తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు!
posted on May 26, 2025 @ 1:08PM
తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు సోమవారం ( మే 26) సాయంత్రానికి తాకనున్నాయి. నిన్నటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను విస్తరించిన రుతుపవనాలు.. ఈ ఏడాది వారం ముందుగానే కేరళ తీరాన్ని తాకిన సంగి తెలిసిందే. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ ఏడాది మాత్రం ఐదు రోజుల ముందుగానే కేరళను తాకాయి. దానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఇవి చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో దేశలోని పలు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళఖాతంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే తొలకరి వానలు మొదలయ్యాయి. అలాగే కర్ణాటక మరఠ్వాడ వద్ద ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటలలో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కర్నాటక, తెలంగాణ, రాయలసీమలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురుస్తాయని వివరించింది.