హైదరాబాద్‌లో రూ.150 కోట్ల భారీ మోసం

  హైదరాబాద్ శివారు జీడిమెట్లలో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల కుచ్చు టోపీ పెట్టింది. ది పెంగ్విన్ సెక్యూరిటీస్' అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి రూ. లక్షకు రూ. లక్ష లాభం ఇస్తామని ప్రజలను నమ్మించారు.  వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1,500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు నిధులు సేకరించారు. వీరిని నమ్మి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో 1,500 మంది ఈ సంస్ధలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బీఆర్ఎస్ ప‌దేండ్ల‌లో రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు : కేటీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్   ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో టాప్ 5 మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల అతిపెద్ద క్యాంప‌స్‌లు నెల‌కొల్పాయి.  టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విప్లవాత్మ‌క విధానం లేదు. ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మ్యాగ్జిమ‌మ్ గ‌వర్నెన్స్ మా విధానం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి. తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు అందించామ‌ని ఆయన తెలిపారు.

దేశంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

  దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడని. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నామని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు,  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. మీ సిఐఐని మొదటి నుంచి నేను ప్రోత్సహించాను, మీ తరుపున మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని కోరుతున్నాని చంద్రబాబు తెలిపారు .1995లో దావోస్ వెళ్తున్నా అంటే, అప్పట్లో నన్ను వెళ్లొద్దు అనే వారు. పారిశ్రామికవేత్తలతో భేటీలు అయితే, ఓట్లు పోతాయని బెదిరించే వారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని.. సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని  సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లోనే ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని గుర్తుచేశారు. దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని తెలిపారు. భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు.  చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ భారత్‌ కంటే ఏడు రెట్లు ఎక్కువ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్‌కు లబ్ధి జరిగిందని తెలిపారు. 2047 విజన్‌ లక్ష్యంగా భారత్‌ సాగుతోందని చెప్పారు. సాంకేతిక విప్లవంలో చాలా మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు . ఏపీలో 15 శాతం వృద్ధి రేటు తన లక్ష్యమని అన్నారు.  అమరావతిలో దేశంలోనే తొలిసారి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. విశాఖపట్నానికి టీసీఎస్, గూగుల్‌, మిట్టల్‌ పరిశ్రమలు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు 

ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు : టీపీసీసీ చీఫ్

  మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని  టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు,  ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈటెల బీజేపీలో ఉన్నారా? బీఆర్‌ఎస్‌లో ఉన్నారా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని  ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారని ఆయన అన్నారు.  దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే బండి సంజయ్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలిగించారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు  భయపడే భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపేశారాని మహేష్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణాన్ని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధనం చెప్పాలని ఆయన తెలిపారు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని పీసీసీ చీఫ్ వెల్లడించారు.  

తెలంగాణ కేబినెట్ విస్తరణ... మరో వాయిదా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది.   తాజాగా మరో మారు రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లింది.  రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష పుల్లన అన్న చందాన ఆశావహుల్లో నిరాశ నింపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 లోగా మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ పార్టీ అధిష్ఠానం నుంచి  స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.  పనిలో పనిగా పీసీపీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రికి హస్తిన పిలుపు కూడా వచ్చింది. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ.. మళ్లీ ముహూర్తం ముడిపడలేదనీ, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదనీ హస్తిన వర్గాలు అంటున్నాయి.  గతంలో గవర్నర్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారు అయి అర్ధాంతరంగా రద్దైప సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అంతదాకా వచ్చి విస్తరణ ముహూర్తం వాయిదా పడటంతో అసలేం జరుగుతోంది? అధిష్ఠానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆశావహులను ఊరించి ఉసూరుమనిపిస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగాయి. ఇందు కోసం దాదాపు మూడు రోజుల పాటు సీఎం హస్తినలోనే మకాం వేశారు కూడా. అయినా కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 30న మరో సారి చర్చలు జరుపుదాం రండి అని అధిష్ఠానం సీఎంకు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం (జూన్ 30) హస్తిన పర్యటనకు రెడీ అయిపోయారు కూడా. అయితే.. చావు కబురు చల్లగా అన్నట్లు హైకమాండ్ ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అంటూ సమాచారం పంపడంతో రేవంత్ రెడ్డి తన హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందని స్పష్టమైంది. అదే విధంగా పీసీసీ కార్యవర్గం విషయంలో కూడా అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ముఖ్యంగా మంతివర్గ విస్తరణలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది హైక మాండ్ యోచనగా చెబుతున్నారు.   ఇక ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రిపదవుల ఆశతో నేతలు పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తారని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.    

కశ్మీర్ పూంచ్ బాధితులకు అమిత్ షా పరామర్శ

  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను  అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్ముకశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్‌ షా పేర్కొన్నారు. మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయిని షా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.  కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించారు. ‘మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పిరికితనంతో కూడిన చర్య. పాక్‌ దాడులలో పలువురు భారత పౌరులు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ  అవకాశాలు కల్పిస్తోంది. వారికి సంఘీభావం ప్రకటిస్తోంది’ అని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, ప్రజలు బలంగా కోరుకోవడం, ప్రధానమంత్రి నిర్ణయాత్మక నాయకత్వం, విలువైన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల అసమాన ప్రతిభ వల్లే అత్యంత భీకర దాడులు జరపగలిగామని అమిత్‌షా అన్నారు. వందలాది మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, తమపై దాడులు జరిపినట్టు పాక్ చెప్పుకుంటున్నప్పటికీ మన మిలటరీ కేవలం టెర్రరిస్టు శిబిరాలనే టార్గెట్ చేసిందని వివరించారు. ఒక్క ఇండియన్ ఆర్మీ పోస్ట్ కూడా దెబ్బతినలేదని, పాకిస్థాన్ పౌరులెవరికీ నష్టం జరగలేదని చెప్పారు. టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశామని  అమిత్ షా  తెలిపారు.  

ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ  సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రస్తావించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. వర్గీకరణ సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆనాటి పరిస్థితులపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.

