధంగా ఉండాలని అధికారులను కమిషనర్ ఆదేశించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.  సో.. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఎన్నికల పరీక్షకు వెళుతున్నారన్న మాట. సహజంగా స్థానిక సంస్థల ఎనికల్లో  అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అంటారు.అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు అందుకుభిన్నంగా కనిపి స్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందనే అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్లిందని అంటున్నారు. ఇటీవల జరిగిన పట్ట భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైందని, అంటున్నారు.  నిజానికి..  ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫలితాలతో సంబం ధం లేకుండా  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నారని అంటు న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పంచాయతీరాజ్ అధికారులతో జరిపిన సమీక్ష సమా వేశంలోనూ ఎమ్మెల్యేల వత్తిడి అంశాన్ని ప్రస్తావించారని  ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా.. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమ సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్తారని, తమపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకే వెంటనే ఎన్నికలకు వెళ్లాలని కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, యువవికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి,  ఉపముఖ్యమంత్రి  పలు సూచనలు చేశారని అంటున్నారు.  అదలా ఉంటే..  స్థానిక సమతల ఎన్నికలు సకాలంలో జరగక పోవడం వలన, కేంద్ర నిధులు, 15వ ఫైనాన్స్‌ నిధులు ఆగిపోయాయి. నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచిపోయింది. మరోవంక గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబదించిన బిల్లులు రాక  మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే..  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలల పైనే అయినా, ఇంతవరకు పైసా విదల్చ లేదు. మరో వంక తమ పదవీకాలం ముగిసినా, తమ హయాంలో సొంత పూచికత్తుపై అప్పులు చేసి పూర్తి చేసిన పనులకు సంబందించిన బిల్లుకు మోక్షం రాక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు ఆందోళన బాట పడ్డారు. ఎన్నికలు జరిగి  స్థానిక సంస్థల పాలకవర్గాలు ఏర్పడితే, రాష్ట్ర నిధులు కాకున్నా, కేంద్ర నిధులు, 15 వ ఫైనాన్సు నిధులు అయిన వస్తాయని గ్రామీణ ప్రజలు, నాయకులు ఆశ పడుతున్నారు.

బంతిపూలవనంగా మారిన కడప

తెలుగుదేశం మహానాడుకు కడప నగరం ముస్తాబైంది. మంగళవారం (మే 27) నుంచి మూడు రోజుల పాటు కడప వేదికగా జరగనున్న మహానాడు కోసం ఏర్పాట్లూ శర వేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైస్ జగన్ కు కంచుకోటలాంటి కడప నగరం తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలతో పసుపుపచ్చ శోభ కనిపిస్తోంది. ఎటు చూసినా పసుపుపచ్చదనం వెల్లివిరిస్తోంది.  పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఇతర నేతలూ కడపకు తరలిరానున్నాయి.   ఇప్పటికే మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలు నిర్విరామంగా తమతమ పనులు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథి, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాకు తెలిపారు.  మహానాడుకు 50 వేల మందికి పైగా ప్రతినిథులు హాజరు కానున్నట్లు తెలపారు. ఈసారి మహానాడును స్వచ్ఛ మహానాడుగా, జీరో వేస్ట్ ఈవెంట్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పర్యావరణానికి హాని కలిగించని వస్తువులనే వినియోగిస్తామన్నారు.   మహానాడులో చర్చించి ఆమోదించే తీర్మానాలపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారనీ,  గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగతంగా పార్టీ మరింత  బలోపేతం చేయడం వంటి అంశాలపై తీర్మానాలు ఉండే అవకాశం ఉందంటున్నారు.  అదే విధంగా యువత, మహిళలకు ప్రాధా న్యం,  రాయలసీమ అభివృద్ధి, కడప  ఉక్కు పరిశ్రమ  వంటి అంశాలపై కూడా మహానాడు వేదికగా కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.   