తిరుమల భద్రంగా లేదా.. మరింత అలర్ట్ గా ఉండాలన్న డీజీపీ ఆదేశాల అర్దం అదేనా?

తిరుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో జే.శ్యామలరావు, సీవీఎస్ వో తదితరులతో ఆయన నిర్వహించిన సమావేశంలో తిరుమల భద్రత విషయంలో మరింత అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులనను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.  భక్తుల రక్షణ, ఆలయ భద్రత విషయంలో   స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు.   తిరుమల  హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఐదంచెల భద్రతా వ్యవస్థ 224 గంటలూ అప్రమత్తంగా ఉంటుంది.  రిజర్వు బెటాలియన్, ఏపీఎస్పీదళాలు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ , ఆ తరువాత ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధీటుగా ఎదుర్కొని, క్షణాల్లో అదుపుచేసే శక్తిసామర్థ్యాలు ఉన్న అక్టోపస్ దళాలు ఎల్లవేళలా తిరుమలలో సిద్ధంగా ఉంటాయి. అయినా కూడా భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో భద్రత విషయంలో సమావేశంలో తిరుపతి   టీటీడీ ఇన్ చార్జ్  సీవీఎస్ ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆయన డీజీపీకి వివరించారు.   

పెద్దల సభకు భారతీయుడు !

  రాజకీయ, సినిమా రంగాల సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ, సినిమా రంగాలు పాలు నీళ్ళలా కలిసి పోయాయి. తమిళ రాజకీయాలు అనగానే తెరఫై కొచ్చే, మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత మొదలు ద్రవిడ పార్టీల ముఖ్య నాయకులు చాలావరకు, సిల్వర్ స్క్రీన్’ తో ఓ వెలుగు వెలిగినవారో, వెలుగుతున్నవారో అవుతారు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్’ రాజకీయ స్టేజిపైనే కానీ, సిల్వర్ స్క్రీన్ పై నటించిన అనుభవం ఉండకపోవచ్చును.  కానీ,ఆయన తండ్రి మాజీ ముఖ్యమత్రి కరుణానిధి,కుమారుడు,ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ ఇద్దరూ, వెండి తెర వెలుగులే... ముఖ్యమంత్రి  స్టాలిన్’ కు కూడా సినిమా రంగంతో డైరెక్ట్ లింక్స్ లేక పోవచ్చేమో కానీ, పరోక్ష బంధాలు లేకుండా ఉండవు. అదలా ఉంటే, ఇప్పడు తమిళనాడు నుంఛి మరో ప్రముఖ నటుడు,రాజకీయ చిత్రం ‘భారతీయుడు’ సినిమా ఫ్రేమ్’  కమల్ హసన్’ అధికార డిఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. కమల హసన్’ తమిళ సినిమా ద్వారా బాల నటుడిగా పరిచయం అయినా, ఆ తర్వాత  తెలుగు’, హిందీ, కనడ భాషలు సహా అనేక భాషా చిత్రాల్లో నటించారు. బహు బాషా నటుడిగా గుర్తింపు, గౌరవం పొందారు. పురస్కారాలు అందుకున్నారు.కమల్ హసన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని మచ్చలు, మరకలు ఉన్నా, సినిమా నటుడిగా మాత్రం ఆయన అద్భుత ప్రతిభను చూపారు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ హసన్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు అందుకున్నారు. 2014లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.ఇక కమల్ హసన్ రాజకీయాల విషయానికి వస్తే, 2018లో అనూహ్యంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి, ఆ సమయంలో మరో ప్రముఖ తమిళ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న ముమ్మర ప్రచారం జరుగతున్న సమయంలో ఆయన ఎందుకో వెనక్కు తగ్గారు. ఆ సమయంలో కమల్ హసన్’ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి వామ పక్ష భావాలున్న వ్యక్తిగా, కూడా కమల్ హాసన్’  అదే అదే ఐడియాలజీతో సొంత పార్టీని తెరపైకి తెచ్చారు. రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో మార్పు కోసం, ‘మార్పే’ లక్ష్యంగా., మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. అయితే,పార్టీ పెట్టినప్పటి నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పోటీచేసింది. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ ఓడిపోయింది. కనీసం, ఓ చిన్న గెలుపు కూడా దక్కలేదు. హిట్’ అన్నదే లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ హీరో పార్టీ జీరోగా మిగిలింది.  చివరకు, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆశయంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హసన్’ స్వయంగా కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. అక్కడితో ఆయనకు, సినిమా, రాజకీయం ఒకటి కాదనే తత్త్వం బోధపడింది. ఇక చేసేది లేక చివరకు 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు  ఇండియా కూటమిలో చేరారు. ఎన్నికలలో పోటీ  చేయలేదు కానీ, డిఎంకేకు మద్దతు ఇచ్చారు. డిఎంకే అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు.అందుకు పారితోషికంగా కాదంటే ప్రతిఫలంగా ఆయన్ని రాజ్య సభకు పంపేందుకు అధికార డీఎంకే పార్టీ నిర్ణయించింది.తమిళనాడులో జులై 2025లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లలో నాలుగు డీఎంకే కూటమికి, రెండు అన్నాడీఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. డీఎంకే తమ నాలుగు సీట్లలో ఒకదాన్ని కమల్ హాసన్‌కు కేటాయించింది. సో.. చివరాఖరుకు చట్ట సభలో కాలు పెట్టాలన్న భారతీయుడదు, కమల హసన్ కల,ఈ విధంగా నెరవేరుతోంది.  రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, జరగనున్నాయి.నామినేషన్ల ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, ఈ మధ్యనే రాజకీయ అరంగేట్రం చేసిన మరో తమిళ హీరో, టీవీకే పార్టీ విజయన్’కు బీజేపీ వల విసిరింది. డిఎంకే అవినీతి పాలనను అంతమొందిచడమే ఇరు పార్టీల లక్ష్యం కాబట్టి,విజయన్ ఎన్డీఎలో చేరాలని, తమిళనాడు బీజేపే అధ్యక్షుడు, నయినార్‌ నాగేంద్రన్‌ .. విజయన్ను  ఆహ్వానించారు. హీరోగారూ అవినీతి డిఎంకే పార్టీని ఓడిద్దాం,మా కూటమిలోకి రండి,, అంటూ బహిరంగ ఆహ్వానం పలికారు. అయితే, విజయన్ పార్టీ పెట్టింది మొదలు, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. సో .. ఇప్పడు ఆయన తమ స్టాండ్ మార్చుకుని బీజేపీతో జట్టు కడతారా? ఎన్డీఎ కూటమిలో చేరతారా? అనేది తేలవలసి వుంది. కాగా, విజయన్’ను ఎన్డీఎ కుతమిలోకి తెచ్చేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’తో పాటుగా, తెలుగు దేశం పార్టీతో సంనిహతంగా ఉండే మరి కొందరు సినిమా ప్రముఖులు ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ని కలవాలని చాలా ప్రయత్నించాను..కలవలేకపోయాను : ఎమ్మెల్సీ కవిత

  పెద్దపల్లి జిల్లా మంచిర్యాల పర్యటనలో మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సొంత అజెండా ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని ఆమె అన్నారు. కమలం పార్టీతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్‌ని కలవాలని చాలా ప్రయత్నించాను  కలిసే అవకాశం వచ్చింది.. కానీ, కలవలేకపోయాను అని ఆమె అన్నారు. తాను రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. "నాకంటూ ప్రత్యేక జెండా గానీ, అజెండా గానీ లేవు. బీఆర్ఎస్ నా పార్టీ, కేసీఆరే నా నాయకుడు" అని కవిత మరోసారి తేల్చిచెప్పారు. పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.  బీజేపీతో పొత్తుల అంశంపైనా కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూడకూడదని...  బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. గులాబీ పార్టీలో నెలకొన్న సమస్యలు, పుట్టుకొస్తున్న కోవర్టుల గురించే తాను కేసీఆర్‌కు లేఖ రాశానని, ఇందులో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ముందు నా మీద దృష్టి తగ్గించి, ముందు ఆఉత్తరాన్ని లీక్ చేసిన వారిని పట్టుకోండి అని పార్టీ అధిష్ఠానానికి ఆమె హితవు పలికారు. ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరిన బీజేపీ ప్రభుత్వం మారణకాండ కొనసాగించిందని కవిత అన్నారు. అంతిమ సంస్కారాల కోసం మవోయిస్టు నంబాల మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వాలన్న కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ అని ఆమె ధ్వజమెత్తారు.  

పాక్ లోయ‌ధేచ్చ‌గా తిరుగుతున్న ప‌హల్గాం ఉగ్రదాడి సూత్ర‌ధారి!

అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. అక్క‌డ పీఎంఎంఎల్ అంటే పాకిస్తాన్ మ‌ర్క‌జీ ముస్లిం లీగ్ అనే ఒక రాజ‌కీయ పార్టీ ర్యాలీ నిర్వ‌హిస్తే అందులో ఒక‌డు క‌నిపించాడు. ఈ మ‌ధ్య అంటే, మే 28న అత‌డిని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేసింది ఐక్య  రాజ్య‌స‌మితి. అందుకు అత‌డ‌న్న మాట నేనిపుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంత‌కీ అత‌డు చేసిన ఘ‌న‌కార్యం ఏంట‌ని చూస్తే ప‌హెల్గాం దాడి ద్వారా 26 మంది భార‌తీయుల‌ ప్రాణాలు పోయేలా చేయ‌డం. (వీరిలో అత్య‌ధికులు హిందు పురుషులు) అతడి పేరు సైఫుల్లా కసూరి. ఇత‌డి వ్యూహ‌ర‌చ‌న కార‌ణంగా భార‌త్- పాక్ రెండు దేశాల మ‌ధ్య యుద్ధం వ‌చ్చి.. భారీ ఎత్తున ప్రాణ  న‌ష్టం ఆస్తి న‌ష్టం జ‌రిగింది. అకార‌ణంగా కొంద‌రు చ‌నిపోయారు. ఒక స‌మ‌యంలో కిరానా కొండ‌ల్లోని పాక్ అణు నిల్వ‌లు కానీ లీక్ అయి ఉంటే, ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. పాకిస్థానే ప్ర‌పంచ చిత్ర‌ప‌టంలో లేకుండా  పోయేది.. కానీ ఇత‌డికి కించ‌త్ కూడా జాలి- ద‌యా- క‌రుణ లేకుండా విచ్చ‌ల‌విడిగా పాకిస్తాన్ బాహ్య ప్ర‌దేశాల్లో  తిరుగుతూ.. కాల‌ర్ ఎగ‌రేస్తున్నాడు. ఇదే ర్యాలీలో ల‌ష్క‌రే తోయిబా చీఫ్ కొడుకు త‌ల్హా స‌యీద్, మ‌రో యూఎన్ ఉగ్ర‌వాది అమీర్ హంజా కూడా పాల్గొన్నారు.  త‌ల్హా స‌యీద్ అయితే పీఎంఎంఎల్ ద్వారా లాహోర్  నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసి.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాలని విఫ‌ల‌య‌త్నం చేశాడు. ఎందుక‌నో అది సాధ్యం కాలేదు. ఇత‌డు భార‌త్ కి కావ‌ల్సిన మోస్ట్  వాంటెడ్ టెర్ర‌రిస్టుల్లో 32వ వాడు. ఇత‌డు ఈ ర్యాలీ ద్వారా త‌న తండ్రి హ‌ఫీజ్ స‌యిద్ ని విడిపించాల‌ని డిమాండ్ చేశాడు, భార‌త్ సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దును పునః స‌మీక్షించాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నాడు.  ఇప్ప‌టికే ఈ ఉగ్ర సంస్థ‌కు చిన్న‌పాటి సైన్యం, విశ్వ  విద్యాల‌యం, రాజ‌కీయ పార్టీ ఉన్నాయి. వీటి ద్వారా వీరు భార‌త్ వ్య‌తిరేక‌త నూరి పోసి.. పాక్ ప్ర‌జ‌లను ఆక‌ర్షించి.. పాక్ పార్ల‌మెంటులో అడుగు పెట్టి త‌ద్వారా పాకిస్థాన్ని ఏలాల‌న్న‌ది వీరి ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఈ ఉగ్ర‌మూక‌ల కార‌ణంగా పాకిస్తాన్ నీటి క‌ట‌క‌ట‌ను ఎదుర్కుంటోంది.  మొన్న నీటి కొర‌త కార‌ణంగా సింధ్ ప్ర‌జ‌లు త‌మ‌ హోం మంత్రి ఇంటిని త‌గ‌ల‌బెట్టారు. తాజాగా పాక్ న‌టి హీనా బ‌య‌త్ క‌రాచీ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో నీళ్లు రావ‌డం లేద‌ని ఇన్ స్టా పోస్టు పెట్టింది. దీనంత‌టికీ  కార‌ణం ఎవ‌రు? య‌ధేచ్చ‌గా తిరుగుతున్న ఈ ల‌ష్క‌రే, జైషే ఉగ్ర‌వాదులు కారా? అదేంటో మ‌న భార‌త‌దేశంలో సోష‌ల్ మీడియా గ్రూపులైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్స‌ప్, టెలిగ్రామ్ లో ఒక చిన్న షేర్ కొట్టినందుకే మ‌న‌కు వార్నింగులు ఇస్తాయి. అదే పాకిస్తాన్ లో ఈ ప్లాట్స్ ఫామ్స్ మీద నుంచి జైషే అనే ఉగ్ర సంస్థ ఏకంగా ఉగ్ర‌వాద ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. విరాళాలు కావాలంటూ అభ్య‌ర్ధ‌న‌లు చేస్తోంది. కొత్త ర‌క్తం ఎక్కించ‌డానికి పాక్ యువ‌త‌కు వ‌ల వేస్తోంది. డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ వేదిక‌గా.. పెద్ద పెద్ద ఉగ్ర‌వాద‌ చానెళ్ల‌ను న‌డిపేస్తోంది. ఇక్క‌డ ఉగ్ర‌వాదం ఎంత బ‌హిర్గ‌త‌మో చెప్పేలా ఏకంగా బాహావ‌ల్పూర్ వీధుల్లో ఆగ‌స్ట్ 25న జిహాదీ క‌విత్వం విన‌డానికి ర‌మ్మంటూ ఆహ్వాన ప‌త్రిక‌ల‌తో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో మొన్న భార‌త్ దాడుల్లో చ‌నిపోయిన ఉగ్ర‌వాదుల చిత్ర‌ప‌టాలు వేసి మ‌రీ మ‌సూద్ అజ‌ర్ పేరిట పోస్ట‌ర్లు వేసి మ‌రీ పిలుస్తున్నారు. ఇదే మ‌సూద్ అజ‌ర్ కి 14 కోట్ల రూపాయ‌ల నిధులు మంజూరు చేసింది పాకిస్థాన్. ఇతడు ఎంత‌టి భార‌త వ్యతిరేక ఉగ్ర‌వాదో చెప్ప‌న‌ల‌వి కాదు. మ‌న భార‌త భూభాగానికి అనేక సార్లు ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించిన ఉగ్రవాది. అలాంటి వాడికి నిధులిస్తూ ఆ దేశ ప్ర‌ధాని హెహ‌బాజ్ ష‌రీఫ్ భార‌త్ తో శాంతి చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధ‌మేన‌ని పిలుపునిస్తాడు. ఇలాంటి పాకిస్థాన్ కి ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంకులు సుమారు 25 బిలియ‌న్ డాల‌ర్లు ఇస్తోంది. మ‌రి ఇదే అంత‌ర్జాతీయ సంస్థ అయిన ఐక్య‌రాజ్య‌స‌మితి క‌సూరీ వంటి వారిని ఉగ్ర‌వాద ముద్ర వేయ‌డ‌మేంటి? ఇలాంటి వాళ్ల‌కు పాకిస్థాన్ త‌న‌కొచ్చే ఐఎంఎఫ్ ఇత‌ర నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించి వారిని ఎంక‌రేజ్ చేయ‌డమేంటి?  ఉగ్ర‌వాదులు త‌మ దేశంలో ఇంత బాహ‌టంగా తిరుగుతుంటే.. భార‌త్ తో శాంతి చ‌ర్చ‌ల‌కు ఈ దేశం మ‌ళ్లి మ‌ళ్లీ పిల‌వ‌డ‌మేంటి???  ఈ యుద్ధం ఇక్క‌డితో ముగియ‌లేదు. దీనికి ఎక్క‌డో ఒక చోట భార‌త్ ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే. ఈ దిశ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పాక్ పీచ‌మ‌ణ‌చాల్సిందే. తాజాగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ పీవోజేకే(పాక్ ఆక్ర‌మిత జ‌మ్మూ కాశ్మీర్) వారే  తిరిగి భార‌త్ లో క‌లుస్తామ‌ని అడ‌గ‌టానికి ఎన్నో రోజులు లేవ‌ని అంటున్నారు. ఈ దిశ‌గా భార‌త్ పాకిస్థాన్ నుంచి పీవోజేకేని లాగేసుకోవ‌డంతో పాటు బ‌లూచిస్తాన్ కి కూడా స‌పోర్టు చేయాలి. ఇలా పాక్ ఎకో సిస్ట‌మ్ ని దారుణంగా దెబ్బ తీసి ఆ దేశంలో ఉగ్ర‌వాదం  అన‌డానికే ఒణికి చావాలి. భార‌త్ పై ఈ సారి దాడి చేయ‌డానికే సాహ‌సించే య‌త్నం చేయ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుకుందాం. జైహింద్!