కాకాణి అరెస్టుపై అనిల్ కుమార్ ఖంగారెందుకో తెలుసా?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు  ఆదివారం (మే 25) కేరళలో అరెస్టు చేసి ఏపీకి తరలించిన సంగతి తెలిసిందే.  క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో గుంటూరు రేంజ్ పోలీసులు   ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రోడ్డు మార్గంలో నెల్లూరులోని  డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం)కి తరలించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం (మే 26) ఉదయం కాకాణిని వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తరలించారు. తరువాత ఆయనను వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు   హాజరుపరిచే అవకాశం ఉంది. ఇలా ఉండగా కాకాణి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు వార్త తెలియగానే ఆదివారం (మే 25) అర్ధరాత్రి నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళీ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు.  మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టలేరనీ, త్వరలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షం పై కక్ష పూరితంగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.   స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడూ చూడని అరెస్టులను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులని విమర్శించారు.  అక్రమ కేసు పెట్టారు కనుకే మాజీ మంత్రి కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించార్న ఆయన న్యాయపోరాటం చేస్తామన్నారు. అయినా ఇన్నాళ్లూ పార్టీకీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చి ప్రభుత్వంపై నిప్పులు చెరగడం వెనుక తన అరెస్టు భయం ఉండటమే కారణం అంటున్నారు. ఎందుకంటే ఇదే అనిల్ కుమార్ యాదవ్ గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. మంత్రిగా ఉండగా మీసం తిప్పి, తొడ చరిచి, ప్రభుత్వంపైనా, తెలుగుదేశం నేతలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్.. అప్పట్లో జగన్ మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవిని పీకేసి.. నెల్లూరు జిల్లాకే చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్నసమయంలో  అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు కారణంగానే అప్పట్లో ఆయనను పార్టీ సమన్వయకర్త పదవి నుంచి  జగన్ తప్పించారన్న ప్రచారం కూడా ఉంది. ఇక 2024 ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్న అనుమానాలు కూడా ఒక దశలో వ్యక్తం అయ్యాయి.   వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్  ఓటమి తరువాత సైలెంటైపోయారు. వాస్తవానికి ఫలితాలకు ముందే, అంటే పోలింగ్ జరిగిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించార ఆరోపణలు చేయడం ద్వారా ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.   పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా  ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని హేళన చేశారు. రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఆయన రాజకీయ భవిష్యత్ లో సందిగ్ధంలో పడింది.  ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మళ్లీ సవాళ్లతో  చెలరేగిపోతున్నారు.  అయితే.. అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలకు నేడో రేపో తన అరెస్టూ తప్పదని భావిస్తున్న అనిల్... అప్పుడు తనకు పార్టీ నుంచి మద్దతు కోసమే ఇప్పుడు కాకాణి అరెస్టును ఖండిస్తూ.. న్యాయపోరాటం, అక్రమ అరెస్టులకు భయపడం అంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