కమలంలో కారు విలీనం?.. తెర పైకి కొత్త చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని  మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ  అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు. వరంగల్ రజతోత్సవ సభలో  కేసీఆర్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి అవలంబించారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  బీజేపీని గట్టిగా తిట్టకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయనే తప్పుడుసంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అంటూ..  కేసీఆర్ తమ ప్రసంగంలో కేవలం రెండు నిముషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని నెగటివ్ పాయింట్స్ లో  చేర్చారు.  ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న  కొత్త చర్చను తెర పైకి తెచ్చారు. అయితే..  కవిత లేఖలో పేర్కొన్న అంశాలలో కొంత నిజం ఉన్నా..  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎలా చూసిన అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని..  ఒక్క ఏన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చేయరని ఆయన సన్నిహితులు అంటున్నారు.  నిజానికి.. గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్  తెలంగాణ సాధించుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్  ముందు విలీనం ప్రతిపాదనను ఉంచారని..  ఒక పావుగా మాత్రమే విలీనం ప్రతిపాదన  చేశారని  కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు.  అయితే..  బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టి వేయలేమని మాజీ మిత్రులతోపాటుగా,  ప్రస్తుత పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి..  ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల పొత్తు ఉభయ తారకంగా రెండు పార్టీలకూ లాభ దాయకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటుగా  ఉభయ పార్టీలలో ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. అయితే..  అదే సమయంలో రెండు పార్టీలలోనూ కూడా పొత్తు వద్దనే వాదన కూడ అంతే బలంగా వినిపిస్తోందని అంటున్నారు.    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, ఉభయ పార్టీల ఓటు షేర్ లో వస్తున్న మార్పును గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ ఓటు పరస్పరం బదిలీ అవుతున్న వైనం కనిపిస్తుందని  విశ్లేషకులు అంటున్నారు.  ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. బీజేపీకి వచ్చిన ఓటు షేర్  జస్ట్ 7 శాతం. అసెంబ్లీలో కమలానికి దక్కింది ఒక్కటే సీటు..  కానీ, ఆతర్వాత కొద్ది నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్  ఏకంగా 20 శాతానికి పెరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గింది.  అలాగే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి.  కానీ.. 2024లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఓటు షేర్ ఏకంగా 35 శాతానికి చేరింది.  అసెంబ్లీ స్థానాలతో సమానంగా  8 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మరోవంక అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఓటు షేర్ లోక్ సభ ఎన్నికల్లో  17 శాతానికి పడిపోయింది. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ఓటర్లలో 20 శాతం మంది లోక్ సభ ఎన్నికల్లో కమలానికి ఓటు వేశారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్ లో మార్పు అంతగా లేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓటుతో 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, అదే 40 శాతం ఓటుతో లోక్ సభ ఎన్నికలలో 8 సీట్లు తెచ్చుకుంది. సో.. కళ్ళ ముందున్న ఓటు షేర్ లెక్కలు.  ఓటు ట్రాన్స్ఫర్  ప్యాట్రన్  ను గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉభయతారకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా, జాతీయ పార్టీగా బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు, కేంద్రంలో అధికారం కీలకం. అదే విధంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్  కు అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, రాష్టంలో అధికారం కీలకం అవుతుంది. సో.. పొత్తుకు ఉభయ పార్టీలు ఒకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.  అయితే.. నడుస్తున్న చరిత్రను గమనిస్తే, గడచిన పాతికేళ్ళ ప్రస్థానంలో బీఆర్ఎస్  కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, బీజేపీతో మాత్రం ఏనాడూ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాల లేదు. మరో వంక   కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలలో కలిసి పనిచేసింది. ఉభయ పార్టీలూ చెట్టపట్టాల వేసుకుని పనిచేయడమే కాదు, ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని, బీఆర్ఎస్ తో పొత్తు వద్దకునే బీజేపీ నాయకులు చరిత్రను తిరగేస్తున్నారు. అలాగే, కమలంతో పొత్తు వద్దనుకునే  బీఆర్ఎస్ నాయకులు, డీఎన్ఎలు కలవని బీజేపీతో పొత్తు వలన దీర్ఘ కాలంలో ప్రమాదమే  పేస్ చేయవలసి ఉంటుందని అంటున్నారు.  సో .. కవిత చెప్పిన విలీనం ఉండక పోవచ్చిని, అయితే గియితే కారు కమలం మధ్య తొలి  ‘పొత్తు’ పొడిచే అవకాశం లేక పోలేదని అంటున్నారు.

డ్యూటీ ఎక్కిన దువ్వాడ వాణీ!.. టెక్కలి వైసీపీలో మళ్లీ మొదలైన మూడుముక్కలాట!

రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మధురిల వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జిటిక్ ఫ్యామిలి డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సేన్షేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాధురి ప్రవేశించడం.. అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం.. క్లైమాక్స్ లేని కధగా మారింది. ఇప్పటికీ ఈ వ్యవహారంలో అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. దువ్వాడ వాణి తన నిరసనను మాని.. మాయం అవ్వడంతో.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పీడ్ పెంచారు. వరుసగా ఇంతర్వ్యులు ఇస్తూ.. విడాకులు వచ్చిన వెంటనే తమ వివాహం అంటూ... శ్రీనుకు వారసుడిని కూడా ఇస్తాను అంటూ తమ పెయిర్ ను వైరల్ చేసుకున్నారు. ఓ వైపు శ్రీను, మాధురి స్పీడ్ పెంచడంతో పూర్తిగా మ్యుట్ అయిపోయారు దువ్వాడ వాణి.. అయితే జగన్ కు వీర భక్తుడిగా ముద్ర పడ్డ దువ్వాడ శ్రీను.. టెక్కలి వైసిపి ఇంచార్జ్ విషయంలో విభేదాలు రావడం, జగన్ మాటకు అడ్డు చెప్పడం స్టోరీలో పెద్ద ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. డామిట్.. కధ అడ్డం తిరిగింది అన్నట్టుగా.. వైసిపి నుండి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడం తో.. మిగిలిన కధను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్ళీ తెరపై ప్రత్యక్షం అయ్యారు దువ్వాడ వాణి.   మొదట్లో టెక్కలి వైసిపి ఇంచార్జ్ పెరాడ తిలక్ వెనుక ఉంటూ వచ్చిన వాణి.. ఇప్పుడు ఇండివిడ్యుయల్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టెక్కలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శలలో గడచిన కొద్ది రోజులుగా చురుకుగా పాల్గొంటున్న దువ్వాడ వాణి.. మళ్ళీ తన క్యాడర్ కు వేకప్ కాల్ ఇచ్చేసారు. దువ్వాడ వాణి ఇచ్చిన వేకప్ కాల్ తో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నా.. ఎక్కడ మళ్ళీ తమ ఇంచార్జ్ సీటుకు ఎసరు పెడతారో అన్న ఆందోళన మాత్రం పెరాడ తిలక్ వర్గీయులలో కనిపిస్తోంది. గతంలో దువ్వాడ శ్రీనుకు, పెరాడ తిలక్ వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి.. దువ్వాడ శ్రీను సస్పెన్షన్  తో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి..  దువ్వాడ వాణీ రాకతో కోతకు గురవుతుందా అన్న ఆందోళన కూడా స్థానిక వైసిపి  శ్రేణుల్లో లేకపోలేదు. ఇకోవైపు.. జగన్ కోపం తాత్కాలికమే అనీ.. మళ్ళీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానని దువ్వాడ శ్రీను కుడా స్టేట్మెంట్ లు ఇస్తుండటం కూడా తిలక్ సేనను ఇరుకున పెడుతోంది. దీంతో చాలాకాలం తరువాత మళ్ళీ టెక్కలి వైసిపిలో మూడు ముక్కలాట మళ్ళీ మొదలైందనే చెప్పుకోవచ్చు. 

చరిత్ర సృష్టించాం.. కడప మహానాడుపై తెలుగుదేశం నేతలు

కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు తో చరిత్ర సృష్టించామని  ఆ పార్టీ సీనియర్ నేతలు అన్నారు. మూడు రోజుల పాటు కడప వేదికగా జరిగిన మహానాడు విజయవంతమైన నేపథ్యంలో శుక్రవారం (మే 30) తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి,  ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, పుత్తా చేతన్య రెడ్డి, మాధవి రెడ్డి , ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి,  తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి,   జగన్మోహన్ రాజు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై విశ్వాసం, నమ్మకంతోనూ రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వారు చెప్పారు.  కడప వైఎస్ జగన్ అడ్డా అన్న అపోహ ఈ మహానాడుతో తొలగిపోయిందనని వారు అన్నారు.  కడపలో తెలుగుదేశం మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం వైఎస్ కుటుంబానికి చెంప పెట్టు లాంటిదని  పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కడపలో నిర్వహించేందుకు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు వేదికపై నుంచి ముఖ్యమంత్రి ప్రకటించిన కడప ఉక్కు పరిశ్రమ , సాగునీటి ప్రాజెక్టులు ఇంకా  ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ,వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ  పూర్తి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులు,నేతలందరికీ  కృతజ్ఞతలు తెలిపారు.  

రామనారాయణంలో వినూత్నంగా యోగాంధ్ర

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమం వినూత్నంగా నిలిచింది. పర్యాటక ప్రదేశం అయిన రామనారాయణం లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో  రామధనస్సు ఆకృతిలో పదిహేను వందలమంది యోగాసనాలు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. అక్కడివారితో కలసి యోగా చేశారు.   ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో యోగాంధ్ర కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క కేంద్రం రామ‌నారాయ‌ణంలో శుక్ర‌వారం (మే 30) జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన‌ రామ‌నారాయ‌ణుని పాదాల చెంత రామ‌ధ‌నుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ స‌హా సుమారు 1500 మంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది,  ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు యోగాస‌నాలు వేశారు. ఉద‌యం ఏడుగంటలకే   పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, యోగ ప‌ట్ల ఆస‌క్తి గ‌ల వారంతా తెల్ల‌ని దుస్తులు ధ‌రించి యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వ‌ర్యంలో యోగ గురువులు డాక్టర్ ఆరిశెట్టి ఇందుమ‌తి,  సుంద‌ర‌శివ‌రావులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ అంద‌రితో సుమారు 45 నిముషాల పాటు ప‌లు యోగ‌సనాలు వేయించారు.   ఈ సంద‌ర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం యోగా ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ఉద్దేశ్యంతో ఈ నెల‌ను యోగా మాసంగా ప్ర‌క‌టించి అన్ని ప్రాంతాల్లో యోగ శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేసి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. యోగా మ‌న పూర్వీకులు మ‌నకు అందించిన గొప్ప ఆస్తి అన్నారు. దీనిని సాధ‌న చేయ‌డం ద్వారా   ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌చ్చనీ, ఈ దిశగా  ప్ర‌తి ఒక్క‌రినీ ప్రోత్స‌హించ‌డం యోగాంధ్ర ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. జూన్ 21న అంత‌ర్జాతీయ దినోత్స‌వంలో పాల్గొనేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి విశాఖ వ‌స్తున్నార‌ని ఆరోజున రాష్ట్రమంత‌టా ప్ర‌తి గ్రామంలో యీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌పంచానికి యోగా విశిష్ట‌త‌ను తెలియ‌జేసే ఉద్దేశ్యంతో  ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నెల‌రోజుల యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలోని నాలుగు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని మొద‌ట‌గా రామ‌నారాయ‌ణంలో   ఏర్పాటు చేశామ‌న్నారు. జూన్ నెల‌లో చింత‌ప‌ల్లి బీచ్, రామ‌తీర్ధం, తాటిపూడి రిజ‌ర్వాయ‌రు త‌దిత‌ర ప్ర‌దేశాల్లోనూ యోగాంధ్ర‌లో భాగంగా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశామ‌న్నారు. జూన్ 10వ తేదీన జిల్లాకు చెందిన 5 వేల మంది ఉపాధి ప‌థ‌కం వేత‌న‌దారుల‌తో యోగాస‌నాలు ప్ర‌ద‌ర్శించే కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం జీవితంలో యోగ‌ను భాగంగా చేసుకోవాల‌న్నారు. యోగాస‌నాల ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంద‌రికీ రామ‌నారాయ‌ణ ద‌ర్శ‌నాన్ని క‌ల్పించ‌డంతోపాటు తీర్ధ ప్ర‌సాదాల‌ను ఎన్‌.సి.ఎస్‌.ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు.

బీఆర్ఎస్ ది దుష్ప్రచారం.. బనకచర్ల ఆగదు!

బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు ఆగదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప వేదికగా జరిగిన మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఆయన మాట్లాడారు.   క‌ర్నూలు జిల్లా బ‌న‌క‌చ‌ర్ల‌లో నిర్మించే భారీప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రంతో పలుమార్ల చర్చించినట్లు తెలిపారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచర్లలో నిల్వ చేసి కర్నూలు జిల్లా సహా సీమ ప్రాంత ప్రజలకు అందించడమే తన లక్ష్యం, సంకల్పం అని ప్రకటించారు.  అంశాన్ని ప్ర‌స్తావించారు. గోదావరి జ‌లాల‌ను పోల‌వ‌రం ద్వారా.. మ‌ళ్లించి.. బ‌న‌క‌చ‌ర్లలో నిల్వ చేసి.. క‌ర్నూలు స‌హా రాయ‌లసీమ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అందించాల‌న్న‌ది త‌మ సంక‌ల్పంగా చెప్పుకొచ్చారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రాచారమేనని చెప్పిన ఆయన వృధాగా ఉప్పు సముద్రం పాలౌతున్న గోదావరి జిలాలను సద్వినియోగం చేసుకునేందుకుకే ఈ ప్రాజెక్టు కుట్టుకుంటున్నామన్నారు.  దీనిని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు.   స‌ముద్రంలో పోయే నీటిని వాడుకుంటే త‌ప్పా? ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తే ఓర్చుకోలేరా? అని బీఆర్ఎస్ ను సభా ముఖంగా నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన క్లారిటీ ఇచ్చారు.  ఏ ప్రాజెక్టు క‌ట్టినా.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు బాగుండాల‌నేదే త‌మ ఉద్దేశ‌మ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

వెల్దీ, హెల్దీ, హ్యాపీ.. చంద్రబాబు నినాదం

ఆరు శాసనాలతో నూతనత్వాన్నీ, కొత్త నాయకత్వాన్నీ తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న ఆరు శాసనాలనూ తు.చ. తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వీటి ద్వారా అద్భుత ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాదీ ప్రోగ్రస్ రిపోర్టు ఇస్తామని, ఎంత సాధించాం.. ఇంకా సాధించాల్సిందేమిటి?  అంశాలను సమీక్షించుకుని 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  పార్టీకి కార్యర్తే అధినేత అని పునరుద్ఘాటించారు.   ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షల 67 వేలు. వచ్చే 22 ఏళ్లలో దానిని రూ.55 లక్షలే చేసే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పిన ఆయన. వెల్దీ, హెల్దీ, హ్యాపీ అన్నదే మన నినాదం అన్నారు. కోడూరు నుంచి సైకిల్‌పై   మహానాడుకు హాజరైన కార్యకర్తను ఈ వేదికపై సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభా ముఖంగా హామీ ఇచ్చారు. 

రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ నంబర్ వన్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కడప వేదికగా జరిగిన మహానాడు ముగింపు సందర్భంగా గురువారం  (మే29) సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు. మహానాడు వేదికగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. సీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనిజమే అన్న ఆయన ఈ విషయాన్ని ఆనాడే గుర్తించామని చెప్పారు. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండొద్దనే తాను కఠినంగా వ్యవహరించానని గుర్తు చేశారు.   సీమ అభివృద్ధికి తన వద్ద  ప్రత్యేక బ్లూప్రింట్ ఉందని చెప్పిన ఆయన విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  పారిశ్రామిక కారిడార్లతో  సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలన్నదానిపై పక్కా ప్రణాళిక ఉందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఇఈర్, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూని వర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తీసుకువచ్చామన్నారు. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90 శాతం నిర్మిస్తే... గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు ఆ హజ్ హౌస్ ను 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తామని చెప్పారు.  లేపాక్షి - ఓర్వకల్ కారిడార్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.  కడప స్టీల్ ప్లాంట్‌కు గతంలో తాను శంకుస్థాపన చేశాననీ, దానికే మళ్లీ భూమిపూజ చేసి జగన్ నాటకాలాడారనీ చెప్పిన చంద్రబాబు  వచ్చే నెల 12 లోగా  కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఫేజ్ 1లో రూ.4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో రూ.4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనీ, దీనిని పూర్తి చేసి 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. 