కర్ణాటకలో హస్తానికి ఎదురు గాలి.. తెలంగాణకు ముందస్తు హెచ్చరిక

దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో  ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. అందులో ఒకటి తెలంగాణ. తెలంగాణలో పరిస్థితి ఏమిటో ప్రత్యేకంచి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పడు కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హస్తం పార్టీ ఓటమి తధ్యమని హస్త సాముద్రిక పండితులు స్పష్టంగా చెపుతున్నారు. నిజానిక హస్త సాముద్రిక పండితులను, రాజకీయ విశ్లేషకులను అడగవలసిన పని లేకుండానే, కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను గమనిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అయ్యేపని కాదని, సామాన్యులకే అర్థమైపోతుంది.  సరే, తెలంగాణ విషయాన్ని పక్కన పెట్టి, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్రోహదం చేసిన కర్ణాటకలో పరిస్థితి ఏమిటని చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటక  కాంగ్రెస్ ‘చేయి’ జారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే సంకేతాలు ఇస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్  పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలు అదే సూచిస్తున్నాయి.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష బీజేపీకి 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు కైవశం చేసుకుంటుందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని,  పీపుల్స్ పల్స్ సర్వే చెపుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలలో 10 శాతానికి పైగా  ఓట్లు కోల్పోయింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం రెండేళ్లలో పాలనలో ప్రభుత్వ వ్యతిరేక జరజరా పాకుతూ పైపైకి పోతోందని సర్వే సూచిస్తోంది. మరో వంక.. ప్రతిపక్ష బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది.  సో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే  తేల్చి చెప్పింది. అయితే..  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు. కాబట్టి  కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదు.   డీకే శివకుమార్ ఉండనిస్తే.. సిద్దరామయ్య సర్కార్  మరో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది. కానీ, ఆడుతూ పడుతూ హనీమూన్ లా సాగవలసిన తొలి రెండేళ్ళలోనే మోయలేనంత ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్న కాంగ్రెస్  ప్రభుత్వానికి, ముందున్న మూడేళ్లూ క్రొకోడైల్ ఫెస్టివల్ తప్పదని అంటున్నారు.  నిజానికి.. 1985 నుంచి గడచిన నాలుగు దశాబ్దాల రాష్ట్ర ఎన్నికల చరిత్రను చూస్తే.. కర్ణాటక ప్రజలు ఒక సారి గెలిపించిన పార్టీని  వరసగా రెండవ సారి గెలిపించిన సందర్భం లేదు. ప్రతి ఐదేళ్లకోసారి, ప్రభుత్వాన్ని మార్చడం కర్ణాటక రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది.  సో ... సర్వే ఏమి చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో  ఏదో మహాద్భుతం జరిగితే తప్ప కాంగ్రస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా రెండేళ్లకే చేతులెత్తేసిన సిద్దరామయ్య సర్కార్, ఐదేళ్ళ తర్వాత తిరిగి అధికారంలోకి రావడం అయ్యే పని కాదని సర్వేలే కాదు సామాన్యులు కూడా చెపుతున్నారు.  అదొకటి అయితే.. కర్ణాటక సర్వే నుంచి తెలంగాణ ప్రభుత్వం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది చాలనే ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలంగాణ,కర్ణాటక రెండూ ఇరుగుపొరుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో వుంది. అంతే కాదు, రెండు రాష్ట్రల్లోనూ ఇంచుమించుగా ఒకే విధమైన గ్యారెంటీలు, హమీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొంతలో కొంత మెరుగ్గా అమలు చేస్తోంది. అయినా, పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు సహా ఏ వర్గం ప్రజల్లోనూ ఆశించిన ఆదరణ లభించడం లేదు. మహిళా ఓటర్లలో బీజేపీకి 48.4 శాతం, కాంగ్రెస్ కు 44.6 శాతం మద్దతు లభిస్తుండడంతో కాంగ్రెస్ పై బీజేపీ మహిళా ఓటర్లలో 3.8 శాతం ఆధిపత్యం కనబరుస్తోంది. పురుష ఓటర్లలో బీజేపీ 51.9 శాతం, కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లు సాధిస్తుండడంతో.. బీజేపీ కాంగ్రెస్ పై 13 శాతం భారీ ఆధిక్యత చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.18-25 సంవత్సరాల ఓటర్లలో బీజేపీ 24 శాతం ఆధిక్యతను కొనసాగిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ, గత (2023) ఎన్నికల్లో రైతు సంక్షేమానికి  సంబంధించి  అనేక హమీలను ఇచ్చింది. సానుకూల ఫలితాలు సాధించింది. కొన్ని పథకాలను అమలు చేసింది. అయినా..  గ్రామీణ ప్రాంతలో ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీల్లో కాంగ్రెస్ ఆదరణ దినదినాభివృద్ధిగా దిగజారుతోందని సర్వే సూచిస్తోంది.  గ్రామీణ ప్రాంతంలో 13.5 శాతం, పట్టణాల్లో 6.6 శాతం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆధిక్యంలో వుంది. రైతుల్లో బీజేపీకి 53.9 శాతం, కాంగ్రెస్ కు 37.4 శాతం ఓట్లు లభించవచ్చని సర్వే సూచిస్తోంది.  నిజమే.. పీపుల్స్  పల్స్ సంస్థ   పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్  సర్వే ద్వారా కర్ణాటక ప్రజల నాడి పట్టి చూసింది. అయితే.. కర్ణాటక తెలంగాణల మధ్య అనేక విషయాల్లో సారుప్యత ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు కూడా ఇదో హెచ్చరికని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ తెలంగాణ కంటే ఐదారు నెలలు ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.. ఐదారు నెలల తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపునకు ద్రోహదం చేసింది..  సో.. కర్ణాటక సర్వే కర్నాటకకే పరిమితం కాదు. తెలంగాణకుకూడా  ఒక సంకేతమే, ఒక  హెచ్చరికే అంటున్నారు.