క‌మ‌ల్ హాస‌న్ కన్నడ కాంట్రవర్సీ

నిజంగానే క‌న్న‌డ త‌మిళంలోంచి  వ‌చ్చిందా?  ద‌క్షిణాది ప్రాచీన భాష‌లేవి!  నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట  ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్. తెలుగులో ఒక‌టి- క‌న్న‌డ‌లో ఒందు అంటూ మొద‌లు పెడితే.. దాదాపు క‌న్న‌డ భాషకు తెలుగుకు విశేష సంబంధాలున్నట్టు క‌నిపిస్తుంది. తేట తేట తెలుగు, క‌న్న‌డ క‌స్తూరి, సెంత‌మిళ్, మ‌ల‌యాళ మ‌నోర‌మ‌... ఇవీ ద‌క్షిణ ద్ర‌విడ భాష‌లు. ఇంత‌కీ ఈ ద్ర‌విడం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. ద్ర‌విడ భాష‌ల్లోకి త‌మిళ్ ముందా లేక క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌లా అని చూస్తే.. అస‌లు త‌మిళ్ అన్న‌ది ఎలా పుట్టిందో తెలుసుకోవ‌ల్సి ఉంటుంది.. ద్రవిడ‌మునకు పూర్వరూపము ద్రమిళమని అంటారు. ఇదే ద్రవిడముగ సంస్కృతమున నిలచిన‌ట్టు చెబుతారు. ప్రాకృత భాషల్లో తిరమడ, తిరమిళ, తమిళ అంటూ ఈ భాష అనేక‌ రూపాంత‌రాలు చెందిన‌ట్టుగా చెబుతుంది భాషా చ‌రిత్ర‌. ద్రమిళమే త‌మిళానికి మొద‌టి ప‌దం.  ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ  శబ్దములు ధ‌ర్మ శ‌బ్దాల నుంచి వ‌చ్చాయ‌ని అంటారు. దీంతో పాటు ద్ర‌విడ భాష‌ల్లో కూడా ర‌క‌ర‌కాలుంటాయి. ద్రావిడ భాషా కుటుంబంలో ప్రాధాన్య‌ తాంశాలేంట‌ని చూస్తే.. తొలుత త‌మిళ భాష‌- త‌ర్వాత‌ క‌న్న‌డ భాష‌ క‌నిపిస్తాయి. త‌ర్వాత‌ మధ్య ద్రావిడ భాషా కుటుంబం క‌నిపిస్తుంది. ఇందులో తెలుగు ప్ర‌ధాన  భాష‌. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం కురుఖ్ వంటి భాష‌లున్న‌ట్టు చెబుతంది మ‌న ద్ర‌విడ భాషా చ‌రిత్ర‌. అంటే ద్ర‌విడంలోనే అనేక భాష‌లు వాటికి గ్రెడేషన్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ అంత న‌మ్మ‌కంగా ఎలా చెప్ప‌గ‌లిగారంటే.. ద్ర‌విడ భాష‌ల పెద్ద‌న్న త‌మిళం. త‌ర్వాతే క‌న్న‌డ‌. ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, ఆపై ఇత‌ర భాష‌లు. అందుకే ఆయ‌న అంత గ‌ట్టిగా త‌న‌కు చ‌రిత్ర కారులు చెప్పార‌ని గట్టిగా అంటున్నారు. నిజానికైతే తెలుగు క‌న్న‌డ ద‌గ్గ‌ర ద‌గ్గ‌రగా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. ఆ భాష రాత‌లోగానీ పిలుపులోగానీ ఆ సొబ‌గు ఈ రెండింటి మ‌ధ్యే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. మీరు కావాలంటే  చూడండీ.. క‌న్న‌డ వాళ్ల‌తో తెలుగు మాట్లాడి  నెగ్గుకు రాగ‌లం. త‌మిళ‌వాళ్ల ముందు మ‌ల‌యాళం మాట్లాడి నెగ్గుకు రాగ‌లం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటిది త‌మిళానికీ క‌న్న‌డానికీ సంబంధ‌మేంట‌న్న‌ది అర్ధంకాని చిక్కు ప్ర‌శ్న‌. అస‌లు ద్ర‌విడం అంటేనే బౌద్ధ ధ‌ర్మంలోంచి పుట్టింద‌నీ.. ఆ ధ‌ర్మ‌మే ద్ర‌విడంగా త‌ర్వాత త‌మిళంగా పుట్టుకొచ్చింద‌ని మ‌న‌కు చెబుతోంది భాషా చ‌రిత్ర‌.  ద్ర‌విడ భాష‌లు దాని వంశ వృక్షం విష‌యానికి వ‌స్తే.. మూల ద్రావిడ భాష దాన్లోంచి ఉత్త‌ర ద‌క్షిణ భాష‌లు పుట్టుకొచ్చాయి. వాటిలో ద‌క్షిణ భాషల్లోంచి త‌మిళం పెద్ద‌న్న‌గా ఉండ‌గా క‌న్న‌డ అందులోంచి పుట్టుకొచ్చిన మ‌రో కొమ్మ‌లా క‌నిపిస్తుంది. ఈ కోవ‌లోనే మ‌ల‌యాళం కూడా పుట్టుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది.  అంటే త‌మిళ‌మే ఈ భాష‌ల‌న్నిటికీ  హెడ్ క్వార్ట‌ర్. మ‌రి క‌న్న‌డిగుల‌కు ఈ విష‌యం తెలీదా? ఎందుక‌ని క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్ మూవీ థ‌గ్స్ అండ్ లైఫ్.. సినిమాతో పాటు ఇత‌ర చిత్రాలేవీ ఆడ‌నివ్వ‌మంటున్నారు.. ఇందుకు రీజ‌న్లు ఏమై ఉంటాయ్? అని చూస్తే ఆత్మ‌గౌర‌వ ప్ర‌శ్న‌. ఎవ‌రికి వారు మేమంటే మేమే గొప్ప అనుకుంటారు. అలాంటిది వాళ్ల‌కు వాళ్లు గొప్ప‌. క‌న్న‌డిగుల‌కు అస‌లే ఆత్మాభిమానం ఎక్కువ‌.  ఇప్ప‌టికే కావేరీ స‌మ‌స్య ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఉంది. కావేరీ న‌ది పుట్టింది క‌ర్నాట‌క‌లోని త‌ల‌కావేరీ ప్రాంతంలో. అక్క‌డి నుంచి అది త‌మిళ‌నాడు దిశ‌గా ప్ర‌వ‌హించి బంగాళా ఖాతంలో క‌లిసేది తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల ఈ గొడ‌వ ఇప్ప‌టిది కాదు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాక పోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణం కూడా ఇదే.  ర‌జ‌నీ(మ‌రాఠీ అయిన‌ప్ప‌టికీ) పుట్టింది క‌ర్ణాట‌క‌లో.... ఎంతైనా పుట్టిన ప్రాంత అభిమానం అంటూ ఒక‌టి ఉంటుంది కాబ‌ట్టి.. ఆయ‌న్ను త‌మిళులు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నివ్వ‌లేదని అంటారు. ఆయ‌న కూడా ఎందుకొచ్చిన గొడ‌వ అంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అదే క‌మ‌ల్ హాస‌న్ త‌న మ‌క్క‌ల్ నీతి మ‌య్యం అనే పార్టీ స్థాపించి.. డీఎంకేతో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు కూడా వెళ్తున్నారు. అది వేరే విష‌యం అనుకోండి. త‌మిళ క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కున్న గొడ‌వ‌లు ఈనాటివి కావు.. కావేరీ జ‌లాల విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇప్ప‌టికే కొన్ని ప‌దుల సంఖ్య‌లో గొడ‌లు జ‌రిగాయ్. ఎప్ప‌టి నుంచో క‌న్న‌డిగుల‌కు మ‌రో  స‌మ‌స్య కూడా ఉంది. త‌మ సినిమాలు ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ సినిమాల ముందు తేలిపోతున్నాయ‌ని భావించిన వీరు డ‌బ్బింగ్ చిత్రాల‌పై బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేద్దామా? అని చూస్తున్న వారికి క‌మ‌ల్- క‌న్న‌డ కామెంట్స్ మ‌రింత కాక పుట్టించాయ్. దీంతో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలాగైనా వాడుకోవాల‌న్న‌ది ఇంకో ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.