మాజీ మంత్రి కాకాణి అరెస్టు

రెండు నెలలుగా పోలీసులను ముప్పతిప్పలు పట్టిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు.   పోలీసులు ఆదివారం( మే 25) ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకాణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణిని  సోమవారం (మే26) ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాణి ముందస్తు బెయిల్‌ని తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్న అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకాణిని   అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకిణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ.. కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాణి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారాయన. కానీ.. ఆయన ప్రయత్నాలన్నీవిఫలమయ్యాయి.   మరోవైపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. కాకాణి కేరళలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్‌కి వెళ్లిన పోలీసులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. 

జగన్ ఫోటో పెడితే ఊరుకోను..అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరిక

  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెడితే ఊరుకోబోమని  సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే  ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఎవరైనా అధికారులు ఆయన ఫోటో పెడితే నడిరోడ్డుపై పగలగొడతామని హెచ్చరించారు. కొందరు ఉద్యోగులు గవర్నమెంట్ ఆఫీసులో జగన్ ఫోటో పెడితున్నారు. మీకు అభిమానముంటే మీ ఇళ్లలో పెట్టుకోవాలి ఆయన అన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలాంటి పనులు చేయొద్దు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ సీఎం జగన్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతున్నారు. ప్రధానంగా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు ఉండటంపై అనంత టీడీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ విధంగా జగన్ ఫోటోను ఉంచారంటూ జడ్పీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా కూడా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు. జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్‌‌లో కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచుతున్నారని, సీఎం చంద్రబాబు ఫోటోలు ఉంచడం లేదని విరుచుకుపడ్డారు

ఆ నలుగురిలో నేను లేను : అల్లు అరవింద్

  తెలుగు ఇండస్ట్రీలో ఆ నాలుగురు ఆ నాలుగురు అంటున్నారు. కానీ ఆ నలుగురిలో లేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసం అని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి... కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందినవాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని... అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. "మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు... మరి ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి.  ఇలాంటప్పుడు అందరూ కూర్చుని ఏం చేయాలనేది చర్చించాలి కదా! నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి" అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు.  రెగ్యులర్ గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే, సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే తన మద్దతు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఆ 'నలుగురు' కాస్తా ఇప్పుడు 10 మంది అయ్యారు... వారిలో నన్ను కలపవద్దని మీడియాను కోరుతున్నా అని విలేకరులతో అన్నారు. తాను 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలో ఉన్నానని, తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లీజులో లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీలో 1,500 థియేటర్లు ఉంటే, అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని అన్నారు. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పాను అని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి మాట్లాడింది సమంజసమే అనుకుంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు.

ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే సీఎంలు తీర్మానం

  ఆపరేషన్‌ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, సాయుధ బలగాలను ప్రధాని వెన్నంటి పోత్సహిస్తూ వచ్చారని, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆపరేషన్ సిందూర్ గట్టి సమాధానం ఇచ్చిందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ విజయంలో భద్రతా బలగాలు, ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఎన్డీయే రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టిన ఈ  తీర్మానాన్ని మిగతా నేతలు ఆమోదించారు. ఎన్డీయే ( పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.  దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారాను ఇచ్చి..ముందుకు నడిపించారని కొనియాడారు . ఎన్డీయే రాష్ట్రాల సీఎంలతో సమావేశం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో కుల జనగణనపై ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రశంసించామని వారు తెలిపారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారం లక్ష్యంగా అందరు కలిసి పనిచేయాలి అని తెలిపారు.

కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన లాలూ ప్రసాద్‌

  రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌‌ను  ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు  ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకు తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి, కటుంబం నుంచి బహిష్కరిస్తున్నామని లాలూ యాదవ్‌ ట్వీట్టర్ వేదికగా ద్వారా పేర్కొన్నారు.  తాను 12 ఏళ్లుగా అనుష్క యాదవ్‌ అనే మహిళతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతూ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శనివారం చేసిన పోస్టు వైరల్‌ అయ్యింది. ఆ మరుసటి రోజే లాలూ యాదవ్‌ అతడిపై బహిష్కరణ వేటు వేశారు. అయితే తన ఫేస్‌బుక్‌ పోస్టుపై ఆదివారం ఉదయమే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ స్పందించారు. ఆ పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టుతో జత చేసిన ఫొటో కూడా ఒరిజినల్‌ కాదని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఎడిట్‌ చేశారని ఆరోపించారు. తమ ఫ్యామిలీ పరువు తీయడానికే ఎవరో ఇలా చేశారని విమర్శించారు. అయినా ఆ పోస్టును కారణంగా అతడి తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. తేజ్‌ ప్రతాప్‌పై పార్టీ నుండి సస్పెండ్ చేశారు.  

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌‌తో కేటీఆర్ భేటీ..అందుకోసమేనా?

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌ను ఆపార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌లో కలిశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కవిత తండ్రి కేసీఆర్‌కు ఆమె లేఖ రాయటం.. పార్టీలోని కొంతమందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని కవిత అనటంతో తీవ్ర దుమారం రేగింది. కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.  

ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు : హ‌రీశ్‌రావు

  రాష్ట్ర నీటి అవ‌స‌రాలు కాపాడ‌టంలో ఈ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.. గోదావ‌రి – బ‌న‌కచ‌ర్ల ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 200 టీఎంసీల గోదావ‌రి జ‌లాలు ఏపీ త‌ర‌లించుకుపోయే కుట్ర జ‌రుగుతుంది. తెలంగాణ‌కు ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. గోదావ‌రి – బ‌న‌క‌చ‌ర్ల‌కు ఒక్క అనుమ‌తి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది.  కేంద్రం జుట్టు త‌న చేతిలో ఉంద‌ని చంద్ర‌బాబు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన జ‌ల‌దోపిడీ.. కాంగ్రెస్ పాల‌న‌లో మ‌ళ్లీ మొద‌లైంది. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తెలంగాణ చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు మోకాలు అడ్డుపెట్టారు. తెలంగాణ ప్రాజెక్టులు ర‌ద్దు చేయాల‌ని కేంద్రానికి లేఖ‌లు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాల‌ని ఏపీకి 20కి పైగా లేఖ‌లు రాసింది. పాల‌మూరు, భ‌క్త‌రామ‌దాసు, డిండిపై చంద్ర‌బాబు లేఖ‌లు రాశారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న గవర్నర్‌ దంపతులు

  కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు పుష్కర పుణ్య స్నానం ఆచరించారు.  గవర్నర్‌ దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు.   అనంతరం గవర్నర్ సతీసమేతంగా ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మే 15 నుండి మే 26 వరకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్నాయి. ఈ పవిత్ర 12 రోజుల ఉత్సవంలో గోదావరి, ప్రాణహిత, భూగర్భ సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో భక్తులు పుష్కర స్నానం చేస్తారు.  పుష్కరాల సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీఎస్‌ఆర్టీసీ ద్వారా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు దశకు రావడంతో భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నేడు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మిస్ వ‌ర‌ల్డ్‌లో రాజ‌కీయ కుట్ర కోణం?

  మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్య‌వ‌హార శైలి కాస్త అనుమానాస్ప‌దంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మ‌ర్ అయిన మ్యాగీ త‌న త‌ల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విష‌యాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని అంటారు కొంద‌రు.మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు అన‌గా ఇప్ప‌టికిప్పుడొచ్చిన న‌ష్టం ఏమీ లేదు. ఎందుకంటే 1951లో ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇంగ్లండ్ లో ఒక బికినీ షోతో మొద‌లైన ఈ పోటీలు.. ఆనాడే వివాదాస్ప‌దం. ఆ త‌ర్వాత అదిప్ప‌టికి అర‌డ‌జ‌ను సార్ల‌కు పైగా ర‌క‌ర‌కాల వివాదాల‌తో తీవ్ర అభ్యంత‌రాల‌ను ఎదుర్కుంది. తెలుపు- న‌లుపు, మ‌తానికి సంబంధించి, ఆపై కోవిడ్ వంటి విష‌యాల్లో ఈ పోటీలు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ మాట‌కొస్తే హైద‌రాబాద్ లోనూ వ్య‌తిరేక‌త‌లు ఎదుర‌య్యాయి. కొన్ని ప్ర‌జా సంఘాల వారు ఈ పోటీల‌ను తొలి  నుంచీ వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.  ఇప్పుడు కూడా ఇక్క‌డ కూడా వ్య‌తిరేకించారు. అయితే ఇక్క‌డ మ్యాగీ విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలేంటంటే.. ఇది ఒక ఇంగ్లండ్ కి సంబంధించిన పీజెంట్. ఆమె మ‌రెవ‌రో కాదు మిస్ ఇంగ్లండ్. అలాంటిది త‌న దేశానికి సంబంధించిన ఒక పోటీలో పాల్గొని.. ఎలాగోలా ఇక్క‌డి స్థితిగ‌తుల‌ను అవ‌గ‌తం చేసుకుని వాటిని పూర్తి చేసి.. ముందుకెళ్లి కిరీటం ద‌క్కించుకోవాలి. ఆమెకంటూ ఈ కిరీటం ద‌క్క‌ద‌నుకుందో ఏమో తెలీదు. కానీ ఆమె అయితే అర్ధాంత‌రంగా అది కూడా ఒక అబ‌ద్ధం చెప్పి త‌ప్పుకుంది. త‌న త‌ల్లికి బాగోలేద‌ని ఆమె చెప్ప‌డం విడ్డూరం. ఇది ఎప్ప‌టికీ స్ఫూర్తి కాదు. రెండో విష‌యం ఇక్క‌డంద‌రూ త‌న‌నొక వేశ్య‌ను చూసిన‌ట్టు చూస్తున్నారంటే.. అర్ధ‌మేంటి? ఇక్క‌డో మాట అక్క‌డో మాట చెప్ప‌డంలో మీనింగ్ ఏమ‌నుకోవాలి?అంటే మిగిలిన కంటెస్టెంట్లంతా వేశ్య‌ల‌నా? లేక హైద‌రాబాద్ అంటే అతి పెద్ద విటుల సంఘ‌మ‌నా ఒక ర‌కంగా చెబితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాల వ‌ల్ల ఆమె ఒక్క‌రే శుద్ధ  పూస మిగిలిన వారాంతా వ్య‌భిచారుల‌ని.  అంతేగా దీన‌ర్ధం! మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇటు వ‌చ్చింది సాదా సీదా టూరిస్టుగా కాదు. ఒక దేశానికి ప్ర‌తినిథిగా. పైపెచ్చు ఇదామె దేశానికి సంబంధించిన ప్ర‌పంచంలోనే నాలుగో అతి  పెద్ద బ్యూటీ ఈవెంట్. దాన్ని అప‌హాస్యం చేయ‌డం అంటే త‌న దేశాన్ని సైతం అప‌హాస్యం చేయ‌డంతో స‌మానం.  మ‌రో ఇంపార్టెంట్ థింగ్.. ఇది బ్యూటీ విత్ ప‌ర్ప‌స్ గా 1980ల కాలం నాటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఈ మొత్తం ఈవెంట్ ద్వారా సంపాదించిన మొత్తంలోంచి 1 బిలియ‌న్ పౌండ్ల‌ను విక‌లాంగులు, అనాథ బాలల‌కు ఒక చారిటీగా ఇస్తారు. దీన్ని కూడా ఆమె క‌నీసం గుర్తించ‌లేదు.ఇక పోతే హైద‌రాబాద్ కి లండ‌న్ కొ ఒక పోలిక ఏంటంటే.. హైద‌రాబాద్ లోనూ లండ‌న్లోనూ న‌దులుంటాయి. లండ‌న్ న‌గ‌ర మ‌ధ్య భాగంలో థేమ్స్ న‌ది ఉన్న‌ట్టు.. ఇక్క‌డ కూడా మూసీ న‌ది ఉంటుంది. ఈ ప్ర‌భుత్వం మూసీ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించింది. తాను వ‌చ్చేట‌పుడు ఈ విష‌యం కూడా తెలుసుకుని.. తాను ఈ దిశ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా విరాళాలు సేక‌రించి త‌న వంతు బాధ్య‌త తీసుకోవ‌చ్చు.  అదీ  మిస్ చేసిందీ మిస్ ఇంగ్లండ్. ఇక పోతే.. వ‌చ్చే రోజుల్లో ఈమె అందానికి దాని వెన‌క ఉన్న తెలివికి మెచ్చి పొర‌బాటున ఐక్య‌రాజ్య స‌మితి ఈమెకు ఏ సోమాలియాకో పంపి అక్క‌డి మ‌హిళ‌ల‌ల్లో సంస్క‌ర‌ణ తీసుకురావాల‌ని.. వారికంటూ ఆత్మ విశ్వాసాన్ని నూరిపోయాల‌న్న బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తూ ఒక అంత‌ర్జాతీయ రాయిబారిగా పంపితే అక్క‌డ వారు ఇలా చేశారు అలా చేశారు. అక్క‌డి అర‌టిపండ్లు, ఒంటె పాలు నేను తాగ‌లేక పోయానంటే ఎలా ఉంటుంది?ఇదిలా ఉంచండి. బేసిగ్గా మ్యాగీ ఒక స్విమ్మ‌ర్. స్విమ్మింగ్ ఏం చెబుతుంది? ఎన్నేసి అవాంత‌రాలు ఎదురైనా వాటిని ఈదుకుంటూ వెళ్లాల‌ని. క‌నీసం ఆ స్పిరిట్ కూడా ఆమె కొన‌సాగించ‌లేక పోయారు. ఫైన‌ల్ గా ఇక్క‌డ మ్యాగీ వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్ప‌దంగా  ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డున్న కొన్ని ప్ర‌త్య‌ర్ధి పార్టీ ఎన్నారై లింకులు అక్క‌డ మ్యాగీ మ‌ద‌ర్ ని మేనేజ్ చేసి ఉంటారేమో.. అని అంటున్నారు కొంద‌రు.  అంతే కాదు ఇక్క‌డ ఒక రాజ‌కీయ పార్టీ క‌ర‌ప‌త్రిక‌ ఈ విష‌యంపై ఎంతో ఆతృత క‌న‌బ‌ర‌చి.. త‌ద్వారా ఆమెకు ఫోన్ చేసి మ‌రీ ఈ విష‌యం ఒక క్లారిటీ తెచ్చుకుని.. అక్క‌డున్న త‌మ యూకే ప్ర‌తినిథి  చేత ఇది బ్రాండ్ హైద‌రాబాద్ ఇమేజీకే డ్యామేజీ క‌లిగించే అంశ‌మంటూ స్టేట్మెంట్ ఇప్పించారంటే.. దీని వెనక ఏ రాజ‌కీయ కుట్ర కోణం లేద‌నుకోవాలా? అంటున్నార‌ట కొంద‌రు. మ‌రి చూడాలి.. ఇలాంటి కుట్ర కోణాలు ఇందులో మ‌రేవైనా దాగి ఉన్నాయో తెలియాల్సి ఉందంటున్నారు వీరు.  ఏది ఏమైనా మ్యాగీ చాలా పెద్ద త‌ప్పు చేశారు. ఇటు త‌న ఇంగ్లండ్ సంస్థ మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ కి, అటు హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీకి మాయ‌ని మ‌చ్చ తెచ్చారు. అంతే కాదు త‌న‌తో పాటు పాల్గొన్న ఇత‌ర కంటెస్టెంట్ల‌ను కూడా ఆమె ఒక ర‌కంగా వేశ్య‌ల‌ని ఇండెరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది త‌ప్ప కుండా కోటిన్న‌రకు పైగా జ‌నాభాగ‌ల స‌గ‌టు హైద‌రాబాద్ వాసి ఖండించాల్సి ఉందని అంటారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. మ‌రి మీరేమంటారు?  

సిట్‌ పిలిస్తే లిక్క‌ర్ స్కామ్‌లో సంచలన విషయాలు చెబుతా : ఎంపీ సీఎం ర‌మేశ్‌

  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో బీజేపీ ఎంపీ  సీఎం ర‌మేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చాలా విష‌యాల‌పై సిట్ ఇంకా పూర్తిగా దృష్టిసారించ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. సిట్ పిలిస్తే తాను వెళ్లి మద్యం కుంభకోణంలో బ‌య‌ట‌కు రాని విష‌యాలు వెల్ల‌డిస్తాని ఆయన అన్నారు. ఢిల్లీలోని త‌న నివాసంలో ఎంపీ సీఎం ర‌మేశ్ మీడియాతో మాట్లాడారు. జగన్ హ‌యాంలో లిక్కర్ షాపుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్ర‌తి నెలా రూ. 5 కోట్లు జ‌గ‌న్ మ‌నుషులు క‌మీష‌న్‌గా వ‌సూలు చేశారు. మ‌ద్యం దుకాణాలు, డిపోల వ‌ద్ద నియ‌మించిన దాదాపు 11వేల మంది సెక్యూరిటీ సిబ్బంది వేత‌నాల నుంచి కూడా క‌మీష‌న్ల రూపంలో నెల‌కు రూ. 3 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు నా వ‌ద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఆయ‌న అన్నారు.  ఇక‌, కరెంట్ కొనుగోళ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు. లేదంటే జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా అని సీఎం ర‌మేశ్ స‌వాల్ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబును వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అప్పుల సామ్రాట్ అని వ్యాఖ్యానించ‌డంపై కూడా సీఎం ర‌మేశ్ స్పందించారు. "మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం రాష్ట్రం ఏర్ప‌డే నాటికి రూ. ల‌క్ష కోట్ల అప్పు ఉంటే... ఆ త‌ర్వాత చంద్ర‌బాబు రూ. 2,49,350 కోట్ల అప్పు చేశారు. 2019-24 మ‌ధ్య కాలంలో త‌మ పాల‌న‌లో రూ. 3.32 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించుకున్నారు. గ‌త ముఖ్యమంత్రి కంటే దాదాపు రూ. ల‌క్ష కోట్లు అధికంగా అప్పు చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబును అప్పుల సామ్రాట్ అని విమ‌ర్శించ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంది" అని ఎంపీ తెలిపారు.  

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి

  పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్  వద్ద చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి షాపూర్  బెంగళూరు జాతీయ రహదారిపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలను కానిస్టేబుల్స్ తనిఖీ చేస్తున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.  వాహనం వద్దనున్న విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుల్స్ కు తీవ్రగాయాలైనట్లు సమాచారం. తోటి కానిస్టేబుల్స్ వారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ విజయ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. 

బలగం నటుడు కన్నుమూత

  ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు  మరణించారు. జీవీ బాబు మృతి పట్లా బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. 'ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది' అని పేర్కొన్నారు. కాగా, రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.  ఇందులో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. చాలా మందికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా, ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవీ బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతిచెంద‌డంతో సినీ ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది.  

కుప్పంలో చంద్రబాబు గృహప్రవేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు.    శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో  రెండు ఎకరాల స్థలంలో  చంద్రబాబు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి విదితమే. ఆ ఇంటిలో  ఆదివారం (మే 25) చంద్రబాబు దంపతులు గృహప్రవేశం చేశారు. శనివారం (మే 24) రాత్రికే చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్, బ్రహ్మణి దంపతులు కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు హస్తినలో నీటి అయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నేరుగా కుప్పం చేరుకున్నారు.  చంద్రబాబు గృహప్రవేశ మహోత్సవానికి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  దాదాపు  30 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా. చంద్రమాబునాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించారు.  ఆదివారం వేకువజామున 3 నుంచి 4 గంటల నడుమ గృహ ప్రవేశంను గోపూజ, పూజాది కార్యక్రమాలతో నిర్వహించారు.